వంద కాదు.. 71 గెలిచినా చాలు!

గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అంచనాలు తలకిందులవుతున్నాయి. రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండడంతో చేసేదిలేక సెంచరీ కొట్టడం పక్కనెట్టి ఇక మ్యాజిక్​ ఫిగర్‌కే పరిమతమవుతోంది. సైలెంట్​ఓటింగ్​ప్రభావం చూపించే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మహానగరం మేయర్​ పీఠాన్ని సొంతంగా దక్కించుకునే అంశాల్లో భాగంగా ప్రధానంగా ప్రలోభాలపై ప్రత్యేక ద‌ృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరద సాయం పంపిణీ కలిసి వస్తుందని ఆశించినా అంతగా ఎఫెక్ట్​ చూపకపోగా, ఓటర్లలో మరింత వ్యతిరేకత పెరిగినట్లు పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో తేలింది. […]

Update: 2020-11-30 21:26 GMT

గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ అంచనాలు తలకిందులవుతున్నాయి. రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండడంతో చేసేదిలేక సెంచరీ కొట్టడం పక్కనెట్టి ఇక మ్యాజిక్​ ఫిగర్‌కే పరిమతమవుతోంది. సైలెంట్​ఓటింగ్​ప్రభావం చూపించే అవకాశాలున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో మహానగరం మేయర్​ పీఠాన్ని సొంతంగా దక్కించుకునే అంశాల్లో భాగంగా ప్రధానంగా ప్రలోభాలపై ప్రత్యేక ద‌ృష్టి సారించినట్లు తెలుస్తోంది. వరద సాయం పంపిణీ కలిసి వస్తుందని ఆశించినా అంతగా ఎఫెక్ట్​ చూపకపోగా, ఓటర్లలో మరింత వ్యతిరేకత పెరిగినట్లు పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో తేలింది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు 71 గెలిచి పరువు దక్కించుకుంటే చాలు అనే పరిస్థితిలో ఉన్నట్లు తెలస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ మూడు విడుతల్లో చేసిన సర్వేల్లో పలు అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్​ ఎన్నికల ప్రచారం తర్వాత మంత్రి కేటీఆర్​ టీం ఆఖరి సర్వే నిర్వహించింది. ఇద్దరు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వేలో మొత్తం 150 సీట్లలో బీజేపీకి ఈసారి 48 నుంచి 53 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నట్లు తేలింది. రెండో సర్వేలో బీజేపీ స్థానాల సంఖ్య 43గా తేల్చింది. ఆ తర్వాత పరిణామాలు కొన్నిచోట్ల బీజేపీకి లాభించినట్లు గుర్తించారు. దీంతో మొత్తం 48 నుంచి 53 డివిజన్ల మధ్యలో బీజేపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. సమీకరణాలు మారినా బీజేపీకి 48 సీట్లు వస్తాయని తేలుతోంది. ఇక టీఆర్ఎస్​ దోస్తీ పార్టీ మజ్లీస్​యథావిధిగానే 40 స్థానాల్లో ఉంటుందని మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన సర్వేలో పేర్కొన్నారు. అయితే మజ్లీస్​ గతంలో బీజేపీ పోటీ చేసి గెలిచిన ఐదు స్థానాలపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. మజ్లీస్​ పాచికలు పారితే ఇంకో రెండు, మూడు స్థానాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు వివరించారు. ఇక కాంగ్రెస్​ ఈసారి 6 నుంచి 10 సీట్ల మధ్య గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తెలిపారు. కొన్నిచోట్ల రెబెల్స్​ ప్రమాదం కూడా పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం నాటి అంచనా ప్రకారం అధికారపార్టీ 56 స్థానాల్లో గెలిచేందుకు అవకాశాలున్నట్లు తేలింది. పరిస్థితులు మారితే ఇంకో నాలుగైదు పెరిగే ఛాన్స్​ ఉంది.

టీఆర్ఎస్ సర్వేలో కొన్ని పరిశీలిస్తే..

– ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని ఆరు వార్డుల్లో ఐదింటా పోటీ గట్టిగా ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ ఉండగా, భోలక్‌పూర్‌ డివిజన్‌లో మాత్రం ఎంఐఎం, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్‌ కేటాయించడంతో వారిమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. ఇక కొంతమంది టికెట్‌ ఆశించిన నేతలు అభ్యర్థుల విజయం కోసం పనిచేయలేదు. వ్యతిరేకంగా పని చేయడంతో పాటు బీజేపీ అభ్యర్థులతో కలిసినట్లు అనుమానాలున్నాయి. దీనిపై మంత్రి కేటీఆర్‌కు పేర్లతో వివరించారు. కాంగ్రెస్‌ నామమాత్రంగా పోటీ ఇవ్వగా, ఆ పార్టీ ఓటు బ్యాంకు బీజేపీకి లాభం చేకూరుతుందని అంచనా వేశారు.

– ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లలో పదింటా టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా.. నేనా? అనే రీతిలో ఉంది. చైతన్యపురి, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, చంపాపేట్, కొత్తపేట డివిజన్లలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉండగా హస్తినాపురంలో మాత్రం టీఆర్ఎస్​మొత్తానికి వెనకబడింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. గడ్డి అన్నారంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంది. ఇక బస్తీ ఓట్లు హస్తినాపురం, చంపాపేట, కొత్తపేట, నాగోల్, హయత్‌నగర్, మన్సూరాబాద్‌ డివిజన్లలో కీలకం కానున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో అధికార పార్టీకి దెబ్బ పడుతుందని భావిస్తున్నారు. వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్‌లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంత ఓటర్లు కీలకం. అయితే ఇక్కడ మొత్తం అధికార పార్టీ సిట్టింగ్‌ కార్పొరేటర్లే పోటీలో ఉండగా, భూముల కబ్జాలు, భూ పంచాయతీలపై తీవ్రంగ ఆరోపనలున్నాయి. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఉండటం, పాత హామీలు నెరవేర్చడంలో సఫలం కాకపోవడంతో బీజేపీకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది.

– జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ బీజేపీ మెజార్టీ సాధిస్తుందని తేలింది. ఎందుకంటే సిట్టింగ్‌ కార్పొరేటర్​ సంజయ్‌కు టికెట్‌ ఇవ్వకుండా రాజ్‌కుమార్‌ పటేల్‌కు కేటాయించడంతో సంజయ్‌ వర్గం చాపకిందనీరులా వ్యతిరేకంగా బీజపీకి అనుకూలించేలా పనిచేస్తోంది. రహమత్‌నగర్‌లో బీజేపీ దాదాపుగా వెనకబడింది. బోరబండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, డిప్యూటీ మేయర్​ బాబా ఫసియుద్దీన్‌ పట్ల వ్యతిరేకత ఇబ్బందిగా ఉంది. ఇక్కడ బీజేపీకే అవకాశాలున్నట్లు తేల్చారు.

– మోండా డివిజన్‌లో మూడు పార్టీలో కొట్లాడుతున్నాయి. ఆఖరి రెండు రోజుల్లో కాంగ్రెస్​ కొంత వెనకబడటంతో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. అయితే టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌పై స్థానికంగా వ్యతిరేకత ప్రచారంలో నిరసనలతో బయట పడింది. ఇక ఎమ్మెల్యే సాయన్న తన కూతురు లాస్యనందిత పోటీ చేస్తున్న ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్‌లో ప్రచారానికే పరిమతమయ్యారు. దీంతో ఇక్కడ ముథోల్​ ఎమ్మెల్యేను ఇన్ చార్జిగా పెట్టినా పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ప్రచారం కూడా అనుకున్న స్థాయిలో జరుగలేదని, దీంతో బీజేపీ కొత్త అభ్యర్థి అయినా స్వచ్ఛందంగా ఆమెకు ప్రచారం చేయడంతో కలిసి వస్తుందని గుర్తించారు.
– ఇక ఈసారి టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఓటర్లు బీజేపీ వైపు మళ్లినట్లు అంతర్గత సర్వేలో స్పష్టమైంది. టీడీపీ శ్రేణులు చాలా మేరకు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఉదాహరణగా వలస ఓటర్లున్న కేపీహెచ్‌బీ కాలనీలో బీజేపీకి కలిసి వస్తుందని తేలింది. ఇక ఫతేనగర్‌లో టీఆర్‌ఎస్, బీజేపీకి హోరాహోరీగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్​రెబెల్‌గా ముస్లిం వర్గానికి చెందిన అభ్యర్థి పోటీలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో బీజేపీకే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏదేమైనా 71 గెలవాలే..

సర్వేల్లో అసలు సంగతి తేలడంతో ప్రస్తుతం టీఆర్ఎస్​టార్గెట్ సెంచరీ మీద లేదు. మేయర్​ పీఠాన్ని సొంతంగా దక్కించుకునేందుకు ఎక్స్​ఆఫీషియో సభ్యులతో కలుపుకుని కావాల్సిన స్థానాలపైనే దృష్టి పెట్టింది. గత గ్రేటర్​ఎన్నికల్లో టీఆర్ఎస్​ 99 స్థానాలను దక్కించుకుంది. దీంతో టీఆర్ఎస్​ సెంచరీ కొడుతామని ఈసారి ఎన్నికల ప్రచారంలో ప్రకటించుకుంది. కానీ దుబ్బాక ఉప ఎన్నికల తర్వాత అనూహ్యంగా కమల దళం వికసించింది. దీంతో గ్రేటర్‌లో పరిణామాలు మారాయి. అయితే అధికార పార్టీకి సొంతంగా మేయర్​ పీఠం దక్కాలంటే 71 కార్పొరేటర్లు కచ్చితంగా కావాల్సిందేనని, ఏదేమైనా ఆ స్థానాలు గెలవాల్సిందేనని లెక్కలేసుకుంటూ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఎక్స్​అఫీషియో 25 సభ్యుల వరకు ఇప్పటికే ఉండగా, మరో ఆరుగురిని కూడా ఇక్కడే నమోదు చేయించాలని భావిస్తున్నారు. మొత్తం 31 లేదా 33 మంది ఎక్స్​ అఫీషియో సభ్యులతో మేయర్​ పీఠాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యం ముందు పెట్టుకున్నారు. ఇదిలావుండగా, ఇద్దరం దోస్తులమే అన్నట్టుగా టీఆర్ఎస్‌తో మజ్లీస్ వ్యవహరించినా అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీ ప్రభుత్వంపై మండిపడుతూనే ఉంది. అటు అసెంబ్లీలో కూడా అంతే. ఈ నేపథ్యంలో మేయర్​ పీఠంలో కూడా పొత్తు చేయాల్సి వస్తే రాజకీయంగా కొంతమేరకు ఇబ్బందికర పరిణామాలు ఉంటాయనే భయం కూడా గులాబీ నేతలకు పట్టుకుంది. దీంతో అధికార పార్టీ నేతలు పైకి ధీమా కనబరుస్తున్న లోలోన మాత్రం ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ప్రలోభాలపైనే ప్రత్యేక దృష్టి

పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారడంతో తాజా పరిస్థితులకనుగుణంగా అధికార పార్టీ ప్రలోభాలపై ప్రధాన దృష్టి పెట్టింది. దీనికి అధికార యంత్రాంగాన్ని సైతం వినియోగించుకుంటుందనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఒక్కో డివిజన్‌కు రూ.5 కోట్లు పెట్టేందుకు కూడా వెనకాడకుండా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ముందు నుంచి ఒక్కో డివిజన్‌కు రూ.2 కోట్లు అవసరముంటాయని సగటున లెక్కలేసుకున్నారు. కానీ పరిస్థితులు మారడంతో ప్రలోభాల కోసం సొమ్మును పెంచుకున్నట్లు కొందరు అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ఇదిలావుండగా పోలింగ్​ శాతం తగ్గడంపైనే అధికార పార్టీ ఆశలు పెట్టుకున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పోలింగ్​శాతం తగ్గితేనే గులాబీకి అనుకూలంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో తమ అనుకూల వర్గాలను తప్పని సరిగా పోలింగ్‌ కేంద్రాలను రప్పించుకుని ఓట్లువేసేలా చేయాలని ఇప్పటికే మంత్రి కేటీఆర్​బల్క్​ఎస్‌ఎంఎస్‌లు పంపించినట్లు సమాచారం.

ఫలితాలు ఎలా ఉంటాయో..

మంగళవారం(నేడు) ఉదయం 7 గంటలకు పోలింగ్​ మొదలుకానుంది. ఈసారి ఓటర్ల సరళి పార్టీలకు అంతు చిక్కడం లేదు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటుందన్న విషయంపైనే పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి నుంచే పంపకాలు మొదలుపెట్టగా చాలా చోట్ల గులాబీ కండువాలతో దొరికారు. అయితే అధికారికంగా టీఆర్ఎస్​ గుర్తించిన చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే నువ్వా నేనా..? అనేలా పోటీ ఉండగా, అక్కడక్కడా కాంగ్రెస్‌ పోటీ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తి అందరిలో నెలకొంది.

Tags:    

Similar News