AP Elections 2204: ఓటు కోసం ముప్పుతిప్పలు పడుతున్న ముత్తం.. భీమిలిలో గంట మోగనుందా?

చారిత్రాత్మక భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు ఓటుకు ఎదురీదుతున్నారు.

Update: 2024-05-12 04:16 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: చారిత్రాత్మక భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు ఓటుకు ఎదురీదుతున్నారు. బలమైన ప్రత్యర్థి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగడంతో అవంతి పని అయిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అవంతి వ్యవహార శైలితో పాటు వైసీపీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో భీమిలి నియోజక వర్గంలో జరిగిన వేల కోట్ల రూపాయల భూకబ్జాలు, లావాదేవీలు ఇప్పుడు వైసీపీకి శాపంగా మారాయి. ఈ ఐదేళ్లలో భీమిలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కంటే సొంత ఆస్తుల అభివృద్ధే ఎక్కువని వైసీపీ నేతలే వాపోతున్నారు.

వేలకోట్ల లావాదేవీలకు ఇదే కేంద్రం

ఉత్తరాంధ్రా వైసీపీ ఇన్చార్జిగా విజయసాయి రెడ్డి వ్యవహరించిన సమయంలో భీమిలి నియోజక వర్గం పరిధిలో రూ.30 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయంటూ సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో ఆయనను మార్చారు. ఎన్‌సీ‌సీ భూములు, రేడియంట్ భూములు, హయగ్రీవ భూములు, మాజీ సైనికోద్యోగుల భూములు వంటివన్నీ విజయసాయి ముఠా పరమైపోయాయి. దీని ప్రభావం ఈ ఎన్నికలలో బాగా కనిపిస్తోంది.

సముద్ర తీరాన్ని, ఎర్రమట్టి దిబ్బలను వదల్లేదు

ఈ నియోజక వర్గం పరిధిలో 25 కిలోమీటర్ల విశాఖ –భీమిలి బీచ్ రోడ్ వుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే బీచ్ రోడ్‌లో సీ‌ఆర్‌జడ్ ఉల్లంఘనలు అంటూ పలు కబ్జాలను తొలగించి, కట్టడాలను కూల్పించివేసిన విజయసాయి రెడ్డి ఆ తరువాత సెటిల్మెంట్లు చేసి అంతకంటే ఎక్కువ భూములను కబ్జా చేయించారు. భీమిలి తీరంలో స్వయంగా తానే కబ్జా చేసి నిబంధనలకు విరుద్ధంగా కాంక్రీట్ కట్టడాలు చేస్తుండడాన్ని హైకోర్టు అడ్డుకొంది.

ఇక వేల సంవత్సరాల వారసత్వ సంపద అయిన ఎర్రమట్టి దిబ్బలను విజయసాయి, అవంతి మనుషులు కబ్జా చేసి క్వారీయింగ్ చేశారు. చరిత్రకారులు, పర్యావరణవేత్తల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా లే అవుట్ లకు అనుమతులిప్పించారు.

భీమిలి కాదు, అవంతి అభివృద్ధి

శాసనసభ్యుడిగా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవంతి శ్రీనివాస్ అందుకు విరుద్ధంగా కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలను కారు చౌకగా వైసీపీ ప్రభుత్వంలో కేటాయింపజేసుకొన్నారు. అవంతి విద్యాసంస్థలకు లబ్ధి చేకూర్చేలా జగన్ అనేక నిర్ణయాలు తీసుకోవడంపైనా విమర్శలున్నాయి. విద్యాసంస్థకు అనుకొని ఉన్న కారణంగా ఎకరంన్నర ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేసుకోవడం విమర్శలకు అవకాశం ఇచ్చింది.

అవంతి ఇంజనీరింగ్ కళాశాల ఫీజుల విషయంలోనూ ప్రభుత్వంలో పలుకుబడి ఉపయోగించారనే ఆరోపణలున్నాయి. మరెక్కడా లేని విధంగా దోచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

నోటి దురుసుతో వలసలు

ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు భీమిలిలో ఆగడం లేదు. ప్రతిరోజు ప్రతి మండలంలో మండల, సర్పంచ్ స్థాయి నేతలు పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసపోతున్నారు. పలువురు కీలక నేతలు ఎన్నికలు ప్రకటించిన తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ వలసలు ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా చోద్యం చూస్తున్నారని అవంతిపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది.

తీరు మారని అవంతి

ఇదంతా ఒక ఎత్తయితే అవంతి శ్రీనివాసరావు నోటి దురుసు కారణంగా అనేక మంది పార్టీకి దూర మయ్యారనే ఆరోపణలున్నాయి. కార్యకర్తలు, నాయ కులతో ఆప్యాయంగా మాట్లాడింది లేకపోవడంతో పాటు సాయం కోసం వస్తే దురుసుగా వ్యవహరించడంపైనా ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. ఇప్పుడు నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో విలువ ఇవ్వడం లేదనే ఆవేదన వెలిబుచ్చుతున్నారు. స్వయంగా బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి వలసలను నిలువరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

గంటాను ఢీ కొనడం ఎలా?

ఇన్ని ఇబ్బందులతో బలమైన, ఓటమన్నదే ఎరుగని గంటా శ్రీనివాసరావును ఢీ కొనడం ఎలా అన్నదానిపై వైసీపీ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. గంటాకు అవంతి సరైన, ధీటైన అభ్యర్థి కాదని ఇప్పుడు మదనపడుతున్నారు. అవంతి స్థానంలో బొత్స సత్యనారాయణను నిలిపివుంటే బాగుండేదని బాధపడుతున్నారు. వైసీపీ పాపాలు, శాపాలతో పాటు అవంతి వైఖరి కారణంగా వైసీపీకి అత్యంత కీలకమైన భీమిలి చేజారనుందనే భయం వారిని వెంటాడుతోంది.


Similar News