BRS కు బ్రేక్.. కేసీఆర్‌కు వరంగల్ వాసి షాక్?

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితికి మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘా (ఈసీ)నికి పార్టీ అధినేత కేసీఆర్ పెట్టుకున్న దరఖాస్తుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

Update: 2022-12-08 05:17 GMT

బీఆర్ఎస్ కు బ్రేకులు పడనున్నాయా..? గత కొంత కాలంగా కేసీఆర్ ఊరిస్తున్న జాతీయ పార్టీకి చిక్కులు తప్పవా..! ఎన్నికల సంఘం గుర్తింపు లభించడం కష్టమేనా..? ఇంతకూ ఏం జరుగబోతున్నది అనేది ఆసక్తికరంగా మారింది. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం తోపన్ గడ్డ తండాకు చెందిన బానోత్ ప్రేమ్ నాయక్ సెప్టెంబర్ లోనే భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 5( విజయదశమి)న భారత్ రాష్ట్ర సమితి పేరును అధికారంకంగా ప్రకటించారు. ఈమేరకు ఆ మరుసటి రోజే ఈసీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆ తర్వాత అభ్యంతరాలుంటే తెలుపాలంటూ పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. పాలమూరు, జగిత్యాల సభల్లో బీఆర్ఎస్ ప్రస్తావన తేవడంతో జై భారత్.. జై తెలంగాణ అంటూ నినాదాన్ని కూడా ఇచ్చారు. కానీ పరిస్థితి ఒక్క సారిగా మారిపోయింది. సీన్ లోకి ప్రేమ్ నాయక్ ఎంటరయ్యారు..! ఇప్పుడు బంతి ఈసీ కోర్టుకు చేరింది. బీఆర్ఎస్ ఎవరిదో తేల్చాల్సింది ఎన్నికల సంఘమే..!

దిశ, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితికి మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘా (ఈసీ)నికి పార్టీ అధినేత కేసీఆర్ పెట్టుకున్న దరఖాస్తుకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భారత్ రాష్ట్ర సమితి పేరును ఆమోదించవద్దంటూ ఈసీకి లేఖ వెళ్లింది. భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరుతో సెప్టెంబరు 5నే లేఖ పంపినందున 'ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్' ప్రకారం తనకే తొలుత రిజిస్ట్రేషన్ జరగాలంటూ వరంగల్ జిల్లాకు చెందిన బానోతు ప్రేమ్ నాయక్ (ప్రేమ్ లాల్) ఈసీకి ఈ నెల 6న (ఎఫ్​ నంబర్ 56/164/2022/పీపీఎస్–4) లేఖ రాశారు. కేసీఆర్ దరఖాస్తులో భారత్ రాష్ట్ర సమితి అని పేరు పెట్టినందున తాను ఎంపిక చేసుకున్న భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి సారూప్యంగా ఉన్నందున ఆ ప్రతిపాదనను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పేరును పాపులర్ చేసుకుంటూ మహబూబ్‌నగర్, జగిత్యాల సభల్లో స్వయంగా కేసీఆర్ వ్యాఖ్యానించిన సమయంలో ఈసీకి ఈ ఫిర్యాదు వెళ్లడం గమనార్హం. సెప్టెంబరులోనే తాను దరఖాస్తు చేసుకున్నందున తొలి ప్రాధాన్యం తనకే ఇవ్వాలని ప్రేమ్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాలనే నిర్ణయం అక్టోబర్ 5న జరిగిందని, ఈసీకి ఆ మరుసటి రోజున దరఖాస్తు చేసుకున్నదని గుర్తుచేశారు. ముందువరుసలో తానే ఉన్నందున తన పార్టీకి సామీప్యత కలిగిన బీఆర్ఎస్ పేరును ఖరారు చేయవద్దని ఆ లేఖలో ప్రేమ్ నాయక్ పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రతిపాదనను ఈసీ ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయని, ఇదే నిజమైతే పునస్సమీక్షించాల్సిందిగా కోరారు. ఒకవేళ ఈసీ దగ్గర తనకు న్యాయం జరగకపోతే తొలుత ఢిల్లీ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ప్రేమ్ నాయక్ 'దిశ'కు వివరించారు. సెప్టెంబరు 5న తాను ప్రతిపాదించిన భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి ఆ తర్వాత కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న భారత్ రాష్ట్ర సమితికి 'సిమిలారిటీ' ఉన్నందున ముందుగా అప్లికేషన్ పెట్టుకున్న తమకే ప్రయారిటీ ఇవ్వాలని లేఖలో కోరారు. కేసీఆర్ ప్రతిపాదించిన భారత్ రాష్ట్ర సమితి పేరుపై అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి పత్రికల్లో ప్రకటన వెలువడిందని, దీంతో తన అభ్యంతరాన్ని ఈసీకి పంపించక తప్పలేదని ప్రేమ్ నాయక్ వివరించారు.

ఆగస్టులోనే మొదలైన కసరత్తు

రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి దశ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగానే చురుగ్గా పాల్గొన్నానని పేర్కొన్న బానోతు ప్రేమ్ నాయక్ 2014లో బీటెక్, 2016లో ఎంటెక్ పూర్తి చేసినట్లు తెలిపారు. ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2018 ఎన్నికల్లో పోటీ చేయాలని భావించానని, టీఆర్ఎస్ నుంచి తొలుత టికెట్ ఆఫర్ వచ్చిందని, ఆ తర్వాత చందూలాల్ కారణంగానే ఆగిపోయిందని గుర్తుచేశారు. స్థానికంగా సీనియర్ నాయకుడిగా ముద్ర పడిన చందూలాల్ తన ప్రయత్నాలకు విఘాతం కలిగించి భవిష్యత్తును దెబ్బతీయడానికి దొంగ కేసులు పెట్టించారని, హైదరాబాద్ సివిల్ కోర్టు వాటిని ఈ మధ్యనే కొట్టేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ ఏనాడూ టీఆర్ఎస్ సభ్యుడిగా లేనని, స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడంలేదన్న ఆలోచనతోనే తొలుత ఆగస్టు 25న తెలంగాణ ప్రజాసేన పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పంపినట్లు పేర్కొన్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన ఈసీ ఆ పేరుతో అప్పటికే పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అండర్ ప్రాసెస్‌లో ఉన్నదనే కారణంతో ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను సూచించాల్సిందిగా తనకు లేఖ వచ్చిందని గుర్తుచేశారు. ఈసీలో అండర్ సెక్రటరీ జస్మీత్ కౌర్ నుంచి వచ్చిన లేఖకు అనుగుణంగా సెప్టెంబరు 5న నాలుగు పేర్లతో తన ప్రతిపాదనను పంపించానని తెలిపారు. భారతీయ ప్రజాసేన పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ అనే నాలుగు పేర్లను ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. కానీ నవంబరు 9న మరోసారి ఈసీ నుంచి లేఖ వచ్చిందని, ఫ్రెష్‌గా మూడు పేర్లతో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అక్టోబరు 6న చేసుకున్న దరఖాస్తు తర్వాత భారత్ రాష్ట్ర సమితి పార్టీ పేరును ఆయనకు కేటాయించినట్లుగా వార్తలు రావడం ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు.

న్యాయపోరాటానికీ రెడీ

తొలుత ఎన్నికల కమిషన్ కు తానే దరఖాస్తు చేసుకున్నందున భారతీయ రాష్ట్ర సమితి పార్టీ పేరును తనకే ఇవ్వాలని ఆ లేఖలో ప్రేమ్ నాయక్ నొక్కిచెప్పారు. భారత్ రాష్ట్ర సమితి అనే పేరును కేటాయించే ప్రక్రియను తక్షణం నిలిపేయాలని ఆ లేఖలో ప్రేమ్ నాయక్ కోరారు. ఈసీ నుంచి తనకు తగిన న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, ఒకవేళ అందుకు విరుద్ధంగా జరిగితే న్యాయ పోరాటం చేస్తానని 'దిశ'కు వివరించారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి ఇప్పటికే నలుగురు న్యాయవాదులను సంప్రదించానన్నారు. అక్కడ వచ్చే తీర్పుకు అనుగుణంగా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకూ వెనుకాడనని కుండబద్దలు కొట్టారు.

నా వైపే సహజ న్యాయం!

తొలుత తానే దరఖాస్తు చేసుకున్నందున సహజ న్యాయం ప్రకారంగా, ఈసీ నిబంధనలకు అనుగుణంగా తనకే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అభ్యంతరాలను స్వీకరించడానికి ఈసీ నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పత్రికా ప్రకటనల గడువు లోపలే ప్రేమ్ నాయక్ ఈ అబ్జెక్షన్‌ను ఈసీకి పంపడం గమనార్హం. ఇప్పటికే ఈసీతో రెగ్యులర్ కాంటాక్టులో ఉన్న టీఆర్ఎస్ నేతలు తాజాగా వరంగల్ జిల్లాకు చెందిన ప్రేమ్ నాయక్ నుంచి వ్యక్తమైన అభ్యంతరం నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్‌కు పార్టీ పేరు మార్పు ప్రాసెస్‌లోనే అవాంతరాలు ఎదురుకావడం గమనార్హం.

Also Read....

కీర్తించడంతో సరిపెట్టి.. తీవ్ర నిరాశను మిగిల్చిన సీఎం కేసీఆర్! 

Tags:    

Similar News