జగన్ పై దాడి ఒక స్టేజ్ డ్రామా.. సూటిగా ప్రశ్నించిన టీడీపీ కీలక నేత..
నిన్న రాత్రి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై రాళ్ళ దాడి జరిగిన విషయం అందరికి సుపరిచితమే.
దిశ వెబ్ డెస్క్: నిన్న రాత్రి వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై రాళ్ళ దాడి జరిగిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడి చంద్రబాబు, పవన్ కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. జగన్‌పై రాళ్ళ దాడి అనేది ఒక చిన్న స్టేజ్ డ్రామా అని ఎద్దేవ చేశారు.
ఇదంతా వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర అని మండిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో సింపతీ ఓట్లు సాదించేందుకు జగన్ ఆడుతున్న జగన్నాటకం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తనపై దాడి జరుగుతుందని, అనంతరం టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకునేలా ధర్నాలు, నిరసనలు చెయ్యాలని ఆ పార్టీ నేతలకు ముందే తెలిపారని ఆయన ఆరోపించారు.
లేకపోతే దాడి జరిగిన పది నిమిషాల్లోనే ధర్నాకు దిగిన వైసీపీ నేతలకు ప్లకార్డులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇక పోలీసులకు కూడా ముందే స్క్రిప్ట్ ఇచ్చారని.. లేకపోతే కరెంట్ పోయిన వెంటనే ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాల్సిన భద్రతా సిబ్బంది ఎందుకు రక్షణ కల్పించలేదని సూటిగా ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై, ఆయన తనయుడు నారా లోకేష్‌పై ఆరోపణలు చేసారని, ఇక స్క్రిప్ట్‌లో భాగంగా జగన్‌పై దాడి చేసిన వ్యక్తి అంటూ ఎవరో ఒకరిని తీసుకు వచ్చి చంద్రబాబు చెప్తేనే చేశాను అని చెప్పించే యోచనలో వైసీపీ ఉందని అన్నారు.
కనుక సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తులోనే అసలు నిజాలు వెలుగు చూస్తాయని ఆయన అన్నారు. ఘటన ఎలా జరిగింది అనే విషయం జగన్‌కి, అలానే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే తెలుసునని వర్ల రామయ్య చురకలంటించారు.