కనిపించని సామాజిక దూరం !
దిశ, ఖమ్మం: జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కరోనా కట్టడికి పెట్టుకున్న కట్టుబాట్లు తెగిపోతున్నాయి. కరోనా నివారణకు పాటించాల్సిన సామాజిక దూరం తగ్గిపోతోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖలను కొంతమంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే చెరిపేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ సమాజాన్ని ప్రమాదంలో పడేసేలా వారి వైఖరి ఉండటం గమనార్హం. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో గడపదాటేస్తున్నారు. సేవ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మాటున నలబై యాబై మంది ఒక్కచోట చేరడాన్ని ప్రజలు […]
దిశ, ఖమ్మం: జిల్లాలో లాక్‌డౌన్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కరోనా కట్టడికి పెట్టుకున్న కట్టుబాట్లు తెగిపోతున్నాయి. కరోనా నివారణకు పాటించాల్సిన సామాజిక దూరం తగ్గిపోతోంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ గీసిన లక్ష్మణ రేఖలను కొంతమంది రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే చెరిపేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో కొనసాగుతూ సమాజాన్ని ప్రమాదంలో పడేసేలా వారి వైఖరి ఉండటం గమనార్హం. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో గడపదాటేస్తున్నారు. సేవ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల మాటున నలబై యాబై మంది ఒక్కచోట చేరడాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఓ వైపు కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని తమకు సూచిస్తూనే రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం విడ్డూరంగా ఉందని సామాన్య జనం పేర్కొంటున్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను నడిపించడానికి ఎమ్మెల్యేలు, మంత్రి , ఇతర ముఖ్యమైన ప్రజా ప్రతినిధుల అవసరం తప్పదు. అది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఈ స్థాయి నేతల చుట్టూ అవసరం లేకున్నా చోటా మోటా నేతలు గుమి కూడుతున్నారు. ఇలా బయటకు వచ్చిన వారు కనీసం సామాజిక దూరం పాటించడం లేదు. అలాగే కరోనా సోకకుండా పాటించాల్సిన కనీస జాగ్రత్తలను అంటే ముఖానికి మాస్కులు ధరించడం, శానిటైజర్లతో తరుచూ చేతులు కడుక్కోవడం వంటివి చేయకుండా యథేచ్ఛగా మందిలో కలిసి షరామాములుగానే రాజకీయ హడావుడికి దిగుతుండటం గమనార్హం. కరోనా ఓ వైపు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసి కూడా ఇలా యథేచ్చగా తిరగడం మంచిది కాదని ప్రజానీకం హెచ్చరిస్తున్నారు.
భద్రాద్రిలో మొదట 4 కేసులు నమోదైన తర్వాత కట్టుదిట్టమైన చర్యలతో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదృష్టవశాత్తు ఇక ఖమ్మంలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడ నమోదు కాలేదు. ప్రజలెంతో సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఆకతాయిలు మినహా మిగతా జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. వచ్చిన చిక్కల్లా సేవా కార్యక్రమాల మాటున కొంతమంది రోడ్లపైకి చేరుకుంటున్నారు. భోజనం ప్యాకెట్ల పంపిణీ, బియ్యం పంపిణీ అంటూ ఒకరు కాదు..ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో గుమిగూడి ఫొటోలు దిగుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టే వారిని ప్రతీ ఒక్కరిని అభినందించాల్సిందే. అయితే కరోనా కట్టడికి వైద్యులు సూచిస్తున్న నిబంధనలేవీ పాటించకపోవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా అలాంటి వారు తీరు మార్చుకోవాలని, రాజకీయ నాయకులు సైతం పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.
Tags: coronavirus, lockdown, public representatives, sanitizers, bhadradri, corona positive, lunch packets, Khammam district