సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వచ్చిండ్రు: డీకే అరుణ

నడిగడ్డలో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వచ్చారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

Update: 2023-06-14 08:09 GMT

దిశ, గద్వాల: నడిగడ్డలో ఏ ఒక్క ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఏ ముఖం పెట్టుకొని గద్వాలకు వచ్చారని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తాను అధికారంలో ఉన్నప్పుడే నెట్టెంపాడు ప్రాజెక్టును సాధించి సస్యశ్యామలం చేశామన్నారు. తొమ్మిదేళ్లు అయినా మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయలేని దద్దమ్మలు బీఆర్ఎస్ పాలకులు అని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకున్న ప్రాజెక్టులను వాళ్లే చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యస్పదమన్నారు.

గట్టు ఎత్తిపోతల పథకానికి ఆనాడే శంకుస్థాపన చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్లీ వారు వచ్చి శంకుస్థాపన చేయడమేంటని అన్నారు. నడిగడ్డ ప్రాంతంలో ఇప్పటివరకు ఒక్క రోడ్డును అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. నడిగడ్డ ప్రాంతంలో ఒక్క ఇంటిని నిర్మించలేదని, తాను నిరుపేదలకు ఇచ్చిన ప్లాట్లను లాక్కొని డబుల్ బెడ్ రూంలు నిర్మించారని వాపోయారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు అధికమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిందేమి లేదని, మాయమాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ధరణి పోర్టల్ వల్ల నిరుపేదల భూములు మాయమైపోతున్నాయని విమర్శించారు. గద్వాల ప్రాంతంలో చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ పార్క్ శిలాఫలకానికే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణను దోచుకుంది చాలక దేశవ్యాప్తంగా దోచుకోవాలని బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని ఆరోపించారు. జిల్లా ప్రజలకు గొడ్డుకారం పెట్టిన ఘనత బీఆర్ఎస్ దే అని విమర్శించారు. మీటింగ్ కు రాకుంటే పింఛన్ బంద్ చేస్తామని రైతుబంధు ను బంద్ చేస్తామని ప్రజలను బెదిరించడం వారికే చెల్లుతుందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.

Tags:    

Similar News