సడలింపే సమస్య.. కొంప ముంచుతున్న నాలుగు గంటలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఆదివారం.. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసినా జనమే. సడలింపు ఉన్న నాలుగు గంటలు మొత్తంగా రోడ్డు ఎక్కేశారు. అసలు కరోనా పరిస్థితులు ఉన్నాయా.. అనే అనుమానం వచ్చే విధంగా గుమిగూడారు. ప్రతి రోజూ నాలుగు గంటల సడలింపు ఉన్నా బయటకు వచ్చేందుకు ఇక అవకాశమే లేదన్నట్టుగా చుట్టుముట్టారు. లాక్‌డౌన్ కారణంగా మొత్తంగా ఇంటిలోనే ఉంటున్నా ఈ సమయం పోతే మళ్లీ కష్టమన్నట్టుగా వ్యవహరించారు. సడలింపు ఇవ్వడం ప్రభుత్వం తప్పా..? లేకుంటే […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఆదివారం.. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసినా జనమే. సడలింపు ఉన్న నాలుగు గంటలు మొత్తంగా రోడ్డు ఎక్కేశారు. అసలు కరోనా పరిస్థితులు ఉన్నాయా.. అనే అనుమానం వచ్చే విధంగా గుమిగూడారు. ప్రతి రోజూ నాలుగు గంటల సడలింపు ఉన్నా బయటకు వచ్చేందుకు ఇక అవకాశమే లేదన్నట్టుగా చుట్టుముట్టారు. లాక్‌డౌన్ కారణంగా మొత్తంగా ఇంటిలోనే ఉంటున్నా ఈ సమయం పోతే మళ్లీ కష్టమన్నట్టుగా వ్యవహరించారు. సడలింపు ఇవ్వడం ప్రభుత్వం తప్పా..? లేకుంటే మనకెందుకు ఈ ఆంక్షలు అనే ధీమానా..? మొత్తానికైతే రాష్ట్రం మొత్తం రోడ్డెక్కింది.
ఎక్కడ చూసినా జనమే. కొంతమందికి మాస్క్‌లు లేవు. ఉన్నా ముక్కు కింది వరకు సగమే. ఒక్కరి చేతిలో కూడా శానిటైజర్కనిపించలేదు. ఇలా నిర్లక్ష్యాన్ని చేతుల్లో పట్టుకుని వైరస్‌ను ఇష్టపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లుగా తెగించారు. ఇక విద్యావంతులు, మేధావులు ఉండే పట్టణాల్లోనే ఈ పరిస్థితి. పల్లెల్లో మాత్రం కొంత నమయే. పల్లె జనం అంతా బయటకు రాలేదు. పట్టణాల్లోనే మరీ ఘోరం.
ఆ పరిస్థితి గుర్తు లేదా..?
లాక్‌డౌన్ రోజులు ఓసారి గుర్తు తెచ్చుకుందాం. పని లేక.. ఆదాయం రాక.. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పూట గడవడం కష్టమైంది. ఇప్పటికీ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత ఇబ్బంది పడ్డామో గుర్తులేదా!. వలస కూలీల అగచాట్లు. ఆస్పత్రికో ఇంకో అవసరానికో బయటకు వెళ్లాలంటే పోలీసుల లాఠీలను తప్పించుకోడానికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మర్చిపోయామా. ఆస్పత్రులు నిండిపోయాయి. బతుకుతామో లేదో అనే భయం.
కరోనా హెల్త్ బులెటిన్ వచ్చిందంటే గుబులు. చనిపోయిన వారిని కడసారి కూడా చూసుకోలేని దుస్థితి. విద్యా సంస్థలన్నీ బంద్ అయ్యాయి. ఆన్‌లైన్ క్లాసులు అర్థం కాక పిల్లలేమో ఆందోళనకు గురయ్యారు. అప్పుడంటే తెలియదు.. ఎటు నుంచి వచ్చి తగులుతుందో అంచనా లేదు. మొత్తానికైతో ఫస్ట్వేవ్నుంచి బయటపడ్డామని సంబురపడ్డాం. కానీ మన నిర్లక్ష్యంతోనే మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితులు వచ్చాయి. ఎంత మొత్తుకున్నా సామాజిక దూరం.. మూతికి మాస్క్‌లేకుండా తిరుగడంతో పాజిటివ్ కేసులు పెరిగాయి.
నిర్లక్ష్యమే ముంచింది..
అందరి జీవితాలపై లాక్‌డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దని దేశమంతా ముక్తకంఠంతో మొత్తుకుంది. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. వైరస్ బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలో అందరికీ తెలిసి వచ్చింది. కానీ నిర్లక్ష్యం మళ్లీ అందరినీ ముంచేసింది. ఏ నైట్ కర్ఫ్యూనైతో చూడొద్దనుకున్నామో గత నెల నుంచే అమల్లోకి వచ్చింది. మాస్కులు పెట్టుకోకుండా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా, శానిటైజర్లు వాడకుండా.. చేతులు కడుక్కోకుండా ఉంటూ నైట్‌కర్ఫ్యూను లాక్డౌన్వరకూ తెచ్చుకున్నాం. దీనంతటికీ జనం అంతులేని నిర్లక్ష్యమే కారణమని తేల్చారు.
‘ఊపిరి’ ప్రమాదం..
కరోనా ఫస్ట్ వేవ్‌లో కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకున్నాం.. లాక్‌డౌన్ ఎత్తేశారని హ్యాపీగా ఫీలయ్యాం. అబ్నార్మల్ పరిస్థితుల నుంచి న్యూ నార్మల్‌కి వచ్చేశామని కాస్త తేరుకున్నాం. లాక్‌డౌన్‌లో కష్టాలు అనుభవించిన వాళ్లంతా కోలుకుంటున్నామని, ఫస్ట్ వేవ్ నుంచి తేరుకొని అంతా ఓకే అనుకుంటున్న ఈ సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఊహించని దెబ్బకొట్టింది. ఫస్ట్ వేవ్‌ని మించి సెకండ్ వేవ్‌లో కేసులు నమోదవుతున్నాయ్. అప్పుడు వేలల్లో కేసులు రికార్డైతేనే నోరెళ్లబెట్టాం.
ఇప్పుడు లక్షలు దాటిపోతున్నాయ్. మరణాలు వందలకు చేరాయి. అనధికారికంగా వేలల్లో ఉంటున్నాయి. లాక్‌డౌన్ ఎత్తేసేముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య నిపుణులు క్లియర్‌గా చెప్పారు. లాక్ తీసేసినంత మాత్రాన వైరస్ తీవ్రత తగ్గిందని కాదు.. జాగ్రత్తలు పాటించకపోతే మళ్లీ మహమ్మారి విజృంభిస్తుందని అప్పుడే చెప్పారు. కానీ.. అంతా లైట్ తీసుకున్నారు. ఇంకా తీసుకుంటూనే ఉన్నారు.
సడలింపుతోనే సమస్య..
ఇప్పుడు లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో నాలుగు గంటల సడలింపు అతిపెద్ద సమస్యలను తెచ్చి పెడుతోంది. నిర్లక్ష్యం, అజాగ్రత్త.. వైరస్‌కు రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్‌కమ్ చెప్పుతున్నట్లు అవుతోంది. అందుకే వైరస్ అందరికి సోకుతోందంటున్నారు. లాక్‌డౌన్‌లో ఉదయం 6 నుంచి 10 గంటల సడలింపు సమయంలో గేట్లు తీసేసినట్లు రోడ్లమీద కొచ్చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోగా.. ఒక విధమైన ఓవరాక్షన్ చేస్తున్నట్లుగా ఉంది. వాస్తవంగా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. ప్రజల సహకారం లేకుంటే వ్యర్థమే. ఇప్పుడు అదే స్పష్టమవుతోంది.
ఆదివారం ఇక జీవితంలో రాదన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. మార్కెట్లల్లో ఇష్టారీతిన గుమిగూడారు. ఒకరికి ఒకరు తాకుతూనే కొనుగోళ్లు చేశారు. వాస్తవంగా ప్రతిరోజూ మార్కెట్లు, కిరాణా దుకాణాలు ఉంటున్నాయి. అయినా కారణాలేమీ తెలువదు.. కానీ రోజూ నాలుగు గంటలు జనమంతా రోడ్లపైనే ఉంటున్నారు. ఆదివారం నాటి పరిస్థితులు చూస్తే.. త్వరలోనే కరోనా పరీక్షల్లో ఎంతమందికి పాజిటివ్ వస్తుందేమోననే భయం వెంటాడుతోంది.
ఆదివారం సడలింపు సమయంలో బయటపడిన అంశాలు..
– మొత్తం మూతి, ముక్కు కవర్అయ్యేలా మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజ్ వినియోగం, చేతులు శుభ్రత వంటి కనీస జాగ్రత్తలు పాటించలేదు.
– వారాంతపు సంతలు, దుకాణాలు, పని ప్రదేశాల్లో సామాజిక దూరం లేదు.
– ఆదివారం పార్టీలు యథావిధిగానే కొనసాగించారు.
– విందులు, వినోదాలకు దిగారు.
– కనీస జాగ్రత్తలు పాటించ లేదు.
– ప్రమాదకరమని తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు.