మద్యం మత్తులో నగర యువత.. గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడిపి రోడ్డుపై వెళ్తున్న అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలే ఇందుకు సాక్ష్యంగా కనబడుతున్నాయి. నాలుగు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన యాక్సిడెంట్ల కారణంగా పలువురి ప్రాణాలను బలితీసుకున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. మద్యం మత్తులో వేగంగా వాహనాలు నడిపి రోడ్డుపై వెళ్తున్న అమాయక ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. ఈ నెల 6వ తేదీన నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలే ఇందుకు సాక్ష్యంగా కనబడుతున్నాయి. నాలుగు వేర్వేరు ప్రాంతాలలో జరిగిన యాక్సిడెంట్ల కారణంగా పలువురి ప్రాణాలను బలితీసుకున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ కొంత మేర తగ్గించగా ఇటీవల చోటు చేసుకుంటున్న ప్రమాదాలతో తిరిగి రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు ముమ్మరం చేశారు . ఇందులో భాగంగా సోమవారం రాత్రి సమయంలో జంట నగరాల్లో 125 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి సుమారు 300 మందికి పైగా కేసులు నమోదు కావడంతో, తాగుబోతులు ఎలా వాహనాలు నడుపుతున్నారనడానికి అద్దం పడుతోంది.
ఇవిగో గణాంకాలు…
మద్యం సేవించి వాహనాలు నడపడంతో గత ఏడాది ఒక్క హైదరాబాద్‌లోనే 190 మంది వరకు మృతి చెందారు. సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా సుమారు సంవత్సరం కాలంలో 232మంది మరణించారు. తాగి వాహనాలు నడిపిన వారిపై సైబరాబాద్‌లో సుమారు 33 వేల కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా సైబరాబాద్‌లో ఈ ఒక్క ఏడాదే 200 లకుపైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
వీఐపీ జోన్లలోనే అధికం…
మద్యం మత్తులో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వీఐపీ జోన్‌లోనే జరుగుతుండటం గమనార్హం. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓఆర్‌ఆర్‌లపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. నగర శివార్లతో పాటు సిటీ సెంటర్‌లోనూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. తాగిన వ్యక్తులు డ్రైవర్ లేకుండా వాహనాలు నడపరాదని పోలీస్ శాఖ ఆదేశాలు ఉన్నప్పటికీ మందుబాబులు బేఖాతరు చేస్తున్నారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వాహనాలు నడుపుతూ ఎన్నో కుటుంబాలలో విషాదం నింపుతున్నారు .
ఒకే రోజు ….
హైదరాబాద్ లో పీకల దాక మద్యం సేవించిన ఒక వ్యక్తి వాహనం నడిపి దంపతుల ప్రాణాలు తీశాడు. మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేస్తోన్న వ్యక్తి నార్సింగి లో బైక్ పై వెలుతున్న దంపతులను ఢీకొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రోజు బంజారాహిల్స్ లో అర్ధరాత్రి సమయంలో రోడ్డు దాటుతున్న ఇద్దరిని వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో వారి ప్రాణాలు అక్కడికక్కడే గాల్లో కలిసి పోయాయి. మరో సంఘటనలో మాదాపూర్ పీఎస్ పరిధిలో మద్యం సేవించిన ఇద్దరు యువ వైద్యులు గచ్చిబౌలి వైపు వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న పాదచారుల పైకి దూసుకువెళ్లారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. ఒకే రోజు ఇలా నగరంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మందుబాబుల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
విదేశాల నుండి వచ్చి…
హైదరాబాద్‌కు చెందిన ఆశ్రిత అనే యువతి కెనడాలో బీటెక్ చదువుతోంది. గత ఏడాది నగరానికి వచ్చిన ఆమె తన స్నేహితులైన అభిషేక్, సత్య ప్రకాష్, తరుణిలతో కలిసి అర్ధరాత్రి వరకు పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ బ్యాచ్‌లోని ముగ్గురు అబ్బాయిలు మద్యం సేవించారు. ఇంటికెళ్లే క్రమంలో అభిషేక్ డ్రైవింగ్ చేస్తుండగా మద్యం మత్తు పైగా అతివేగంతో కారు నడపడం వల్ల గచ్చిబౌలి బ్రిడ్జి వద్దకు రాగానే కారుఅదుపుతప్పి మూడు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆశ్రిత అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో నగరంలో తరుచుగా సంభవిస్తున్నాయి.