ఓటర్లకు డబ్బు పంచలేదనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్.. కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

ఓటర్లకు డబ్బు, మద్యం పంచలేదనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-06-21 10:05 GMT

దిశ, వెబ్ డెస్క్: ఓటర్లకు డబ్బు, మద్యం పంచలేదనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్ అని వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సిరిసిల్లలో మాట్లాడిన మంత్రి కేటీఆర్ తాను ఎన్నికల్లో గెలిచేందుకు ఒక్కరికి కూడా డబ్బు, మద్యం పంచలేదని అన్నారు. ఈ సారి కూడా తాను ఏం పంచబోనని.. తనను గెలిపించాలని అక్కడి ప్రజలను కోరారు. కాగా బుధవారం మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించనట్లు ఉందని ఎద్దేవా చేశారు. పోలీసులు అడ్డులేనిదే అడుగు కూడా బయట పెట్టలేనోడు..ముందుగానే ప్రశ్నించే గొంతులను హౌజ్ అరెస్టులు చేయించటోడు తాను పోలీసులను అడ్డుపెట్టుకోవడం లేదనడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే నమ్మే పిచ్చోళ్లు కాదు తెలంగాణ ప్రజలు అని అన్నాు.

‘‘పోలీసు వ్యవస్థను మీ బానిస వ్యవస్థగా మార్చారు. అయ్యా చిన్న దొర కేటీఆర్.. మీరు నిజంగా సుద్ధపూసలే అయితే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు. నేరెళ్ళలో దళితులపై పోలీసులను అడ్డుపెట్టుకొని థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదా? ఇప్పటికీ నువ్వు సిరిసిల్ల పోతే 7 ఏళ్లుగా ఆ నేరెళ్ల మొత్తం హౌజ్ అరెస్ట్ చేయడం లేదా..? మిడ్ మానేర్ ముంపు బాధితులు న్యాయ మడిగితే అరెస్టులు చేయలేదా? నిన్న గాక మొన్న వరంగల్ పోతే విద్యార్థి నాయకులను, ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేయించలేదా? నీ సభల కోసం జనాలు రాకపోతే పథకాలు కట్ అని బెల్లంపల్లిలో బెదిరించలేదా?’’ అని ప్రశ్నించారు. డబ్బు, మద్యం పంచనని దొంగ మాటలు చెప్పే కేటీఆర్.. మొన్నే జరిగిన సిరిసిల్ల కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో డబ్బులు పంచలేదా? మద్యం పారించలేదా? అని నిలదీశారు. మునుగోడు, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఓటుకు 10వేలు పంచింది కేటీఆర్ సారథ్యంలోనే కదా అని అన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ ఎలక్షన్ల దాకా డబ్బులు కుమ్మరించి, మద్యం ఏరులై పారించింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

సంతలో పశువులను కొన్నట్లు వేల కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేలను కొన్నది బీఆర్ఎస్ పార్టీ కాదా అని అన్నారు. తెలంగాణ సొమ్మును సొంత ఖజానా నింపుకొని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశాని, మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారని ఆరోపించారు. బంధిపోట్ల రాష్ట్ర సమితికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎలాంటి డబ్బు, మద్యం పంచబోమని బొడ్రాయి మీద ప్రమాణం చెయ్యాలని, తనపాలన మీద నమ్మకమే ఉంటే పోలీసుల సాయం తీసుకోనని గ్రామ దేవతల మీద ఒట్టు వేయాలని షర్మిల సవాలు విసిరారు. 

Tags:    

Similar News