వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ కర్ణాటక రిజల్ట్స్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక రాష్టంలో వచ్చిన ఫలితాలే పునరావృతం కానున్నయని రాష్ట్ర సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.
దిశ, జడ్చర్ల / నవాబ్ పేట: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కర్ణాటక రాష్టంలో వచ్చిన ఫలితాలే పునరావృతం కానున్నయని రాష్ట్ర సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా నుంచి పాలమూరు జిల్లాలో అడుగు పెట్టిన సందర్భంలో జడ్చర్ల సెగ్మెంట్ పరిధిలోని కొల్లూరు గ్రామానికి పీపుల్స్ మార్చ్ పాదయా త్ర చేరుకుంది. ఇందులో భాగంగానే స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్ర శేఖర్ సీనియర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి, డీసీసీ ప్రెసిడెంట్ జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల ప్రక్రియ పక్కదారి పట్టిందని ఆరోపించారు. ప్రజా స్వామ్య విలువలు మంటగలిశాయని అన్నారు.
కేంద్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావించి పోరాటం చేస్తున్నందుకు ప్రధాని మోడీ రాహుల్ గాంధీని కుట్ర పూరితంగా పార్లమెంట్ నుంచి బయటకు పంపిస్తే, కర్ణాటక ప్రజలు ఏకంగా రాష్టం నుంచే బీజేపీ పార్టీని బహిష్కరించారని అన్నారు. ఇది కాక తెలంగాణ రాష్టంలో సీఎం కేసీఆర్ ప్రజా స్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి, పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడిన రాష్టంలో అన్ని కేసీఆర్ కుటుంబానికే చెల్లుబాటు అయినట్లు ఆయన చమత్కరించారు. రాష్టం కోసం, నిరుద్యోగ యువత ఎంతో శ్రమించిందని తెలిపారు. ఉద్యోగాలు వస్తాయని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చదివిన నిరుద్యోగ ఆశావహులు ఇటీవల జరిగిన పేపర్ లీకేజీ వ్యవహారం నిరుత్సాహానికి గురిచేసిందని తెలిపారు.
దీనిపై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో స్పందించడం జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇది కాకా రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఏక కాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు ఒబెదుల్లా కొత్వాల్, వీర్లపల్లి శంకర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి తదితరులు ఉన్నారు.