AP Politics: ఏపీ పాలిటిక్స్ లో షాకింగ్ పరిణామం.. భర్తపైనే భార్య పోటీ..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇల్లు గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. కానీ వైసీపీ అభ్యర్ధికి మాత్రం ఇంట్లోనే ప్రత్యర్ధులు తయారైయ్యారు. రానున్న ఎన్నికల్లో భర్త పైనే భార్య పోటీకిదిగడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
ఈ ఆసక్తికర పరిణామం శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా నిలవాల్సిన ఆయన అర్ధాంగి దువ్వాడ వాణి, ఆయనకు మద్దతు ఇవ్వకపోగా ఆయనపైనే పోటీకి సిద్ధమైయ్యారు.
గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. కాగా ఆమె ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. అయితే దువ్వాడ శ్రీనివాస్‌కి, ఆయన సతీమణి వాణికి మధ్య చోటు చేసుకున్న విబేధాల కారణంగా ఇరువురు గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో గతంలో గతేడాది ఏప్రిల్ 19న మూలపేట పోర్టు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి.. సభలో ప్రసంగిస్తూ నియోజకవర్గ అభ్యర్థిగా దువ్వాడ శ్రీను పేరును ప్రకటించారు. ఆ సమయంలో వాణి దువ్వాడ శ్రీనివాస్‌కు వ్యతిరేకంగా పావులు కదిపారు. శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా పార్టీకి ఇబ్బంది వస్తుందని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనితో సీఎం జగన్ శ్రీనివాస్‌ను పక్కనపెట్టి వాణికి నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయితే మళ్ళీ ఏం జరిగిందో తెలీదుగానీ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్‌ను నియమించి.. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ సైతం ఆయనకే కేటాయించింది వైసీపీ అధిష్టానం. దీనితో వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వాణి రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.