'గెట్ అవుట్ రవి'.. గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం
తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ గవర్నర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులో అధికార డీఎంకే వర్సెస్ గవర్నర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సోమవారం అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్.ఎన్.రవి వాకౌట్ చేసి వెళ్లిన మరుసటి రోజే ఆయనకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రంలో పోస్టర్లు వెలువడం సంచలనంగా మారింది. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ చెన్నైలో 'ట్విట్టర్ నంబర్-1 ట్రెండింగ్ గెట్ అవుట్ రవి' అనే పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్‌పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, యువజన సంక్షేమ, క్రీడల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సహా డీఎంకే పార్టీ నేతల ఫొటోలతో పోస్టర్లు ఉన్నాయి. మరో వైపు గవర్నర్ తీరుపై డీఎంకే మద్దతుదారులు సోషల్ మీడియాలో గెట్‌అవుట్‌రవి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేస్తూ ట్రెండింగ్‌లోకి తీసుకువస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాల తొలి రోజైన సోమవారం సభలో గందరగోళం ఏర్పడింది. తమిళనాడు, ద్రవిడ పదాలను గవర్నర్ రవి తన ప్రసంగంలో చదవకుండా స్కిప్ చేశారని, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పదాలను ఉపయోగించడంపై అధికార పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పెరియార్, అన్నాదురై పేర్లను దాటవేతపై ముఖ్యమంత్రి స్టాలిన్ మండిపడ్డారు. సంప్రదాయాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రవర్తిస్తున్నారని ఆమోదిత ప్రసంగాన్నే చదవాలంటూ తీర్మానం చేశారు. దీంతో రుసరుసలాడుతూ గవర్నర్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు చెన్నై నగరంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు ప్రత్యక్షం కావడం పొలిటికల్ హీట్ పెంచుతోంది.