పని ఉందని రమ్మని.. ఫోన్ స్విచ్చాఫ్ చేశారు
దిశ, శేరిలింగంపల్లి : అసలే కరోనా ఎఫెక్ట్.. అందులోనూ లాక్‌డౌన్. అడుగుతీసి అడుగు బయట పెట్టాలంటేనే సవాలక్ష ఆంక్షలు. అయినా ఉపాధి కల్పిస్తాం అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పిలవడంతో పొట్టకూటి కోసం రెండేళ్ల పాప, రెండు నెలల పసిగుడ్డుతో కలిసి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, గంపెడు ఆశలతో ఒంగోలు నుండి భాగ్యనగరానికి చేరుకుంది ఓ కుటుంబం. కానీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడంతో ఎక్కడికి వెళ్లాలో […]
దిశ, శేరిలింగంపల్లి : అసలే కరోనా ఎఫెక్ట్.. అందులోనూ లాక్‌డౌన్. అడుగుతీసి అడుగు బయట పెట్టాలంటేనే సవాలక్ష ఆంక్షలు. అయినా ఉపాధి కల్పిస్తాం అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి పిలవడంతో పొట్టకూటి కోసం రెండేళ్ల పాప, రెండు నెలల పసిగుడ్డుతో కలిసి ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, గంపెడు ఆశలతో ఒంగోలు నుండి భాగ్యనగరానికి చేరుకుంది ఓ కుటుంబం. కానీ ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ కుటుంబం ఆదరించే వారు లేక గత మూడు రోజులుగా బస్టాండ్‌లోనే ఉంటూ ఆకలితో అలమటిస్తున్న వారిని పోలీసులు మేమున్నామంటూ ఆదరించి అక్కున చేర్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఒంగోలుకు చెందిన నాగరాజు అనే వ్యక్తికి కూకట్ పల్లికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఫోన్ చేసి పని నిమిత్తం హైదరాబాద్ రమ్మని కబురు చేశాడు. అసలే లాక్డౌన్ కారణంగా పనులు లేకపోవడంతో పని ఉందని ఫోన్ రాగానే సంతోషంతో తన భార్య రాజేశ్వరి, రెండు సంవత్సరాల పాప, రెండు నెలల పసికందును తీసుకుని గూడ్స్ వాహనంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నగరానికి చేరుకున్నారు. తీరా ఇక్కడకు చేరుకున్న తర్వాత పని ఇస్తా అని చెప్పిన కాంట్రాక్టర్ ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో శేరిలింగంపల్లి నియోజకవర్గం భాగ్యనగర్ కాలనీ బస్టాప్ వద్ద గత మూడు రోజులుగా తలదాచుకుంటున్నారు.
ఎవరైనా ఆవైపు వచ్చి ఏదైనా ఇస్తే తింటూ పసిపిల్లలతో ఎటు వెళ్లాలో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు. వీరిని గమనించిన కూకట్ పల్లి పోలీసులు పెట్రోల్ వాహనంలో స్టేషన్ కు తరలించి విచారించారు. వారి ఆకలి ఘోష, ఆవేదన విన్న పోలీసులు ఆడ్మిన్ ఎస్సై శంకర్, ఇతర సిబ్బంది ఆ కుటుంబానికి అన్నం పెట్టించి, రైలు టికెట్స్ బుక్ చేసి, దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి, తమ వాహంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు దిగబెట్టారు. ఖాకీ డ్రెస్ చాటున కాఠిన్యమే కాదు, వారిలోనూ సున్నితమైన మనస్సు ఉంటుందని చాటిచెప్పారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకున్న క్రైమ్ సిబ్బంది ఆగు ఎల్లుస్వామి, సురేష్, పరమేశ్వర్ రెడ్డిలను సీఐ నర్సింగరావు ప్రత్యేకంగా అభినందించారు.