విద్యా, వైద్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరేనా!
దిశ, ఏపీబ్యూరో : కొవిడ్రాకతో మన విద్యా, వైద్యరంగాల తీరు ప్రతి ఒక్కరికీ అవగతమైంది. ఇప్పటిదాకా రాష్ర్టంలోని ఉన్నత శ్రేణి ప్రజలకు ప్రపంచంలోని అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం కావాలనే ఆకాంక్షలు నెరవేరాయి. గత ప్రభుత్వాల హయాంలోనే ఈ రెండు రంగాలను మార్కెట్‌శక్తులకు అప్పగించి కొనుగోలు సరకుగా మార్చేశారు. నేడవి సగటు పౌరుడి ఆదాయంలో సగం మింగేస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆలోచించింది కేవలం అపరిమిత కొనుగోలు శక్తి కలిగిన వాళ్ల అభిరుచుల గురించే. ఎన్నికల మందు […]
దిశ, ఏపీబ్యూరో : కొవిడ్రాకతో మన విద్యా, వైద్యరంగాల తీరు ప్రతి ఒక్కరికీ అవగతమైంది. ఇప్పటిదాకా రాష్ర్టంలోని ఉన్నత శ్రేణి ప్రజలకు ప్రపంచంలోని అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం కావాలనే ఆకాంక్షలు నెరవేరాయి. గత ప్రభుత్వాల హయాంలోనే ఈ రెండు రంగాలను మార్కెట్‌శక్తులకు అప్పగించి కొనుగోలు సరకుగా మార్చేశారు. నేడవి సగటు పౌరుడి ఆదాయంలో సగం మింగేస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆలోచించింది కేవలం అపరిమిత కొనుగోలు శక్తి కలిగిన వాళ్ల అభిరుచుల గురించే. ఎన్నికల మందు వైఎస్ జగన్‌ప్రజా సంకల్ప యాత్రలో చెప్పిందేమంటే.. పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకూ కార్పొరేట్‌స్థాయి విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తామన్నారు. ఆ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంటు, అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నారు. ప్రజలందరికీ ప్రభుత్వ రంగంలో ఒకే నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్య, వైద్య సదుపాయాలను ఉచితంగా కల్పించాలనేది సగటు ప్రజల ఆకాంక్ష.
విద్యా రంగానికి సంబంధించి ప్రభుత్వం నాడు – నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. 45 వేల పాఠశాలలు, 471 జూనియర్కళాశాలలు, 151 డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్ల రూపురేఖలు మార్చాలని భావించింది. అందులో భాగంగా మొదటి దశలో 15,717 స్కూళ్లలో రూ.3,948 కోట్లతో మరమ్మతులు చేయడంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు వెచ్చించారు. ఇంకా అమ్మ ఒడికి రూ.13 వేల కోట్లు, వసతి దీవెనకు రూ.2,270 కోట్లు, విద్యా దీవెనకు రూ.4,879 కోట్లు, గోరు ముద్దకు రూ.1,600 కోట్లు, విద్యా కానుకకు రూ. 648 కోట్లు ఖర్చు పెట్టారు.
వైద్య రంగంలో నాడు –నేడు కింద రూ.15,337 కోట్లతో మూడేళ్లలో ఆస్పత్రులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ కింద రూ.1,129 కోట్లతో 7,458 ఆరోగ్య ఉప కేంద్రాల్లో 4,906 శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. మిగతా 2,552 కేంద్రాలను మరమ్మతులు చేయాలని భావించారు. ప్రస్తుతం మొదటి దశ పనులు కొనసాగుతున్నాయి. రెండో దశ కింద 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, 169 కమ్యూనిటీ హెల్త్సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం రూ.1,212 కోట్లు వెచ్చించనున్నారు. అందులో రూ.700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. మూడో దశలో జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రులను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఉన్న 11 బోధనాస్పత్రులకు తోడు ప్రతీ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓ టీచింగ్‌ఆస్పత్రి ఏర్పాటునకు అడుగులు పడ్డాయి. ఇటీవలనే సీఎం 16 మెడికల్కళాశాలలకు అనుబంధంగా బోధనాస్పత్రులు, నర్సింగ్కళాశాలలను రూ.8 వేల కోట్లతో నిర్మించనున్నట్లు ప్రకటించారు.
నేడు రాష్ర్టంలో విద్య, వైద్యం ప్రజలకు అందుతున్నది 70 శాతం ప్రైవేటు రంగంలోనే. ప్రభుత్వ విద్యా సంస్థలు, ఆస్పత్రులు సేవలందిస్తోంది కేవలం 30 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం అందరికీ సమానంగా తారతమ్య బేధం లేకుండా ఉచితంగా అందించాలని సగటు పౌరులు కోరుకుంటున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో కార్పొరేట్విద్య, వైద్య రంగాలను పెంచి పోషించడానిక్కాదు. ఇప్పటిదాకా ప్రభుత్వ కేటాయింపులు, వ్యయాన్ని పరిశీలిస్తే.. ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థల అభివృద్ధికి వెచ్చించిన దానికన్నా ప్రైవేటు రంగానికే సింహభాగం నిధులు వెళ్లాయి. అమ్మ ఒడిలాంటి ఇతర పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ నుంచే ఎక్కువగా ప్రైవేటు రంగానికి చేరాయి. ప్రభుత్వ రంగంలో ఈ రెండు సేవలను ప్రజలకు నూరు శాతం మెరుగైన సేవలందించే దిశగా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే సొమ్ము ఉపయోగపడాలి. అప్పుడే కోవిడ్‌లాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వంపై ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులంటే ఏంటో తెలిసొచ్చింది. రానున్న మూడేళ్లలో కార్పొరేట్ఆస్పత్రులు, విద్యాసంస్థలు లేని రాష్ర్టంగా సీఎం వైఎస్జగన్ప్రకటిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.