కేసీఆర్ వ్యూహంలో చిక్కిన మోడీ.. చక్రబంధంలో తెలంగాణ బీజేపీ
రాజకీయంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయాలు తీసుకుంటూ పై చేయి సాధించింది.
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా నిర్ణయాలు తీసుకుంటూ పై చేయి సాధించింది. అనివార్యంగా రాష్ట్రమూ అది చేయక తప్పడంలేదు. పంద్రాగస్టు సందర్భంగా 'హర్ ఘర్ తిరంగా' పేరుతో కేంద్రం నిర్ణయం తీసుకుంటే 'ఇంటింటికీ జెండా' నినాదంతో రాష్ట్రం జరపాల్సి వచ్చింది. విమోచనా దినోత్సవం పేరుతో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 17 వేడుకను జరుపుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం 'జాతీయ సమైక్యతా దినోత్సవం' పేరుతో నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రంమీద అప్పర్ హాండ్ సాధించడానికి కేసీఆర్ ఒక అడుగు ముందుకేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కడుతున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంటుకు కూడా ఆ పేరు పెట్టాలనే ఒత్తిడి ఈ రూపంలో తీసుకొస్తున్నారు.
కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నది. ఈ డిమాండ్ మేరకు పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెడితే ఆ క్రెడిట్ కేసీఆర్ తన ఖాతాలో వేసుకోడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ పేరు పెట్టకపోతే దళితులమీద ప్రధాని మోడీకి ఉన్న ప్రేమ ఇంతేనా అంటూ రాజకీయ అస్త్రంగా వాడుకోడానికి వీలు చిక్కుతుంది. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కేసీఆర్ పొలిటికల్‌గా వాడుకోడానికి ఉపయోగపడుతుంది. పంద్రాగస్టు, విమోచనోత్సవం విషయాల్లో కేంద్రం పైచేయి సాధిస్తే ఇప్పుడు అంబేద్కర్ పేరు విషయంలో మాత్రం మోడీని ఇరుకున పెట్టే ప్లాన్ వేశారు. పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలనే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రఘునందన్ రావు సభలో లేకపోవడాన్ని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రస్తావించారు.
మరోవైపు గుజరాత్‌లో పటేల్ భారీ స్థాయి విగ్రహాన్ని, మ్యూజియంను నెలకొల్పి బీజేపీ మైలేజ్ పొందుతున్నట్లుగానే టాంక్ బండ్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని, దానికి అనుబంధంగా మ్యూజియంను కూడా నెలకొల్పి దళితులను ఆకర్షించాలనుకుంటున్నది. పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకున్నట్లుగా ఇప్పుడు అంబేద్కర్ విషయంలో టీఆర్ఎస్ సరికొత్త వ్యూహాన్ని అవలంబిస్తున్నది. దాదాపు ఏడేళ్లుగా సాకారం కాకుండా పెండింగ్‌లో ఉండిపోయిన అంబేద్కర్ ఎత్తయిన విగ్రహం పనులు సచివాలయం సమీపంలోనే మొదలయ్యాయి. డిసెంబరు చివరిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. మంత్రి కొప్పుల ఈశ్వర్ రెగ్యులర్‌గా దాని ప్రోగ్రెస్‌ను రివ్యూ చేస్తున్నారు. అసెంబ్లీ చర్చల్లో కూడా మంత్రి కేటీఆర్ డిసెంబరు చివరికి లాంఛనంగా విగ్రహాన్ని ఆవిష్కరించేలా పనులు జరుగుతున్నట్లు వివరించారు.
ఇప్పటికే దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలంటూ కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉన్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నదని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దళితులను ఉద్ధరించే ప్రభుత్వం తమదేనని అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ గురించి ప్రచారం చేసుకోవాలని టీఆర్ఎస్ భావిస్తున్నది. వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ లాంటి పథకాలపై వివిధ రాష్ట్రాల రైతుసంఘాల ప్రతినిధులతో రెండు రోజుల పాటు ప్రగతి భవన్‌లో సదస్సు నిర్వహించారు. ఇప్పుడు దళిత అంశం మీద కూడా అన్ని రాష్ట్రాల దళిత సంఘాలతో ఇదే తరహా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. జాతీయ స్థాయిలో భారీ బహిరంగసభ కూడా భవిష్యత్తులో జరుగుతుందని టీఆర్ఎస్ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి.
మూడు సాగు చట్టాలు తేవడం, ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం, వడ్ల కొనుగోళ్ళు, ఎరువుల ధరల పెంపు తదితర వ్యవసాయ సంబంధ అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు దళితుల అంశంలో సైతం ఇదే తరహాలో తూర్పారబట్టాలన్నది వ్యూహంగా కనిపిస్తున్నది. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే కేసీఆర్ వ్యూహాన్ని బీజేపీ కూడా నిశితంగా గమనిస్తున్నది. సున్నితమైన అంశం కావడంతో బీజేపీ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరించాలనుకుంటున్నది.