బీజేపీకి ఘోర పరాభవం.. హాట్ టాపిక్‌గా మారిన RSS సర్వే!

మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సిన కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.

Update: 2023-03-16 13:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సిన కర్ణాటకలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తిరిగి మరోసారి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు స్పీడప్ చేయగా వరుస హామీలతో కాంగ్రెస్ గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఓ సర్వే ఇప్పుడు కన్నడ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం తప్పదు అనేది ఈ సర్వే సారాంశం. ఆర్ఎస్ఎస్ రహస్యంగా ఓ సర్వే చేయించిందని దీని ప్రకారం ఈసారి బీజేపీకి కేవలం 56-70 సీట్లు మాత్రమే వస్తాయని కాంగ్రెస్ పార్టీ 115-120 స్థానాలు దక్కించుకుంటుందని ఓ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ సర్వేకు సంబంధించిన వార్త ఓ కన్నడ దినపత్రికలో ప్రచురితమైందంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అయితే ఈ సర్వే కాంగ్రెస్ పనే అని బీజేపీ అటాక్ చేస్తోంది. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి ఓర్వలేకే కాంగ్రెస్ ఇలాంటి ఫేక్ సర్వేల పేరుతో తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ ఈ సర్వేపై రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ తమ చివరి ప్రయత్నంగా ఫోటో షాప్ వార్తలను నమ్ముకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి భిన్నంగా మన దేశంలో ప్రజాస్వామ్యం పరిణితి చెందిందని అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ట్రోల్ ఆర్మీ, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీగా మారిపోయిందని ధ్వజమెత్తారు.

Tags:    

Similar News