భద్రాచలంలో బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమైన కీలక నేత
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది.
దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక షాక్ తగిలింది. జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న జేవీఎస్ చౌదరి పార్టీ మారనున్నట్లు ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సుదీర్ఘ మంతనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కొంతకాలం పనిచేసిన అనుభవం జేవీఎస్‌కు ఉంది. ఆ అనుభవంతోనే శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మలిదశ ఉద్యమం నుండి విద్యా సంస్థల అధినేత జేవిఎస్ చౌదరి రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.పేద, మధ్య తరగతి విద్యార్థుల్లో అనేక మందికి ఉచిత విద్యని అందించారు. అలానే వారి సాధక బాధల్లో తోడుంటూ వారి మన్ననలు పొందారు. కాగా శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారధ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కండువా కప్పుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
ఈ క్రమంలో జేవిఎస్ చౌదరితోపాటు తనవెంట ఉన్న వందల మంది యువత పార్టీలో చేరనున్నారు. జేవిఎస్ చౌదరి బీఆర్ఎస్ పార్టీని వీడనుండడంతో బీఆర్‌ఎస్ పార్టీకి జిల్లాలో ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు.