పార్టీలోకి రాకున్న పర్వాలేదు.. సైలెంట్‌గా ఉంటే చాలు!

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 'మిషన్ మునుగోడు' స్పీడ్ అందుకుంది. రాబోయే ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టాయి.

Update: 2022-08-20 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో 'మిషన్ మునుగోడు' స్పీడ్ అందుకుంది. రాబోయే ఉప ఎన్నికలో గెలుపు కోసం అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు మొదలు పెట్టాయి. అయితే ఎన్నికల తేదీ ఇంకా ఖరారు కాకపోవడంతో అప్పటి వరకు సొంతపార్టీ నేతలను కాపాడుకోవడం ఆయా రాజకీయ పక్షాలకు తలకు మించిన భారంగా మారింది. దీంతో సరికొత్త ఎత్తుగడలతో నేతలను దారికి తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారు అగ్రనేతలు. ఎన్నికల వరకు నేతలు చేజారకుండా ఉండేందుకు రకరకాల తాయిలాలతో బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు మునుగోడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా రహస్య భేటీలతో నేతలు సాగిస్తున్న రాజకీయం నియోజక వర్గంలో హాట్ టాపిక్ అవుతోంది. ఇన్నాళ్లు తమను పార్టీలో పట్టించుకోలేదని కొందరు, ఖరీదైన బహుమతుల కోసం మరికొందరు ఎవరికి నచ్చిన కారణంతో వారు వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు సీక్రెట్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ జోరందుకుంది.

పార్టీ మారకపోయిన పర్వాలేదు.. కానీ:

మునుగోడులో ప్రధాన పార్టీలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రత్యర్థులను బలహీన పరిచేందుకు చేరికల పర్వానికి బార్లు తెరిచాయి. ఇందుకోసం రకరకాల తాయిలాలు ప్రకటించడంతో అనేక మంది నేతలు పక్క చూపులు చూస్తున్నారనే టాక్ మునుగోడు పోలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది. నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి పార్టీ మారడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. పార్టీ మారడమే ప్రధాన ఎజెండాగా వస్తున్న ఈ ఉప ఎన్నికల్లో కింది స్థాయి నేతలను సైతం తమ పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమానికి అన్ని పార్టీలు తెరలేపాయి. పార్టీ మారి వచ్చేలా ఖరీదైన బహుమతులు, టూర్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి హోదా, స్థాయి, పలుకుబడిని బట్టి పార్టీలో నజరానాలు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య వలసలు, చేరికల పర్వం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా ప్రభావం చూపగలిగే నేతల కోసంలో అన్ని పార్టీలు దృష్టి సారించడంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. అయితే, ఎంత ఆశ చూపినా కొంతమంది నేతలు పార్టీ మారేందుకు ససేమిరా అంటున్నారనే అలాంటి వారి కోసం సరికొత్త ఎత్తుగడ వేసినట్లు ప్రచారం జరుగుతోంది. మీరు పార్టీలోకి రాకపోయినా పర్వాలేదు.. కానీ, ఎన్నికల ప్రచారంలో మీ పార్టీ తరపున యాక్టీవ్‌‌గా ఉండకుంటే అదే చాలు అన్నట్లుగా కొన్ని పార్టీలు బంపరాఫర్లు ప్రకటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలా నేతలు పార్టీ మారకుండా తమ సొంత పార్టీ కోసం పని చేయకుండా కేవలం సైలెంట్ అయిపోతే చాలు ఆశించిన రీతిలో తాయిలాలు అందిస్తామనే ప్రతిపాదనలు నేతల వద్దకు వస్తున్నాయనే ప్రచారం జోరందుకుంది.

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు బిగ్ టాస్క్:

చేరికల విషయంలో బీజేపీ ఆపరేషన్ జోరుగా సాగుతోంది. తాయిలాల సంగతి పక్కన పెడితే అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి భారీ సంఖ్యలో నేతలను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దాంతో ఏ క్షణంలో ఏ నేత పార్టీకి గుడ్ బై చెప్పేస్తారనే టెన్షన్ టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల్లో టెన్షన్ పెట్టిస్తోందట. ఎన్నికల వరకు నేతలను తమ పార్టీకి అంటిపెట్టుకునేలా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుమానం ఉన్న నేతలపై ప్రత్యక ఫోకస్‌ను పెట్టి వారి కదలికలను ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలకు చేరవేసేలా స్పెషల్ టీమ్స్ నియోజకవర్గంలో సీక్రెట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఏ నేత ఏ పక్షంలో ఉంటారో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News