టీఆర్ఎస్ మైండ్ గేమ్.. ఇక జగన్‌తో యుద్ధమేనా?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలాగే శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది.

Update: 2022-10-01 08:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు అలాగే శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూస్తే ఇది నిజమే అని అనిపిస్తుంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ కు కలిసి వచ్చేలా మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు జగన్ పై గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. జగన్ పాలనను విమర్శిస్తూ తెలంగాణ మంత్రులు చేస్తున్న వరుస కామెంట్లు దేనికి సంకేతాలు ఇస్తుందనే చర్చ తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జాతీయ పార్టీ ప్రకటనకు ముంగిట్లో తెలంగాణ, ఏపీ మధ్య మరోసారి పొలిటికల్ వార్ షురూ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు వైసీపీ విషయంలో టీఆర్ఎస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందా? జాతీయ రాజకీయాల్లో తమతో కలిసి రాకుంటే కష్టాలు తప్పవని ఇన్ డైరెక్ట్ గా సంకేతాలు ఇస్తుందా? అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్ మైండ్ గేమ్?:

'నువ్వు మాతో గోక్కుంటే అగ్గితో గొక్కున్నట్టే.. నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతూనే ఉంటా'.. కేంద్రాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ఇటీవల ప్రెస్ మీట్ లో చేసి వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలను బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకోవాల్సిన టీఆర్ఎస్ నేతలు తమను ఎమీ అననప్పటికీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ అవుతున్నది. కేసీఆర్, కేటీఆర్ నుంచి మొదలుకుంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు వరకు ఆ తర్వాత వీరికి మద్దతుగా మరి కొంత మంది ఎమ్మెల్యేలు వైసీపీ పాలనపై కామెంట్స్ చేయడం దుమారం రేపుతుంది. టీఆర్ఎస్ పాలనతో జగన్ పాలనను పోల్చి చూపుతూ రచ్చ రాజేస్తున్నారు. గతంలో చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు కేసీఆర్ జగన్ కు బహిరంగంగానే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోవడంతో వార్ మొదలైందనే ప్రచారం సాగుతున్నది. ముఖ్యంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చురుకుగా అడుగులు వేస్తున్న వేళ పక్క రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి జగన్ మాత్రం బీజేపీతో అంటకాగుతున్నాటనే విషయం కేసీఆర్ కు చిర్రెత్తుకొచ్చేలా చేస్తుందని అందువల్లే వైసీపీపై టీఆర్ఎస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. జాతీయ రాజకీయాల్లో తమతో కలిసి రాకపోతే కష్టాలు తప్పవని జగన్ కు టీఆర్ఎస్ ఈ రూపంలో ఇన్ డైరెక్ట్ సంకేతాలు ఇస్తుందనే చర్చ మొదలైంది. అయితే వైసీపీ మంత్రులు సైతం అంతే రేంజ్ లో రియాక్షన్ ఇవ్వడంతో ఈ గేమ్ మరింత రసవత్తరంగా మార్చివేస్తున్నది.

సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా?:

ఈ వ్యవహారంపై మరో సందేహం కూడా వ్యక్తం అవుతుంది. వైసీపీతో వైరం అంటే టీఆర్ఎస్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను రాజేయడమే అనే టాక్ వినిపిస్తుంది. గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించి తెలంగాణ సెంటిమెంట్ ను కేసీఆర్ రంగరించారు. కానీ పదేళ్ల పరిపాలన కారణంగా సహజంగానే టీఆర్ఎస్ పాలనపై కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి సెంటిమెంట్ కార్డు వర్కౌట్ అవుతుందా అనేది సందేహామే అంటున్నారు. నిజానికి టీఆర్ఎస్ కు తెలంగాణ సెంటిమెంట్ కలిసిరాదనే మాట వినిపిస్తుంది. ఇందుకు దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే నిదర్శనం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదా?:

కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో అనుకూల వాతావరణం ఉంది. కానీ ఏపీ విషయంలో ఇటు చంద్రబాబు, అటు జగన్ తో స్నేహ బంధానికి దారులు మూసుకుపోయాయనే టాక్ ఉంది. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతుండటం వల్ల ఆ పార్టీతోనూ ఛాన్స్ లేకుండా పోయింది. మిగతా రాష్ట్రాల్లో నాయకులు హైదరాబాద్ కు వచ్చి, లేదా కేసీఆరే ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలుస్తున్నారు. కానీ ఏపీ విషయంలో అలాంటి ప్రయత్నాలేమి జరగలేదు. ఈ క్రమంలో వైసీపీని టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయడం.. వైసీపీ వైపు నుండి అంతే రేంజ్ లో కౌంటర్లు రావడం తెలుగునాట ఆసక్తికర పరిణామంగా మారుతున్నది. ఇదిలా ఉంటే శుక్రవారం సజ్జల చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. హరీష్ రావు తమ జోలికి రాకుండా ఆయన పని ఆయన చేసుకుంటే మంచిదని అభిప్రాయపడుతూనే వైసీపీ ఎలాంటి ఫ్రంట్ లో కలవబోదని కుండబద్దలు కొట్టేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్సెస్, వైసీపీ మధ్య పొలిటికల్ గేమ్ ఇంట్రెస్టింగ్ గా మారనుందనే టాక్ వినిపిస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి : 

'మా పనైపోయింది'.. వరంగల్ సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News