'పవర్' కోసం దూకుడు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
దిశ, ఏపీ బ్యూరో :
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మరో రెండు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలకు ఫుల్ టైమ్ కేటాయిస్తారని అంతా భావించారు. అయితే విశాఖపట్నం పర్యటనలో ర్యాలీకి పోలీసుల అడ్డంకులు, జనసేన పార్టీ కార్యకర్తల అరెస్టులు, పలువురు రిమాండ్‌కు వెళ్లడం వంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఫుల్ టైమ్ పొలిటీషియన్‌గా మారిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పొత్తుల సంగతి అటుంచితే సొంతంగా వ్యూహాలకు పదును పెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకు పార్టీ కార్యాలయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే విశాఖపట్నం నుంచి విజయవాడ నోవాటెల్‌హోటల్‌కు చేరుకున్న పవన్ కల్యాణ్‌ను బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ ఘటనపై సంఘీభావం ప్రకటించారు. తాజాగా మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నోవాటెల్ హోటల్‌కు చేరుకుని పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. విశాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు చర్చించారు. పవన్ కల్యాణ్‌తో వరుస నేతల భేటీలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇక పొలిటికల్ వార్ మెుదలైనట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్‌తో చంద్రబాబు భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన జనసేనాని అనంతరం నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. నోవాటెల్ హోటల్‌లో పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై ఫోన్‌లో అడిగి తెలుసుకున్న చంద్రబాబు నాయుడు మంగళవారం పవన్ కల్యాణ్‌ను నేరుగా కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం పవన్ కల్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబులతో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ఇరువురూ ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీని ఉమ్మడిగా కలిసి ఓడించాలని... వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వకూడదన్న అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే పొత్తులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వడం లేదని అయితే సమయం గడిచిపోతున్న తరుణంలో సొంతంగా వ్యూహాలు రచిస్తున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. అలాగని బీజేపీకి దూరం అయినట్లు కాదని కలుస్తూ ఉంటామని అంతేగానీ ఊడిగం అయితే చేయనంటూ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో చంద్రబాబు పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో..
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో నోవాటెల్ హోటల్‌లో సోమవారం రాత్రి బీజేపీ సోము వీర్రాజు భేటీ అయిన సంగతి తెలిసిందే. మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. వ్యక్తిగత దూషణలతో మొదలైన వైసీపీ ప్రస్థానం, పోలీసులను అడ్డంపెట్టుకుని వ్యక్తిగత స్వేచ్ఛను హరించే స్థాయికి చేరిందని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. జనసేన పార్టీ అధినేతగా అనేక కార్యక్రమాలు, పర్యటనలు చేశారు. వారికి వారుగా వైసీపీ ఒక ఉద్యమం చేస్తుంది. వాళ్ల కార్యక్రమానికి స్పందన రాకపోవడంతో జనసేనపై కుట్ర పన్నారు అని సోము వీర్రాజు ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇక్కడి పరిస్థితులను కేంద్ర పెద్దలకు కూడా వివరించాం. వారు కూడా వైసీపీ దుశ్చర్యలపై పోరాడాలని సూచించారు'అని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: