ఆంధ్రాలో నిరుద్యోగంతో 21 వేల మంది ఆత్మహత్యలు : YS షర్మిల

ఆంధ్రప్రదేశ్‌లో 21 వేల మంది బిడ్డలు చేసుకునేందుకు పనిలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక సర్వే పేర్కొందని, ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేక ప్రభుత్వం చేస్తున్న హత్యలా..?

Update: 2024-02-22 07:12 GMT

దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో 21 వేల మంది బిడ్డలు చేసుకునేందుకు పనిలేక ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఒక సర్వే పేర్కొందని, ఇవి నిజంగానే ఆత్మహత్యలా లేక ప్రభుత్వం చేస్తున్న హత్యలా..? అని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్భంధంలో ఉన్న ఆమె గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రరాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య నిరుద్యోగమని, డిగ్రీలు, పీజీలు చదివిన చాలా మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలు సంవత్సరానికి 500 మంది చనిపోతున్నారంటే ఇది నిజంగానే ప్రత్యేక హోదా రాక మనం చేతులారా చేసుకున్న పాపం కాదా..? ఇక్కడి బిడ్డలు వలసలు పోయి యువతే లేని రాష్ట్రంగా తయారవదా..?’ అని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు లక్ష 43వేల ఉద్యోగాలు పెండింగ్‌లో పెట్టి దిగిపోయారు. ఆ తర్వాత వచ్చిన జగనన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మీరు ఎన్ని జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చారు. చంద్రబాబు 7వేల ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారని అడిగి మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంటి..? అని నిలదీశారు.

కాంగ్రెస్ నిరసన చేస్తే పాపమా?

‘కాంగ్రెస్ పార్టీ నిరసన చేస్తే పాపమా..? ఎన్ఎస్‌యూఐని గత పదిరోజులుగా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ రోజు ఛలో సెక్రటoరియట్‌కు ఇన్ని ఆంక్షలు ఎందుకు..? ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా..? జర్నలిస్టులను గొడ్డును బాదినట్టు బాదుతున్నారు. ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మమ్మల్ని అడ్డుకోవడం ఎంత వరకు న్యాయం. గత రెండు రోజులుగా పోలీసులు హై అలర్ట్‌లో ఉండి మమ్మల్ని నియంత్రిస్తున్నారు. బాబు పోవాలి జాబ్ రావాలన్న నినాదం మీది కాదా..? దేవుని దయ అన్నారు. దేవుని దయతో అధికారంలోకి వచ్చారు. మరి ఏం చేశారు..?’ అని ప్రశ్నించారు

మెగా డీఎస్సీ అని చెప్పి దగా

‘డీఎస్సీకి కనీసం 150 పుస్తకాలు చదవాలి. గడువు ఉన్నది 26 రోజులు మాత్రమే. మా మీద మానసిక ఒత్తిడి ఉందని ఓ బిడ్డ చెప్పాడు. లక్షలు ఖర్చు పెట్టి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని జగనన్న చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అందులో ఉన్నాయట. లక్ష 21వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయంలో వాళ్ల సైన్యం కోసం ఇచ్చుకున్న ఉద్యోగాలు. ఆర్టీసీని విలీనం చేస్తే వచ్చినవి 51వేల ఉద్యోగాలు. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఈ రోజుకీ ఖాళీగానే ఉన్నాయి. 2,557 ఉద్యోగాలు మాత్రమే ఇప్పటి వరకు భర్తీ చేశారు. 6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడానికి సిగ్గు ఉండాలి.’ అని షర్మిల ధ్వజమెత్తారు. పోలీసులకు మళ్లీ చెప్తున్నాం.. మేము చాలా శాంతియుతంగా సెక్రటేరియట్‌కు వెళ్లాలనుకుంటున్నాం. వెళ్లనివ్వండి అని షర్మిల కోరారు.

Read More..

Breaking: హీటెక్కిన ఏపీ రాజకీయాలు.. వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్  

Tags:    

Similar News