ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 75 శాతం కేంద్రానివే.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 75 శాతం కేంద్రానివేనని, ఇది తాము చెప్పడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు.

Update: 2023-03-24 17:04 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో 75 శాతం కేంద్రానివేనని, ఇది తాము చెప్పడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన జీవోలోనే ఉందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రానికి ఎన్టీఆర్ఎఫ్ నిధుల కింద తెలంగాణకు రూ.377.60 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం రాష్ట్రానికి రూ.3వేల కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ కౌలు రైతులపై గతంలో ఒక మాట ఇప్పడొక మాట్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కత్తికి తేనె పూసినట్లులగా కేసీఆర్ మాటలుంటాయని, తేనె అనుకుని వెళ్తే నాలుక తెగడం ఖాయమని రఘునందన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు నష్టపరిహారంపై సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనలు చేయడం విడ్డూరంగా ఉందని చురకలంటించారు.

ఈ పర్యటన కేవలం కవిత ఈడీ విచారణ, టీఎస్ పీఎస్సీ లీకేజీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకేనని ఆయన పేర్కొన్నారు. ఓట్ల కోసమే ఈ స్టంట్ అని విమర్శలు చేశారు. కేసీఆర్ గతంలో అసెంబ్లీసాక్షిగా కౌలు రైతులు ఎక్కడ ఉన్నారని మాట్లాడారని, అసలు అలాంటి ప్రశ్న ఉత్పన్నమవ్వకూడదని ఆర్డర్ వేశారన్నారు. ఇప్పుడేమో కౌలు రైతులకు రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామన్నారనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు లేనిది కౌలు రైతులు ఇప్పుడెందుకు గుర్తొచ్చారని ఆయన ప్రశ్నించారు. నష్టపరిహారం ఇస్తామని కేసీఆర్ అన్నారని, మరి కౌలు రైతులకు పరిహారం ఇచ్చేందుకు ఏదైనా విధానాన్ని రూపొందించుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అసలు ఎంతమంది కౌలు రైతులను గుర్తించారని, వారికి సంబంధించిన డేటా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పంట నష్టపరిహారంపై కేంద్రానికి కేసీఆర్ సర్కార్ ఎన్నిసార్లు నివేదిక పంపిందో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షంపడి 24 గంటలు గడవకముందే అధికారులు పంట నష్టాన్ని ఏ ప్రాతిపదకన అంచనా వేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

గచ్చిబౌలి శ్మశానవాటిక అమ్మగా వచ్చిన డబ్బులతో పంట నష్టపరిహారం ఇస్తారేమోనని ఆయన వ్యాఖ్యానించారు. రైతులపై కేసీఆర్ గుండె కరుగుతుందా? అని ఆ విషయాన్ని ఏఐజీ డాక్టర్లే చెప్పాలని ఎద్దేవాచేశారు. గతంలో నష్టపోయిన రైతులకు ప్రకటించిన పరిహారం మాటేమిటని రఘునందన్ రావు ప్రశ్నించారు. గతంలో వర్షం పడితే విదేశీ కుట్ర అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కురిసిన వర్షాన్ని కూడా విదేశీ కుట్రే అని చెబుతాడేమో అని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ట్విట్టర్ లో స్పందించే మంత్రి కేటీఆర్ లీకేజీపై మాత్రం తనకు సంబంధం లేదని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. సంబంధం లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు. ఆయనకు సంబంధంలేకుంటే తన తండ్రి తర్వాత తానే సీఎం అని చెప్పి పెత్తనం చెలాయించేందుకు చూశాడా అని ప్రశ్నించారు.

ఇక కేటీఆర్ చదివినోళ్లు, చదవనోళ్లు కూడా తమకు చెబుతున్నారని బీజేపీ నేతలపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చదువు ఉంటేనే బీఫారాలు ఇస్తామనే కొత్త చట్టాన్ని తీసుకువస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు క్వాలిఫికేషన్ పెట్టండని, ఈ అంశాన్ని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా పొందుపరచండని సూచించారు. పీజీ, పీహెచ్ డీ ఉంటేనే టికెట్ ఇస్తామని చెప్పాలని ఎద్దేవాచేశారు. బండికి సిట్ నోటీసులపై స్పందించిన ఆయన తమ వద్ద దుష్యంత్ దవే లేకపోవచ్చని, కానీ మంచి లాయర్లు ఉన్నారన్నారు. ముల్లును ముల్లుతోనే తీస్తామని, లీగల్ నోటీసులకు లీగల్ గానే సమాధానం చెబుతామని ఆయన స్పష్టంచేశారు.

Tags:    

Similar News