పవన్​ దూకుడుతో ఎవరికి లాభం.. మరెవరికి నష్టం !

జన సేనాని దూకుడు చూస్తుంటే.. ఆయన మునిగేది కాకుండా చంద్రబాబును కూడా ముంచేట్లున్నారు.

Update: 2023-06-20 13:59 GMT

దిశ, ఏపీ బ్యూరో: జన సేనాని దూకుడు చూస్తుంటే.. ఆయన మునిగేది కాకుండా చంద్రబాబును కూడా ముంచేట్లున్నారు. ఎన్నికల దాకా సిగపట్లు పట్టి ఆనక టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టినా గత ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్నమొన్నటిదాకా కులం ప్రస్తావన లేకుండా పవన్​ మాట్లాడలేదు. కాపులంతా తనకు మద్దతిస్తే సీఎంను అవుతానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మతాలను భుజానికెత్తుకున్నట్లుంది. బీజేపీతో పొత్తులో ఉన్నందున తనకు ముస్లింలు అండగా లేకుంటే వాళ్లే నష్టపోతారని సెలవిచ్చారు. మొన్నామధ్య చంద్రబాబు కూడా ఈసారి టీడీపీకి ఓటెయ్యకుంటే రాష్ట్రం అధోగతిపాలవుతుందని హెచ్చరించారు. వీళ్ల వాలకం చూస్తుంటే తమలోని లోపాలను సరిచేసుకోకుండా గెలిపించలేదనే అక్కసు వెళ్లగక్కుతున్నట్లుంది. ఇలాగే ఎన్నికలకు వెళ్తే కాషాయ పార్టీపై వ్యతిరేక సెగలకు కమిలిపోయేట్లున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

వైసీపీ సర్కారు వైఫల్యాలను గుర్తించి వాటి మీద కసరత్తు చేస్తే కనీసం కొద్దిమేరకైనా టీడీపీ, జనసేన పార్టీలు బలం పుంజుకోవడానికి దోహదపడుతుంది. దీనికి భిన్నంగా సేనాని వైఖరి కనిపిస్తోంది. గడచిన వారం రోజుల వారాహి యాత్రలో ఆయన కాపు కులం మద్దతు కూడగట్టడానికి, అభిమానుల ఆకాంక్షల మేరకు సీఎం అవుతానని చెప్పడానికే పరిమితమయ్యారు. ఇప్పుడు తాను సనాతన హిందూ ధర్మం పాటించేవాడ్ని అయినా ముస్లింలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. పొరుగునున్న కర్నాటకలో ముస్లిం మహిళలు హిజాబ్​ ధరించడంపై ఆయన పొత్తు పార్టీ బీజేపీ చేసిన రాద్దాంతం అందరికీ తెలుసు. దేశ వ్యాప్తంగా కాషాయపార్టీ ముస్లింల పట్ల ప్రదర్శిస్తున్న విద్వేష పూరిత చర్యలతో తీవ్ర అభద్రతా భావానికి లోనవుతున్నారు. అందువల్ల పవన్​ ఎన్ని చెప్పినా ముస్లింల మద్దతు పొందడం అనుమానమేనని విశ్లేషకులు అంటున్నారు.

ఉత్తరాంధ్రతోపాటు కొన్ని సీమ జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గంలో తామెందుకు అధికారానికి రాకూడదనే పట్టుదల పెరిగింది. పవన్​ వీళ్ల మద్దతు పొందాలంటే జనసేన పార్టీకి ఓ మేనిఫెస్టో ఉండాలి. క్షేత్ర స్థాయి నిర్మాణంతోపాటు బలమైన కార్యాచరణతో సాగాలి. అప్పుడు అన్ని సామాజిక వర్గాల నుంచి అండదండలు పెరిగితేనే కాపులు ముందుకొచ్చి భుజం ఆనిస్తారు. లేదంటే స్థానికంగా వాళ్ల ఉనికిని కాపాడుకునేందుకు వైసీపీ, టీడీపీలోనే కొనసాగుతారు. ఈ వాస్తవాన్ని విస్మరించి నేను సీఎంను అవుతా.. నన్ను ఆదరించండంటే అంతగా స్పందించకపోవచ్చని కాపు వర్గాల నుంచి వినిపిస్తోంది. కుల మత ప్రస్తావన లేకుండా సగటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడకుండా రాజకీయంగా పవన్​ బలం పెరిగే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.

గత ఎన్నికల్లో వైసీపీకి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ప్రతిపక్ష టీడీపీకి సుమారు 41 శాతం ఓట్లు పడ్డాయి. నోటాతో సహా అన్ని పక్షాలకు మిగతా ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత సహజంగా సుమారు పది నుంచి 15 శాతం ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని గతంలో పవన్​ చెప్పుకొచ్చారు. వాస్తవానికి రెండు ప్రధాన పక్షాలు పోటీ పడ్డప్పుడు వ్యతిరేక ఓటు ఆ రెండు పార్టీల మధ్యనే పంపిణీ అవుతుంది. మూడో పక్షానికి దక్కే అవకాశమే ఉండదు. జనసేన ఓట్లు కొన్ని టీడీపీకి కలిస్తే కొన్ని సీట్లు గెలవొచ్చు. అంతమాత్రాన ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల మొత్తాన్ని మూడో పక్షం ప్రభావితం చేయలేదు. ఇది తెలిసి కూడా కర్నాటకలో మాదిరి జేడీఎస్​ లా చక్రం తిప్పాలనుకుంటే ఇక్కడ సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్​ కల్యాణ్​ కమలనాధులు ఇచ్చిన రూట్​ మ్యాపులో వెళ్తున్నట్లు స్పష్టమవుతోంది. గత పదేళ్ల నుంచి బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో విపక్షాలు కంగుతింటున్నాయి. కాషాయపార్టీ ప్రయోజనాల కోసం అప్పటిదాకా మిత్రుడుగా ఉన్న పార్టీని దూరంగా పెడుతుంది. ఆ రోజుదాకా కత్తులు దూసిన పార్టీతో జట్టు కడుతుంది. మళ్లీ ఎన్నికల అనంతరం తలపడిన పార్టీతోనే తెరచాటు బాగోతం నడుపుతుంది. ఇన్ని కనికట్టు ఎత్తుగడలతో రాష్ట్రంలోని మూడు పార్టీలను కనుసైగలతో బొంగరంలో తిప్పేస్తోంది. ఆ పార్టీ వ్యూహంలో పావులైతే తిరిగి కోలుకోవడం కష్టం. నేడు ప్రజల కష్టాలు, కన్నీళ్లకు కేంద్రంలోని బీజేపీనే కారణమని జనం ఘోషిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమ బలహీనతలను వదిలి ప్రజల పక్షాన నిలవకుంటే.. మోడీ చేతిలోని యంత్ర దండానికి ఓట్లు రాలకపోగా చావుదెబ్బలు తినాల్సి వస్తుందని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News