జైలులో తనకు ఆ వస్తువులు కావాలన్న సిసోడియా.. కోర్టు ఏం చెప్పిందంటే..?
ఢిల్లీ లిక్కర స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను గత నెల 26న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను గత నెల 26న సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేసును విచారించిన అక్కడి కోర్టు మొదట ఆయనకు ఈ నెల 6 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఆయన రిమాండ్ ను మార్చి 20 వరకు పొడగిస్తూ ఇవాళ కోర్టు మరోసారి నిర్ణయం తీసుకుంది. కోర్టు తీర్పు ప్రకారం ఈ నెల 20 వరకు మనీశ్ సిసోడియా తీహార్ జైలులో ఉండనున్నారు.
అయితే జైలులో ఉండే సమయంలో తనకు కళ్లజోడు, భగవద్గీత గ్రంథం, మందులు, మెడిటేషన్ చేసుకునేందుకు అనువుగా ఉండే సెల్ ను కేటాయించాలని సిసోడియా తరఫు లాయర్ కోర్టును కోరారు. దీంతో కళ్లజోడు, భగవద్గీత గ్రంథం, మందులను జైలుకు తీసుకెళ్లేందుకు ఓకే చెప్పిన కోర్టు.. మెడిటేషన్ కు సంబంధించి సిసోడియా అడిగిన ఏర్పాట్లు చేయాలని తీహార్ జైలు అధికారులను కోరింది.