అనర్హత వేటు తర్వాత తొలిసారి వయనాడ్ లో పర్యటించిన రాహుల్ గాంధీ
లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు.
దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ సభ్యుడిగా అనర్హత వేటు పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వయనాడ్ లో పర్యటించారు. అక్కడ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఎస్కే ఎంజే హైస్కూల్ నుంచి తన ఎంపీ కార్యాలయం వరకు సాగే రోడ్డు షోలో రాహుల్ పాల్గొననున్నారు. అదే విధంగా సాయంత్రం 5 గంటలకు తన కార్యాలయం ముందు జరిగే బహిరంగ సభలో ప్రియాంకగాంధీతో కలిసి రాహుల్ ప్రసంగించనున్నారు.
కాగా 2019లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే 2019లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ‘మోడీ ఇంటిపేరుతో ఉన్నవాళ్లే ఎందుకు ఆర్థిక దోపిడీ, అవినీతికి పాల్పడుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో గుజరాత్ కు చెందిన బీజేపీ ఓ ఎమ్మెల్యే మోడీ ఇంటిపేరుతో ఉన్న వాళ్లను రాహుల్ గాంధీ అవమానించారంటూ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ క్రమంలోనే రాహుల్ ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ నిర్ణయం తీసుకుంది.