రాజీనామా చేయండి.. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.. ఎమ్మెల్యేకు ప్రజలు ఓపెన్ ఆఫర్
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న పథకాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పథకం ప్రయోజనాల సంగతి పక్కనపెడితే.. ఎమ్మెల్యేలు మాత్రం రోజుకో సమస్యతో ఇరకాటంలో పడిపోతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడించేందుకు మాత్రమే దళిత బంధు పథకాన్ని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న పథకాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పథకం ప్రయోజనాల సంగతి పక్కనపెడితే.. ఎమ్మెల్యేలు మాత్రం రోజుకో సమస్యతో ఇరకాటంలో పడిపోతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘దళిత బంధు’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకం ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం సృష్టించింది. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడించేందుకు మాత్రమే దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నారనే రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
సీఎం కేసీఆర్ సైతం ఒకానొకదశలో రాజకీయాల కోసమే పథకాలు ప్రవేశపెడుతున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ పథకం వల్ల టీఆర్‌ఎస్ గెలవడం సంగతేమో గానీ.. ఓ నియోజకవర్గంలో ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వాట్సప్ మెసెజ్ నల్లగొండ జిల్లాలో వైరల్‌గా మారింది.
ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి..
సీఎం కేసీఆర్ ఏ నియోజకవర్గంలో ఉపఎన్నిక వచ్చినా.. వరాల జల్లులు కురిపిస్తున్నారు. హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో ఇదే తరహాలో అక్కడి ప్రజలకు వరాలు ప్రకటించారు. దాని అమలు సంగతి ఎలా ఉన్నా.. నియోజకవర్గం అభివృద్ది చెందుతుందనేది ఆయా నియోజకవర్గాల ప్రజల ఆశ. తాజాగా హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ దళిత సాధికారత కోసం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఆ పథకంలో భాగంగా కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని, ఆ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేందుకు అన్ని అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉపఎన్నిక వస్తేనే.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే భావన ప్రజల్లోకి నెలకొంది. మా నియోజకవర్గం అభివృద్ది జరగాలంటే.. మా ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లాలని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు, రాజకీయవర్గాలు కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభిప్రాయపడుతుండడం గమనార్హం.
ఆ మెసెజ్‌లో ఏముందంటే..?
‘కోదాడ నియోజకవర్గంలోని దళితుల పక్షాన.. మా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ గారికి మా విన్నపం. రేపు జరగబోయే హుజురాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తీసుకొచ్చిన దళిత సాధికారత పథకం వల్ల కుటుంబానికి రూ.10 లక్షలతో హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత కుటుంబాలు బాగుపడతాయి. అదేవిధంగా మన దగ్గర మీరు మా మీద ఉన్న ప్రేమతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే మాకు దళిత సాధికారత పథకం వచ్చి మా జీవితాలు బాగుపడతాయి. దానికి మేము మళ్లీ మా ఎమ్మెల్యేగా మిమ్ములనే గతంలో కంటే అధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. దయచేసి మా కోరిక మన్నించి రాజీనామా చేయండి ప్లీజ్’ అంటూ కోదాడ నియోజకవర్గంలోని వాట్సప్ గ్రూపుల్లో మెసెజ్‌లు వెల్లువెత్తాయి. ఇదీకాస్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.