25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
తమతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తమతో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని బాంబు పేల్చారు. కుత్బుల్లాపూర్ లో బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు నలుగురు కార్పొరేటర్లు టచ్ లో ఉంటే తమకు 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సంజయ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచటానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ ప్రతి నెలా డబ్బులు ఇస్తున్నారని, కాంగ్రెస్ కు స్పాన్సర్ గా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.
ధరణితో పేద ప్రజలు నాశనం అవుతున్నారని, ధరణి పేదల పాలిట శాపంగా మారిందన్నారు. ధరణి పోర్టల్ కి, రైతుబంధుకు సంబంధం ఏంటో కేసీఆర్ చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ కానుందన్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్ రాని కాంగ్రెస్.., బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని బండి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు సీట్లు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు.
బండి సంజయ్ హిందువుల గురించి మాత్రమే మాట్లాడతారని అంటారని, తాను బరాబర్ హిందుత్వం గురించి మట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ వలనే కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు భాగ్యలక్ష్మి దేవాలయం బాట పట్టారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సైతం బీజేపీ వలనే భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళారన్నారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఔటయిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే బీజేపీ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని సంజయ్ ప్రజలను కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
తెలంగాణ సమాజంలో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోందని, అవినీతిపరులను జైలుకు పంపేదెన్నడని అడుగుతున్నారని బండి చెప్పారు. అవినీతిపరులను జైలుకు పంపటం లేదని ప్రజలు, మీడియా పదే పదే అడుగుతున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు సహా.. అవినీతికి పాల్పడిన వారంతా జైలుకు వెళ్ళటం ఖాయమని సంజయ్ వ్యాఖ్యానించారు. అవినీతిపరులను మోడీ ప్రభుత్వం వదిలిపెట్టబోదని హెచ్చరించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. అవినీతిపరులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం అందిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. పేద పిల్లను చదివించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి చెప్పారు.