చేతబడి చేస్తున్నాడంటూ.. బాబాయిని చంపిన కొడుకులు

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. చేతబడి చేస్తున్నారనే నెపంతో సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు పిల్లలు పుట్టి మరణించారు. తన బాబాయి వేల్పుల రత్తయ్య (55) చేతబడే దీనికి కారణమని సత్యనారాయణ భావించాడు. […]

Update: 2021-03-12 05:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక యుగంలో కూడా మూఢ నమ్మకాల పేరుతో అనేక దారుణాలు జరుగుతున్నాయి. చేతబడి చేస్తున్నారనే నెపంతో సొంత బంధువులే ఓ గిరిజనుడిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం అయ్యవారిపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వేల్పుల సత్యనారాయణకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు పిల్లలు పుట్టి మరణించారు. తన బాబాయి వేల్పుల రత్తయ్య (55) చేతబడే దీనికి కారణమని సత్యనారాయణ భావించాడు.

ఓ అమావాస్య రాత్రి గ్రామ శివారులో రత్తయ్య నగ్నంగా పూజలు చేస్తున్నట్టు గమనించానని.. పట్టుకునేందుకు వెళ్లేసరికి అతడు పారిపోయాడని సత్యనారాయణ తెలిపాడు. రత్తయ్య క్షుద్రపూజలు చేస్తున్నందు వల్లే తన పిల్లలు చనిపోతున్నారని సత్యనారాయణ భయపడ్డాడు. దీంతో రత్తయ్యను అంతమెుందించాలని ప్లాన్ వేశాడు. ఇందుకు తన అన్న ప్రసాద్‌ సాయంతో పథకం వేశాడు. ఈనెల 5న మధ్యాహ్నం రత్తయ్య కంచె వేసేందుకు ఇంటి సమీపంలోని జామాయిల్‌ తోటకు వెళ్లాడు.

అదే రోజు సత్యనారాయణ, ప్రసాద్‌లు మిర్చి బస్తాలు తొక్కేందుకు సమీప గ్రామానికి వెళ్లారు. కూలి పనుల అనంతరం వచ్చిన అన్నదమ్ములిద్దరూ చేనులో రత్తయ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించారు. రత్తయ్యపై కత్తితో దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని మరో ముగ్గురు సాయంతో గోదావరి నదిలో పాతిపెట్టి ఇంటికి వచ్చేశారు. తండ్రి ఇంటికి రాకపోవడంతో రత్తయ్య కుమారులు వెంకటేష్‌, సుధాకర్‌ చుట్టుపక్కల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. రత్తయ్య పని చేసిన పొలం వద్ద మృతదేహాన్ని నేలపై ఈడ్చుకు వెళ్లిన ఆనవాళ్లు, అక్కడికి కొద్ది దూరంలో పొదల మధ్య రక్తం ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.

విచారణ చేపట్టిన సీఐ గీతా రామకృష్ణ.. రత్తయ్యకు, సత్యనారాయణ, ప్రసాద్‌ కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకున్నారు. అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్ లో విచారించగా తామే చంపినట్టు అంగీకరించారు. హత్య చేసిన రాత్రే మరో ముగ్గురి సాయంతో రత్తయ్య మృతదేహాన్ని గోదావరి నదిలో పాతిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. గురువారం రత్తయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. తన తండ్రికి క్షుద్రపూజలు రావని, నిందితులు కావాలనే ఇలా చెబుతున్నారని రత్తయ్య కుమారులు ఆరోపించారు.

Tags:    

Similar News