వైసీపీదే గెలుపు.. చేగొండి హరిరామ జోగయ్య సర్వే

వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీదే విజయం అని చేగొండి హరిరామ జోగయ్య సర్వే చెప్పింది.

Update: 2023-02-21 14:04 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కదనరంగంలోకి దుమికింది. వైనాట్ 175 లక్ష్యంగా పావులు కదుపుతుంది. అటు టీడీపీ, జనసేన కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇవే సందర్భంలో అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐ ప్యాక్ టీం సర్వేతోపాటు సొంత సర్వేలు సైతం చేయిస్తోంది. మరోవైపు టీడీపీ కూడా సర్వేలు చేయిస్తోంది. ఇదే సందర్భంలో పలు సంస్థలు స్వచ్చంధంగా సర్వేలు చేస్తున్నాయి.

తాజాగా మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సైతం ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా సర్వేకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, వైసీపీ విడివిడిగా పోటీ చేస్తే ఏ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుందో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వెల్లడించేశారు. అంతేకాదు వారాహి యాత్ర ప్రారంభమైన తర్వాత జనసేనపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో కూడా తెలియజేశారు.

వైసీపీకే పట్టం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి బస్సుయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారాహి బస్సుయాత్రను ఆధారంగా చేసుకుని చేగొండి హరి రామ జోగయ్య సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ బస్సు యాత్ర మెుదలవ్వక ముందు ఎన్నికలు నిర్వహిస్తే ఆయా రాజకీయ పార్టీలు ఎలాంటి ఫలితాలు సాధిస్తాయో దాని వివరాలు స్పష్టం చేశారు. అంటే పొత్తులు లేకుండా పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉత్పన్నమవుతాయో సర్వేలో తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన 14శాతం ఓట్లు సాధించి 15స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపారు.

ఇక ప్రతిపక్ష టీడీపీ విషయానికి వస్తే టీడీపీ 38శాతం ఓట్లతో 65 స్థానాల్లో గెలుపొందుతుందని చెప్పారు. ఇకపోతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవైసీపీ 47శాతం ఓట్లతో 95 సీట్లలో గెలుపొందుతుందని వెల్లడించారు. ఇతరులకు ఒక శాతం ఓట్లు వస్తాయని కానీ ఎక్కడా స్వతంత్రులు గెలుపొందని సర్వేలో తేలింది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని సర్వేలో ప్రకటించారు. ఒకవేళ టీడీపీ, జనసేనలు కలిసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని సర్వేలో తేటతెల్లం చేశారు.

వైసీపీకి ఇబ్బందే..

ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర పూర్తయ్యేసరికి ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వెల్లడవుతాయోకూడా మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య తన సర్వేలో పొందుపరిచారు. వారాహి యాత్ర పూర్తయ్యే సరికి జనసేన పార్టీ ఓట్ల శాతంతో పాటు సీట్లను కూడా పెంచుకుంటుందని సర్వేలో తేటతెల్లమైంది. అంటే జనసేన 20శాతం ఓట్లను సాధించి 40 నియోజకవర్గాల్లో గెలుపొందుతుందని సర్వేలో వెల్లడించారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే 38 శాతం ఓట్లు సాధిస్తుందని అయితే 55స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని సర్వేలో తేలింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 40శాతం ఓట్లు సాధిస్తుందని అంటే అంతకుముందు కంటే 7శాతం ఓట్లు తగ్గుతుందని వెల్లడించారు. బస్సుయాత్రకు ముందు 95 స్థానాల్లో గెలుపొందితే యాత్ర పూర్తయ్యే సరికి ఎన్నికలు జరిగితే వైసీపీ 80 స్థానాల్లో గెలుపొందుతుందని సర్వేలో తేటతెల్లమైంది. ఇకపోతే ఇతరులు 2శాతం ఓట్లు సాధించగా ఒక్క స్థానంలో కూడా గెలుపపొందరని సర్వేలో నిర్ధారణ అయ్యింది.

కింగ్ మేకర్ గా పవన్ కల్యాణ్.. 

ఇకపోతే వారాహియాత్ర పూర్తయ్యే నాటికి ఎన్నికలు జరిగితే పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ లేదా కింగ్ అయ్యే అవకాశం ఉందని మాజీమంత్రి చేగొండి హరిరామ జోగయ్య తన సర్వేలో వెల్లడించారు. పవన్ కల్యాణ్ పవర్ కల్యాణ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అంటే టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని పరోక్షంగా వెల్లడించారు. టీడీపీ-జనసేన పొత్తుతోనే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించగలమని తన అభిప్రాయాన్ని సర్వేలో సైతం వెల్లడైందని చెప్పుకొచ్చారు. మెుత్తానికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు మాత్రం ఖాయంగా సర్వేలు వెల్లడిస్తున్నాయి.


Tags:    

Similar News