ప్రజల్లో చులకనైపోతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు.. పీఏల ప్రవర్తనే కారణం!
సమాజంలో ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పైరవీలకే ప్రాధాన్యతనిస్తున్నారు. వీరు ప్రవర్తించే విధానాన్నే తమ పీఏలు, పీఎస్‌లు అనుసరించడం విశేషం.
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: సమాజంలో ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పైరవీలకే ప్రాధాన్యతనిస్తున్నారు. వీరు ప్రవర్తించే విధానాన్నే తమ పీఏలు, పీఎస్‌లు అనుసరించడం విశేషం. రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పీఏల భాగోతం పరిశీలిస్తే అంతా ఇంతా కాదు. ముందు నటిస్తూ వెనక చేసే పనులకు ఆగడాలు లేకుండా పోయాయి. పీఏలు నియోజకవర్గంలో పలుకుబడి కలిగిన స్థానిక నాయకులతో కుమ్మక్కై అధికారుల వద్ద, రియల్ వ్యాపారుల వద్ద వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తప్పుడు పనులను సైతం అధికారులకు అప్పగించి సార్, మేడం చేయమంటుంది అంటూ ఆదేశాలు ఇవ్వడం పలు మున్సిపాలిటీల్లో, మండలాల్లో జరుగుతుండటం గమనార్హం. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ తంతు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ ప్రజాప్రతినిధులకు బీనామిలుగా సైతం చలమణి అవుతున్నారని తెలుస్తోంది.
వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే పీఏ ఉంటూ ఆ సారుకు దీటుగా ఆస్తులు కూడబెడుతున్నట్లు ఆ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకున్నది. ముస్లింలకు సంబంధించిన భూమిని ఆ ఎమ్మెల్యే కబ్జా చేసుకొని సదరు పీఏపై మ్యూటేషన్ చేసి ప్రభుత్వం అభివృద్ధి కోసం సేకరించిన భూముల్లో నష్టపరిహారం కూడా తీసుకున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు చేపట్టే అభివృద్ధి పనుల్లో కచ్చితంగా పీఏకు వాట ఉంటుందని తెలుస్తోంది. ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ కమిషనర్ల ద్వారా ప్రతినెలా ఎమ్మెల్యే పేరుతో వాటా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పీఏకు జీహెచ్ఎంసీ పరిధిలో 6 ప్లాట్లు.. ఆ ఎమ్మెల్యేకు సంబంధించిన గోశాల కోసం పంపిణీ చెక్కులు అతని పేరుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే జహీరాబాద్‌లో భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లాలో నిత్యం ఓ ఎమ్మెల్యేకు విశేష ప్రజాదరణ ఉంది. అంతేకాకుండా జిల్లాలో బలమైన పట్టుకలిగిన నేత, ఆపద వస్తే అండగా ఉండే ఆ ఎమ్మెల్యే పీఏ చేసే అరాచకాలతో అధికారులు, మున్సిపాలిటీ అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఆదేశాలంటూ నిబంధనలకు విరుద్ధమైన పనులను అధికారులతో చేయించేందుకు పీఏలు వెనకడుగు వేయడం లేదు. బండ్లగూడ జాగీర్‌లోని సన్‌సిటీలో పదుల సంఖ్యలో ఫ్లాట్స్ కొనుగోలు చేసుకున్నారు. ఇదంతా ఎమ్మెల్యేలకు, మంత్రులకు తెలియకుండానే అంతర్గత వ్యవహారం నడిపిస్తున్నారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో భూములకు భారీ డిమాండ్ ఉండటంతో వాటినే ఆసరాగా చేసుకోని పనిచేస్తున్నారు. దీంతో అసైన్డ్, భూదాన్, గ్రామ కంఠం వంటి భూములు కబ్జాలైతున్నాయని అధికార పార్టీలోని కొంత మంది నాయకులు పిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధల వద్ద పనిచేసే పీఏలు అక్రమార్కులతో జత కట్టి ప్రతి సమాచారం అప్డేట్ చేయడమే ఆలవాటైయింది. తాసీల్దార్లకు, ఆర్డీవోలకు, జిల్లా పంచాయతీ అధికారులకు, మున్సిపాలిటీ కమిషనర్లకు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఇలా చెప్పుకుంటా పోతే అనేక మంది అధికారులు, సిబ్బంది బాధను దిగమింగేసుకోని పనిచేస్తున్నారు. ఏ విషయం బహిర్గతం చేసిన బదిలీలు, సస్పెన్షన్ ఉంటుందని కళ్లు మూసుకొని పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులు మాత్రం పీఏల బలం చూసుకొని మరింత అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
వీరి నిర్వాకంతోనే వ్యతిరేకత
నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన నాయకులతో పీఏలు సంబంధాలు పెట్టుకోని మేము పనిచేసి పెడుతాముంటూ మాట్లాడుకుంటున్నారు. వివాదాస్పదమైన భూముల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు. సంబంధిత అధికారులకు పీఏలు హుకుం జారీ చేస్తున్నారు. పీఏలు చెప్పిన పనులు చేయకపోతే ఆ మంత్రుల, ఎమ్మెల్యేల వద్ద సంబంధిత అధికారుల గురించి నెగెటివ్‌గా చెప్పడం గమనార్హం. అంతేకాకుండా మన నియోజకవర్గం నుంచి వచ్చిన రైతులకు, నాయకులకు సమాధానం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారని అధికారులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తే ఓ తంటా.. వ్యతిరేకంగా పనిచేస్తే మరో తంటా అన్నట్లు అధికారుల పరిస్థితి ఉంది. పీఏలు ప్రతి రెండు రోజులకు ఒక్కసారి కలెక్టరేట్‌లోని ప్రధాన విభాగాల్లో గంటలు గంటలు కూర్చోని అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా ఈ పీఏలతో సాధరణంగా సమస్యల కోసం వచ్చే ప్రజలు సంబంధిత అధికారులను కలిసే పరిస్థితి లేదు.
వీళ్ల ఆస్తులపై విచారణ ఎందుకు చేయరు..?
ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసే పీఏలు ప్రజలకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు అనుసంధాన కర్తగా పనిచేయాలి. అంతేకాకుండా ప్రజాప్రతినిధిపై ప్రజలు గౌరవం పెంచుకునేవిధంగా ఆయా పీఏలు పనిచేయాలి. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ప్రజాదరణ పెరుగుతుంది. కానీ, పీఏలు చేసే తప్పుడు పనుల వల్ల ప్రజాప్రతినిధులు ప్రతి నిత్యం ప్రజా సేవలోనున్న శూన్యమనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధుల వద్దకు సాధరణంగా సమస్యలు వివరించేందుకు వచ్చిన ప్రజలను కలవనివ్వకుండా పీఏలకు తొత్తులుగా ఉండే వాళ్ల వద్దకు వెళ్లండని చెప్పడంతో వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేల వద్దకు ప్రధానంగా భూ సమస్యలపైనే వస్తున్నారు. వీళ్లను అడ్డం పెట్టుకోని పీఏలు భారీ మొత్తంలో నగదు దండుకుంటున్నట్లు విష ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో మేదావులు, ప్రజా సంఘాల నాయకులు పీఏల ఆస్తులపై విచారణ చేపట్టాలనే చర్చిస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకు అప్పుడు వాళ్ల పీఏలు చేసే బాగోతం బహిర్గతమైతుందని చర్చలు సాగుతున్నాయి.