పాలిటిక్స్ @భాగ్యలక్ష్మీ టెంపుల్..

దిశ, క్రైమ్‌బ్యూరో : హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌పిక్ నిలుస్తోంది. ఈ టెంపుల్ నుంచే బల్దియా ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆ ఆలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయడంతో ఈ టెంపుల్ రాజకీయాలకు ముఖచిత్రంగా మారింది. బల్దియా ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మరోసారి చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజకీయంగా హిందూ ఓటు బ్యాంక్‌ను […]

Update: 2021-02-21 12:08 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో : హైదరాబాద్‌లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌పిక్ నిలుస్తోంది. ఈ టెంపుల్ నుంచే బల్దియా ఎన్నికల ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆ ఆలయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయడంతో ఈ టెంపుల్ రాజకీయాలకు ముఖచిత్రంగా మారింది. బల్దియా ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మరోసారి చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. రాజకీయంగా హిందూ ఓటు బ్యాంక్‌ను వినియోగించుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే విమర్శలు బీజేపీపై లేకపోలేదు. ఇదిలా ఉండగా, ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. బల్దియా సారథులు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి సోమవారం పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా వీరు సైతం ఆదివారం భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మీ ఆలయం కేంద్రంగా రాజకీయాలు మారబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

హిందూ సెంటిమెంట్ కోసమే..

రాష్ట్రంలో ఎంతో కొంత ప్రాబల్యం కలిగిన బీజేపీకి గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఈ సంఖ్య ఒకటికే పరిమితమైంది. ఈ క్రమంలో దుబ్బాకలో వచ్చిన ఉప ఎన్నిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. కేసీఆర్‌కు గట్టి పట్టున్న ప్రాంతంగా చెప్పుకునే దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడం హాట్ టాపిక్‌గా మారింది. అనంతరం బల్దియా ఎన్నికల్లోనూ దూకుడును కొనసాగిస్తూ 48 స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్-ఎంఐఎం ఒక్కటేనని బీజేపీ ప్రచారం చేయడంతో హిందూవుల ఓట్లను ఎక్కడ దూరం చేసుకుంటామేమోనని టీఆర్ఎస్ ఆచీతూచీగా వ్యవహారిస్తూ విమర్శల పరిధిని కుదించుకోవాల్సి వచ్చింది. బీజేపీ పట్ల, ఎంఐఎం పట్ల స్పష్టమైన అభిప్రాయాన్ని టీఆర్ఎస్ చెప్పలేకపోయినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ పార్టీ సైతం హిందూవుల పార్టీగానే చిత్రీకరించే ప్రయత్నాలను చేస్తూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో ఘాటైన వ్యా్ఖ్యలు చేసేందుకు యత్నించారు. కానీ, హిందూ- ముస్లీం వ్యవహారంలో మాత్రం ఆగట్టునుంటావా.. ఈ గట్టునుంటావా అనే ప్రశ్నకు టీఆర్ఎస్ నుంచి సమాధానం అస్పష్టంగానే ఉండేది. ఈ విషయం బీజేపీకి ప్లస్ అయింది. దీంతో భవిష్యత్తులో తమ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ బాటలోనే టీఆర్ఎస్ సైతం పయనిస్తోందని స్పష్టమవుతున్నట్టు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ కవిత, తాగాజా బల్దియా సారథులు ఆ ఆలయంలో పూజలు చేయడంతో హిందూ సెంటిమెంట్ ను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. దీంతో బీజేపీ రాజకీయ ఎత్తుగడలో టీఆర్ఎస్ పడినట్టు పలువురు భావిస్తున్నారు. టీఆర్ఎస్ నిజంగానే.. బీజేపీ ట్రాప్ లో పడిందా… లేదంటే, బీజేపీ నుంచి హిందువులను దూరం చేసేందుకే కొత్త ఎత్తుగడలకు దిగుతుందా.. అనేది భవిష్యతులో చూడాలి.

Tags:    

Similar News