ప్రజాప్రతినిధులకు కరోనా పరేషాన్
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక మంత్రే క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవడంతో పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతేనే ప్రగతి భవన్‌లో ఉంటున్నారు. లేదంటే ఫాంహౌస్‌కు పరిమితమవుతున్నారు. మంత్రి కేటీఆర్ బైట తిరగడాన్ని వీలైనంతగా తగ్గించుకుని ప్రగతి భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు. వైరస్ ఎవరి నుంచి ఏ రూపంలో అంటుకుంటుందో అంతుచిక్కడం లేదు. అందుకే చాలా మంది నేతలు వ్యక్తిగత సిబ్బందిని వీలైనంతగా తగ్గించుకుంటున్నారు. ఆఫీసులకు వెళ్ళడం మానుకున్నారు. జనగాం […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక మంత్రే క్వారంటైన్‌లోకి వెళ్ళిపోవడంతో పార్టీల నేతల్లో గుబులు పట్టుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైతేనే ప్రగతి భవన్‌లో ఉంటున్నారు. లేదంటే ఫాంహౌస్‌కు పరిమితమవుతున్నారు. మంత్రి కేటీఆర్ బైట తిరగడాన్ని వీలైనంతగా తగ్గించుకుని ప్రగతి భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లో కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటున్నారు. వైరస్ ఎవరి నుంచి ఏ రూపంలో అంటుకుంటుందో అంతుచిక్కడం లేదు. అందుకే చాలా మంది నేతలు వ్యక్తిగత సిబ్బందిని వీలైనంతగా తగ్గించుకుంటున్నారు. ఆఫీసులకు వెళ్ళడం మానుకున్నారు.
జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి పాజిటివ్ నిర్ధారణ కావడం, ఆయనతో పాటు మరో ఐదుగురికి కూడా కరోనా సోకడంతో రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి వారిని ప్రత్యక్షంగా కలుస్తున్న నేతలకు టెన్షన్ పట్టుకుంది. సీనియర్ నేతలతో సమావేశాల్లో పాల్గొనే ఐఏఎస్ స్థాయి అధికారులకూ టెన్షన్ తప్పడం లేదు. వైరస్ ఉందో లేదో తేల్చుకోడానికి నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. నిన్నమొన్నటిదాకా బేఫికర్‌గా తిరిగిన చాలా మంది ఎమ్మెల్యేలు, పార్టీల నాయకులు ఇప్పుడు జాగ్రత్త పడాలనే అభిప్రాయానికి వచ్చేశారు.
తొలుత జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మాత్రమే పాజిటివ్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన భార్య, గన్‌మన్, డ్రైవర్, వంటమనిషికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. ఇందుకు కారణం తొలుత ఆయనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేత ఒకరికి పాజిటివ్ నిర్ధారణ కావడం. ఆ తర్వాత ఆయన డ్రైవర్‌కు కరోనా రావడం. తాజాగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. ఆయన గన్‌మన్‌కు పాజిటివ్ రావడంతో ఆఫీసుకు వారం రోజుల పాటు తాళం పడింది.
మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్
అన్‌లాక్‌డౌన్ నిర్ణయం జరిగినప్పటి నుంచి ఉద్యోగులంతా వంద శాతం ఆఫీసులకు రావాల్సిందేనని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ ఈ ఉద్యోగులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఎవరిని కలుస్తున్నారో తెలియదు. చివరకు వైరస్‌ను ఆఫీసుకు మోసుకొస్తున్నారు. మిగిలినవారికి అంటిస్తున్నారు. ఫలితంగా వారం రోజుల పాటు ఆఫీసుకు సెలవు ఇవ్వాల్సి వస్తోంది. మళ్ళీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సి వచ్చింది. సచివాలయంలోని ఆర్థిక విభాగంలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ బ్లాక్ మొత్తం ఖాళీ అయింది. సిబ్బందిని ఇళ్ళకు పంపాల్సి వచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఇళ్ళ నుంచే పనిచేస్తున్నారు.
బేగంపేట మెట్రో రైల్ భవన్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒకరికి పాజిటివ్ రావడంతో ముఖ్య కార్యదర్శి సైతం కరోనా పరీక్ష చేయించుకుని వైరస్ ఉందో లేదో నిర్ధారణ చేసుకోవాల్సి వచ్చింది. వారం రోజుల పాటు ఆఫీసుకు సెలవు ఇవ్వక తప్పలేదు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో హెల్త్ సెక్షన్‌లో ఒకరికి పాజిటివ్ రావడంతో మొత్తం సెక్షన్‌నే మూసివేయాల్సి వచ్చింది. తాజాగా సిద్దిపేట కలెక్టర్ సైతం సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇళ్ళ నుంచి పనిచేయాల్సి వస్తోంది. అవసరాన్ని బట్టి ఇంట్లోనే వీడియో కాన్ఫరెన్సుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తొలుత అరణ్య భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. వ్యక్తిగత సహాయకుడికి పాజిటివ్ అని తెలియడంతో చివరకు ఆ సెటప్ మొత్తాన్ని ఇంటికి మార్పించుకుని సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు. చాలా శాఖల ఉన్నతాధికారులు సురక్షితం అనుకున్నచోటి నుంచి లేదా ఇళ్ళ నుంచే పనిచేస్తున్నారు. ఫైళ్ళను, కాగితాలను ముట్టుకోవాలంటే కూడా వణికిపోతున్నారు. వాటిని శుభ్రం చేసిన తర్వాత మాత్రమే ముట్టుకుంటున్నారు.
మంత్రులకు పాజిటివ్
మహారాష్ట్రలో ముగ్గురు మంత్రులకు పాజిటివ్ సోకింది. తొలుత ప్రజాపనుల శాఖ మంత్రి అశోక్ చవాన్‌కు వైరస్ సోకగా ఆ తర్వాత గృహనిర్మాణ మంత్రి జితేంద్ర అవధ్‌కు వచ్చింది. తాజాగా సోషల్ జస్టిస్ మంత్రి ధనుంజయ్ ముండేకు వచ్చింది. అంతకు ముందు ఎన్సీపీ నేత ఆనంద్ పరింజిపెకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇక తమిళనాడులో డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌కు కరోనా సోకడంతో నాలుగైదు రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉండి కూడా చికిత్స ఫలించక చనిపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు పాజిటివ్ ఉందన్న అనుమానంతో పరీక్ష చేయించుకున్నారు. చివరికి నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా కూడా పాజిటివ్ బారిన పడ్డారు. ఇతర దేశాల్లో సైతం ప్రజా ప్రతినిధులకు ఈ బాధ తప్పలేదు. బ్రిటన్ ప్రధాని ప్రిన్స్ ఛార్లెస్, రష్యా ప్రధాని లాంటివారు కరోనా బారిన పడి చావుదాకా వెళ్ళి బతికి బట్టకట్టారు.
నిబంధనలను గాలికొదిలేస్తున్న నేతలు
సోషల్ డిస్టెన్స్, మాస్కు లాంటి నిబంధనలను పాటించాల్సిన రాజకీయ నేతలు వాటికి తిలోదకాలు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్ నిబంధనలను తుంగలో తొక్కి గత నెల 29న కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా మాస్కు లేకుండా చుట్టూ పదుల సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు. మతపరమైన ప్రార్థనలు చేశారు. అదే బాటలో ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్ సైతం సిరిసిల్ల నియోజకవర్గంలో వందలాది మందితో ర్యాలీలో పాల్గొన్నారు. ఇక మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, తలసాని లాంటివారు సైతం సామాజిక దూరం పాటించకుండా పాల్గొంటున్నారు. బీజేపీ కేంద్ర నేతలు మాత్రం కాస్త ముందుచూపుతో వీడియో ప్రచారానికి శ్రీకారం చుట్టాయి. బిహార్ ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ సీనియర్ నేత అమిత్ షా వీడియో ద్వారా ప్రసంగించి ఓటర్లను చేరుకునే ప్రయత్నం చేశారు.