తెలంగాణ పవర్ వాడకానికి ‘కరోనా’ బ్రేక్
– 5వేల మెగావాట్లు తగ్గిన విద్యుత్ వినియోగం దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్ ప్రభావం రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌పై తీవ్రంగా పడింది. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ ఫిబ్రవరి పీక్ నుంచి ఏకంగా 5 వేల మెగావాట్లు పడిపోయింది. రబీలో సాగు చేసిన పంటలకు ఫిబ్రవరి నెలలో వాడకంతో పాటు కాలేశ్వరం, కల్వకుర్తి వంటి లిఫ్టులు పనిచేయడంతో విద్యుత్ డిమాండ్ ఒక దశలో 13168 మెగావాట్లను తాకింది. ఆ నెల 28వ తేదీన నమోదైన ఈ […]
– 5వేల మెగావాట్లు తగ్గిన విద్యుత్ వినియోగం
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్ ప్రభావం రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌పై తీవ్రంగా పడింది. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ ఫిబ్రవరి పీక్ నుంచి ఏకంగా 5 వేల మెగావాట్లు పడిపోయింది. రబీలో సాగు చేసిన పంటలకు ఫిబ్రవరి నెలలో వాడకంతో పాటు కాలేశ్వరం, కల్వకుర్తి వంటి లిఫ్టులు పనిచేయడంతో విద్యుత్ డిమాండ్ ఒక దశలో 13168 మెగావాట్లను తాకింది. ఆ నెల 28వ తేదీన నమోదైన ఈ పీక్ రికార్డు ఉమ్మడి ఏపీలో నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ రికార్డును చెరిపేసిందంటేనే.. తెలంగాణ విద్యుత్ డిమాండ్‌లో వృద్ధి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, మంగళవారం మాత్రం రాష్ట్రంలో విద్యుత్ గరిష్ట డిమాండ్ భారీ స్థాయిలో తగ్గి కేవలం 8231 మెగావాట్లుగా నమోదైంది. కేవలం 39 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో డిమాండ్ దాదాపు 5 వేల మెగావాట్లకు పడిపోవడానికి.. కరోనా నియంత్రణకు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌనే కారణమని తెలుస్తోంది.
తెలంగాణ ఏర్పడినప్పుడు కేవలం 5661 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్.. ఆరేండ్లలోనే 132.6 శాతం వృద్ధిని సాధించింది. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం సైతం దేశ తలసరి విద్యుత్ వినియోగంతో పోలిస్తే 715 యూనిట్లు ఎక్కువగా ఉంది.
లాక్ డౌన్ రోజు నుంచి హైదరాబాద్ నగర పరిధిలో విద్యుత్ అందించే పంపిణీ సంస్థ(డిస్కం) టీఎస్‌ఎస్పీడీసీఎల్ పరిధిలో కరెంటు డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ఈ డిస్కం పరిధిలో వ్యవసాయ కనెక్షన్లు తక్కువగా ఉండి వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ నగరంలోని వాణిజ్య కార్యకలాపాలన్నీ ఆగిపోయి, నగరం చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడల్లో ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లో మాత్రం లాక్ డౌన్ తర్వాత సైతం గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్‌లో 1000 మెగావాట్ల వృద్ధి కనిపించింది. ఈ డిస్కం పరిధిలో బోర్ల మీద ఆధారపడి వేసిన రబీ పంటలు అధికంగా సాగులో ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వ్యవసాయ కనెక్షన్లతో పాటు భారీ లిఫ్టులు కలిగిన కాలేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టు సైతం ఈ డిస్కం పరిధిలోనే ఉండడం మరో కారణం.
తాజాగా వ్యవసాయ పంటల సాగు పూర్తవడంతో రైతులు బోర్ల వాడకం దాదాపు తగ్గించేశారు. దీనికి తోడు కాలేశ్వరం లిఫ్టుల వాడకం కూడా ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి. ఈ పరిణామాల వల్ల ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది.
కాగా, వేసవి కాలం కావడం, లాక్ డౌన్ అమల్లో ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం మూలాన గృహ విద్యుత్ కేటగిరీలో వినియోగం భారీగానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, ఈ కేటగిరీలోనూ ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెద్దగా లేదనే తెలుస్తోంది. కరోనా వ్యాప్తి భయంతో ఏసీలు, కూలర్ల వాడకాన్ని ప్రజలు అవాయిడ్ చేస్తుండటం, పగలు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటున్నప్పటికీ రాత్రి అక్కడక్కడా అకాల వర్షాలు పడి వాతావరణం చల్లబడుతుండటంతో గృహ విద్యుత్ వినియోగం సైతం ఆశించినంతగా లేదు. దీంతో విద్యుత్ వినియోగం విషయంలో దేశ సగటు వృద్ధి కంటే దూసుకుపోతున్న తెలంగాణ స్పీడుకు కరోనా వైరస్ బ్రేక్ వేసిందనే చెప్పాలి.
Tags: corona lockdown, telangana, power consumption, accelerating demand