Bandi Sanjayకు Tarun Chugh సహా కేంద్ర పెద్దల ఫోన్
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేతల అరెస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 'ధర్మ దీక్ష'కు దిగారు.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ నేతల అరెస్ట్‌పై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 'ధర్మ దీక్ష'కు దిగారు. కాగా, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. బండి అరెస్ట్ విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దలు ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు చిలుపూర్ మండలం నుంచి హుస్నాబాద్ మీదుగా తీసుకెళ్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టు చేసి తన పాదయాత్ర అడ్డుకోలేరని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్ర చేసి తీరుతానన్నారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి పాదాల చెంత పాదయాత్ర ముగిస్తామని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి వెళ్లిన 26 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారికి మద్దతుగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న పోలీసులు.. కేసు విషయాలు అడిగితే చెప్పడం లేదని ఫైరయ్యారు. 3 సార్లు నోటీసులు మార్చి కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ఇండియన్ పీనల్ కోడ్ మర్చిపోయి.. కల్వకుంట్ల కుటుంబం చెప్పిన సెక్షన్లు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే.. తమ కార్యకర్తలను కొట్టడమే కాకుండా వారిపైనే కేసులు పెట్టడంపై ఫైరయ్యారు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కును పోలీసులు కాలరాస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ లీడర్లు చేసిన ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కానీ, ఇప్పటివరకు వారిపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉండగా సొంత పూచీకత్తుపై తమ కార్యకర్తలను విడిచిపెట్టినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు.
బంజారాహిల్స్ సీఐ నరేందర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన 29 మందిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్లు చెప్పారు. 26 మందిని అరెస్ట్ చేశామని, ముగ్గురు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. వీరిపై 341, 147, 148, 353,332, 509, రెడ్ విత్ 149 కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితులను వర్చువల్ ద్వారా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు ఆయన స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా అరెస్టయిన 26 మందిని వైద్య చికిత్సల కోసం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా బీజేపీ నేతలను రాత్రి రిమాండ్ చేయాలని పోలీసులు యత్నించినట్లు తెలుస్తోంది. ఉదయమే 5 గంటలకు మెజిస్ట్రేట్ కు వీడియో కాల్ చేసి కేసు వివరాలు చెప్పి రిమాండ్ చేయాలని పోలీసులు కోరినట్లు సమాచారం. పోలీసుల తీరుపై మెజిస్ట్రేట్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. 5 గంటలకే రిమాండ్ చేయడానికి అంత అర్జెంట్ ఏముందని మెజిస్ట్రేట్ నిలదీసినట్లు సమాచారం. కోర్ట్ టైం కే తీసుకురావాలని పోలీసులను మెజిస్ట్రేట్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా 26 మందిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లగా స్వీయ పూచీకత్తుపై విడుదల చేశారు.