ప్రపంచంలోనే అందమైన పాల దుకాణం ‘ఫండ్స్ మొకెరెయ్’
దిశ, వెబ్ డెస్క్ : ఓ ఇంద్రభవనం లాంటి భవంతిలోకి వెళ్లి.. పాలు, పెరుగు, నెయ్యి కొనుక్కొని వస్తే ఎలా ఉంటుంది? మొదట ఒకింత ఆశ్చర్యంగా.. ఆ తర్వాత కొంత ఇబ్బందిగానూ అనిపిస్తుంది కదా. అయితే ప్రపంచంలోనే అత్యంత అందమైన పాల భవనం ఒకటి జర్మనీలోని డ్రెస్‌డన్‌లో ఉంది. పాల దుకాణం అనగానే.. మనకు ఏదో చిన్న షట్టర్, పల్లెటూర్లో అయితే ఇంటి ముందర గేదెలు, పేడ వాసన, చుట్టూ గడ్డి.. ఇలాంటి దృశ్యాలే గుర్తొస్తాయి. కానీ, […]
దిశ, వెబ్ డెస్క్ : ఓ ఇంద్రభవనం లాంటి భవంతిలోకి వెళ్లి.. పాలు, పెరుగు, నెయ్యి కొనుక్కొని వస్తే ఎలా ఉంటుంది? మొదట ఒకింత ఆశ్చర్యంగా.. ఆ తర్వాత కొంత ఇబ్బందిగానూ అనిపిస్తుంది కదా. అయితే ప్రపంచంలోనే అత్యంత అందమైన పాల భవనం ఒకటి జర్మనీలోని డ్రెస్‌డన్‌లో ఉంది. పాల దుకాణం అనగానే.. మనకు ఏదో చిన్న షట్టర్, పల్లెటూర్లో అయితే ఇంటి ముందర గేదెలు, పేడ వాసన, చుట్టూ గడ్డి.. ఇలాంటి దృశ్యాలే గుర్తొస్తాయి. కానీ, ఈ పాల దుకాణం మాత్రం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ఒక్కసారి ఆ పాల సువాసనలు, అందమైన భవంతి విశేషాలేంటో చూసొద్దాం రండి!
జర్మనీ ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నెలవు. అక్కడి డ్రెస్‌డన్‌లోని బట్జ్‌నర్, 79వ వీధిలో ఉన్న ‘ఫండ్స్ మొకెరెయ్’ అనే పాల దుకాణం కూడా అలాంటి ప్రదేశమే. అందులో పాల ఉత్పత్తులన్నీ లభిస్తాయి. ఇక ఆ పాల దుకాణంలో అడుగుపెడితే.. మన కళ్లను మనమే నమ్మలేం. ఎటు చూసినా.. అందమైన కళాకృతులు, పెయింటింగ్స్, సిరామిక్ వస్తువులు, అందమైన షాండ్లియర్లు, ఆకర్షించే స్తంభాలు, ఆకట్టుకునే సీలింగ్.. అబ్బో! అది నిజంగా ఓ ఇంద్రభవనమే. అందుకే ఈ పాల దుకాణాన్ని చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రతి ఏడాది 5 లక్షల మంది దీన్ని సందర్శిస్తారు. ఇందులోని సిరామిక్ టైల్స్ అన్నింటిని విల్లేరాయ్ అండ్ బోచ్ అనే ప్రముఖ కంపెనీలు తయారు చేశాయి. ఇక వాటిపై స్థానిక కళాకారులు చేతితో వేసిన పెయింటింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలున్న మొకెరాయ్.. 1998లో ‘ప్రపంచంలోనే అందమైన డైరీ షాప్’గా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది.
ఈ ప్యాలెస్‌ను 1891లో నిర్మించారు. 1930 నాటికి.. అక్కడ 60 వేల లీటర్ల పాలు విక్రయించేవారు. ఆ తర్వాత పాలనే కాకుండా.. పాల ఉత్పత్తులను కూడా అమ్మడం ప్రారంభించారు. రెండు ప్రపంచ యుద్ధాల కాలంలోనూ దీని సేవలు కొనసాగాయి. కొన్ని కారణాల వల్ల 1978లో క్లోజ్ చేసినా.. 1995లో మళ్లీ తెరుచుకుంది. ఆ నాటి నుంచి ప్రపంచ పర్యాటక కేంద్రంగా కొనసాగుతోంది.