విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటే తెలంగాణ సర్కార్ కు భయం.. అమిత్ షా

విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటే తెలంగాణ సర్కార్ కు భయమేస్తోందని, వెన్నులో వణుకు పుడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

Update: 2023-03-26 16:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలంటే తెలంగాణ సర్కార్ కు భయమేస్తోందని, వెన్నులో వణుకు పుడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీదర్ లోని గోర్టా గ్రామంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన వారి స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సైతం షా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గోరట గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. గోరట గ్రామంలో 9 మే 1948 నాడు రజాకార్ల ఊచ కోత, వాళ్లతో పోరాడిన యోధుల గురించి ప్రస్తావిస్తూ, యావత్ దేశం స్వేచ్ఛా వాయువులు పీలుస్తుంటే హైదరాబాద్ రాష్ట్రం క్రూర నిజాం చేతిలో బందీగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ భయపడుతోందని, అందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో విమోచన వేడుకలను గతేడాది ఘనంగా నిర్వహించామని, ఇకపైనా నిర్వహిస్తామని ఆయన స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ఈ బహిరంగ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, వేలాదిగా కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సభ అనంతరం గోరట గ్రామంలోని చారిత్రాత్మక లక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆనాడు రజాకార్ల ఊచ కోత ఒక వైపు జరుగుతుంటే, మరోవైపు గ్రామస్తులకు ఆశ్రయమిచ్చి వందలాది మందిని కాపాడిన చారిత్రాత్మక ఇంటిని బండి సంజయ్ సందర్శించారు. ఆనాడు జరిగిన ఘటన, రజాకార్లతో గ్రామస్తులు వీరోచితంగా పోరాడిన గాథ గురించి బండి సంజయ్ స్థానికులను అడిగి తెలుసు కున్నారు.


బండిని ప్రత్యేకంగా పరిచయం చేసిన షా

కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని ప్రత్యేకంగా వేదికపై పిలిచి కర్ణాటక నేతలకు పరిచయం చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి విస్తృత కృషి చేయడంపై షా.. బండి సంజయ్ ని అభినందించారు. ఇటీవల ప్రధాని మోడీ సైతం బండిని అభినందించిన విషయం తెలిసిందే. తాజాగా అమిత్ షా కూడా మరోసారి బండి పేరును ప్రస్తావించడం గమనార్హం. జాతీయ నేతలకు సంజయ్ పై మంచి అభిప్రాయం ఉందనేందుకు ఇది నిదర్శనంగా నిలవనుంది. ఇదిలా ఉండగా ముఖ్య నేతల భేటీ ఉంటుందని భావించినా అలాంటిదేమీ జరగకుండానే షా తిరుగుపయనమయ్యారు.

Tags:    

Similar News