బీఆర్ఎస్‌లో సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌కు బంపరాఫర్?
తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్లు ఉద్యమ పార్టీగా, ఇంటి పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం చెందింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇన్నాళ్లు ఉద్యమ పార్టీగా, ఇంటి పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం చెందింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ విధివిధానాలు త్వరలో ఖరారు చేస్తామని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెసేతర ఎజెండానే తమ లక్ష్యం అని ప్రకటిస్తూ నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కేసీఆర్ ఆ మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో నటుడు ప్రకాశ్ రాజ్ కు కీలక పదవి అప్పగించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీ భావజాలంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించే ప్రకాశ్ రాజ్ కేసీఆర్ విధానాల పట్ల సానుకూలత ప్రదర్శిస్తూ వస్తున్నారు. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సైతం పరిశీలించారు. దాంతో అప్పటి నుంచి ఆయన టీఆర్ఎస్‌లో అప్రకటిత నేత అనే ప్రచారం జరుగూతూనే ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనూ ప్రకాశ్ రాజ్ తనకు ఇక్కడి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని అందువల్ల సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు తనకు ఓ అవకాశం ఇవ్వాలని చెప్పడం వెనుక కేసీఆర్ ప్రోత్సాహం ఉందనే ప్రచారం కూడా జరిగింది. ఆ ముచ్చట ఎలా ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడంతో ప్రకాశ్ రాజ్ కు కీలక బాధ్యలు అప్పగిస్తారనే ప్రచారం తెరపైకి వస్తోంది.
బీఆర్ఎస్‌లోకి సినీ గ్లామర్?
బీఆర్ఎస్ పేరుతో బీజేపీకి చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకుంటున్నారని అందులో భాగంగానే బీఆర్ఎస్ కు సినీ గ్లామర్ జోడించబోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా తమ పార్టీ భావజాలంతో అంగీకరిస్తున్న ప్రకాశ్ రాజ్ కు బీఆర్ఎస్ లో ముఖ్యమైన పనిని అప్పగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో తమిళ్ హీరో విజయ్ దళపతి కూడా సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. విజయ్ కూడా బీజేపీ భావాల పట్ల పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వీరిద్దరి రాజకీయ ప్రవేశంపై తరచూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో సినీ గ్లామర్ జోడించేలా వీరికి త్వరలో కీలక బాధ్యతలు అప్పగించే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ తెలంగాణ, ఏపీలో గ్లామర్ టచ్ ఇస్తోంది. కేంద్ర మంత్రులు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, హీరో నితిన్ తో పాటు పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సెలబ్రెటీలను ఉపయోగించుకోబోతుందనే టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో కూడా సెలబ్రెటీ టచ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయనే చర్చ జరుగుతోంది.
పార్లమెంట్ పై కన్నేసిన ప్రకాశ్ రాజ్?
విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రకాశ్ రాజ్ సందర్భం వచ్చిన ప్రతిసారి బీజేపీపై రాజకీయంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే తన రాజకీయ భవిష్యత్ పై కూడా ఆయన ఇప్పటికే ఓ సారి క్లారిటీ ఇచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ప్రకాశ్ రాజ్ గతంలోనే చెప్పారు. అయితే తాను రాజకీయాల్లోకి రావడానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆరే స్ఫూర్తి అని అన్నారు. కొంత కాలంగా దేశంలో జరుగుతున్న రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించే ప్రకాశ్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీఆర్ఎస్ నుంచే బరిలో ఉంటారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. అయితే ఆయన పోటీ తెలంగాణ నుంచా లేక ఆయన స్వరాష్ట్రం కర్ణాటక నుంచా అనేది స్పష్టత లేదు.