పోలీసుల అత్యుత్సాహం.. ఆలయం బయటే అడ్డగింత
దిశ, దుబ్బాక : గత ఐదు రోజులుగా దుబ్బాక పట్టణంలో జరుగుతున్న శ్రీ బాలాజీ దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలలో ప్రతి ఒక్కరు తమ వంతుగా ప్రత్యక్షంగానో , పరోక్షంగానో భాగస్వాములైనవారే. అయితే శుక్రవారం రోజున స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, స్వామి వారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు పాస్‌లు అధికారికంగా జర్నలిస్టులతో పాటు పలువురికి దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అందించారు. ఈ మేరకు వారికి అందిన పాస్‌ల ఆధారంగా ఉత్సవాలకు […]
దిశ, దుబ్బాక : గత ఐదు రోజులుగా దుబ్బాక పట్టణంలో జరుగుతున్న శ్రీ బాలాజీ దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలలో ప్రతి ఒక్కరు తమ వంతుగా ప్రత్యక్షంగానో , పరోక్షంగానో భాగస్వాములైనవారే. అయితే శుక్రవారం రోజున స్వామి వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట, స్వామి వారి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పలు పాస్‌లు అధికారికంగా జర్నలిస్టులతో పాటు పలువురికి దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో అందించారు. ఈ మేరకు వారికి అందిన పాస్‌ల ఆధారంగా ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్లిన పలువురు డోనర్లు, వారి కుటుంబీకులు, జర్నలిస్టులను పోలీసులు అత్యుత్సాహంతో ఆలయ రాజగోపురం బయటనే వెనకకు వెళ్లాలని, ఆలయంలోకి ప్రవేశం లేదని చెప్పి తమ ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి వెనుకకు తోసేశారు.
ఈ క్రమంలో జర్నలిస్టులు, భక్తులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ఆలయ కమిటీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ పలువురు నినాదాలు చేయగా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపట్ల అసహనం వ్యక్తం చేస్తూనే జర్నలిస్టులు, భక్తులు అక్కడి నుండి వెనుదిరిగి సోషల్ మీడియాలో ఆలయ కమిటీ అధికారుల తీరు, పోలీసుల వ్యవహారం పట్ల తమ అక్కసు వెల్లగక్కారు. ఈ వ్యవహారంపై పలువురు పోలీసులను ప్రశ్నించగా.. కేవలం ఆలయ కమిటీ వారు ఫౌండర్ పాస్లు కలిగి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని సూచించారని, ఆ మేరకే తాము అందరినీ నిలువరిస్తున్నట్లు సమాధానమిచ్చారు.
ప్రత్యేక పాస్‌లు ఆలయ కమిటీ తమ కుటుంబీకులు, తమ సంబంధీకుల కోసమే ఫౌండర్ పాస్లు జారీ చేశారని, మిగితా వారికి తూతూ మంత్రంగానే విలువలేని పాస్‌లు జారీ చేసి వారిని అవమానపరిచే విధంగా వ్యవహరించారని పలువురు మండిపడ్డారు. ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు భాగస్వాములైనా ఆలయ కమిటీ తీరు పట్ల దుబ్బాకలోని పలు కుల సంఘాలు సైతం తమ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏది ఏమైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఇన్ని రకాల పాస్‌లు జారీ చేసి కేవలం ఫౌండర్ పాస్‌లను మాత్రమే అనుమతించి, మిగిలిన వారిని అనుమతించకపోవడం శోచనీయం.