Pinnelli Ramakrishna: పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేయడం వెనుక కారణం అదేనా..?
ఓటమంటే తెలియని నేత, మాచర్ల నియోజకవర్గంలో పట్టున వ్యక్తి, వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.
దిశ వెబ్ డెస్క్: ఓటమంటే తెలియని నేత, మాచర్ల నియోజకవర్గంలో పట్టున వ్యక్తి, వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అలాంటి నేత నేడు చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడి, పారిపోయి శిక్ష నుండి తప్పించుకునేందుకు యత్నించడం నిజంగా పార్టీకే అవమానకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పిన్నెల్లి ఇల్లు వదిలి పారిపోయారని, పిన్నెల్లి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారనే అనే వార్తలతో ప్రస్తుతం అటు మీడియా ఇటు సోషల్ మీడియా దద్దరిల్లుతోంది. అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒక శాసనసభ సభ్యుడుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ఎందుకు పగలగొట్టారు?
వరుసగా నాలుగు సార్లు నియోజకవర్గంలో తన పట్టు నిలుపుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈ ఎన్నికల్లో ఓడిపోతాను అనే భయం కలిగిందా..? ఆ భయంతోనే ఈవీఎంలు పగలగొట్టారా? లేకపోతే అధిష్టానం ఆదేశాల మేరకు పగలగొట్టారా? తమ పార్టీ నేత ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదు?
ఈవీఎంలను పిన్నెల్లి ధ్వంసం చేస్తే.. గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని పోలీసులు ఎందుకు చెప్పారు అనే ప్రశ్నలు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాగా అధికారులతో పిన్నెల్లి దాగుడు మూతలు ఆడుతున్నారు. పిన్నెల్లి పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోతారని సోషల్ మీడియా కోడై కూసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు నరసరావుపేట కోర్టు దగ్గర పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.