ఏక్ నిరంజన్. BRS పార్టీని పట్టించుకోని జాతీయ నేతలు
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక శక్తులు దూరంగా ఉన్నాయి.
గుణాత్మక మార్పు కోసమే తాను జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నట్టు కొంత కాలంగా పేర్కొంటున్న సీఎం కేసీఆర్ వెంట నడిచేందుకు బీజేపీ వ్యతిరేక శక్తులు ఇష్టపడటం లేదా..? బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందుకే హాజరుకాలేదా..? ఇంతకూ వాళ్లకు కేసీఆర్ ఆహ్వానం పంపారా..? లేదా..? మునుగోడులో లిఫ్ట్ ఇచ్చిన లెఫ్ట్ పార్టీల అగ్రనేతలెందుకు వెళ్లలేదు. తమిళనాడు, బెంగాల్, బిహార్, ఒడిశా ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్ గైర్హాజరుకు కారణమేంటి..? బీజేపీ వ్యతిరేక శక్తులు సీఎం కేసీఆర్ పోరాటాన్ని నమ్మడం లేదా..? అన్నది పొలిటికల్ సెక్షన్లలో చర్చనీయాంశంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ వ్యతిరేక శక్తులు దూరంగా ఉన్నాయి. వారందరికీ సీఎం కేసీఆర్ ఆహ్వానం పంపారా? లేక ఆహ్వానం పంపినా రాలేదా? అనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది. మిత్రపక్షంగా భావిస్తున్న ఎంఐఎం పార్టీ ఇంతవరకు బీఆర్ఎస్ పై స్పందించలేదు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మిత్రపక్షాలుగా మారిన లెఫ్ట్ పార్టీలు కూడా ఓపెనింగ్ సెర్మనీకి హాజరు కాలేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు రెడీ అవుతున్న కేసీఆర్‌కు అండగా నిలువలేదు. బీజేపీని వ్యతిరేకిస్తున్న జేడీయూ, ఆర్జేడీ, డీఎంకే, శివసేన నేతలెవరూ రాలేదు. దీంతో కేసీఆర్‌తో కలిసి వచ్చే వారెవరనే చర్చపై రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేసుకుంటున్నారు.
మద్దతు కోసం చక్కర్లు కొట్టిన కేసీఆర్
జాతీయ పార్టీ ఏర్పాటుకు ముందు కేసీఆర్ దేశంలో గుణాత్మక రాజకీయాలు రావాలని, అందుకు అందరం కలిసి పనిచేద్దామని దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. కలకత్తాకు వెళ్లి టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీని, ముంబై వెళ్లి శివసేన అధినేత అప్పటి మహారాష్ట్ర సీఎం ఉద్దేవ్ ఠాక్రేను, తమిళినాడులో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‌ను, ఒడిషాకు వెళ్లి బీజేడీ అధ్యక్షుడు సీఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు. ఆర్జేడీ ఎంపీ తేజస్వీ యాదవ్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించి ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. బీహార్‌కు వెళ్లి జేడీయూ అధినేత సీఎం నితీశ్ కుమార్‌తోనూ భేటీ అయ్యారు. మీరి మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, ఆ కారణంగానే హాజరు కాలేదనే చర్చ జోరుగా సాగుతున్నది.
లెఫ్ట్, మజ్లిస్ సైలెంట్
మునుగోడు ఉప ఎన్నికల నుంచి కేసీఆర్‌కు మిత్రపక్షాలుగా మారిన సీపీఎం, సీపీఐ ఢిల్లీ పొగ్రాంకు దూరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఏర్పాటుపై ఇంతవరకు స్పందించలేదు. దీంతో కేసీఆర్‌తో ఉన్న స్నేహం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా? అనే అనుమానం వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలో అధికారిక మిత్రపక్షంగా ముద్రపడ్డ మజ్లిస్ పార్టీ ఇంతవరకు బీఆర్ఎస్ పై తన వైఖరిని ప్రకటించకపోవడం గమనార్హం. ప్రతి విషయంలో కేసీఆర్‌కు అండగా ట్వీట్లు చేసే ఎంపీ అసదుద్దీన్ మౌన ముద్ర వెనుక కారణమేంటనేది చర్చనీయాంశంగా మారింది.
దూరంగా కేజ్రీవాల్
ఉత్తరాది రాష్ట్రాల్లో దూకుడుగా ఉంటూ బీజేపీని ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా బీఆర్ఎస్ ఆఫీసు ప్రారంభానికి హాజరుకాలేదు. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ కేజ్రీవాల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలపై చర్చించుకున్నారు. అదే సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడుదామంటూ కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై కేజ్రీవాల్ నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి అండగా నిలిచేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.
Read more:
1.BRS: తెలంగాణ ఆత్మను వదిలేసిన బీఆర్‌ఎస్! విశ్వసనీయత ఉండేనా?