దారులన్నీ పెద్దగట్టు వైపే.. ఇసుకేస్తే రాలనంత భక్తజనం
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదవుల ఆరాధ్య దైవం.. తరతరాల ఆచారం.. మహిమాన్వితులకు ప్రతిరూపం.. గొల్లగట్టు(పెద్దగట్టు) జాతర. యాదవులు కుల దైవంగా ప్రసిద్ధి గాంచిన పెద్దగట్టు లింగమంతుల జాతర, ఇది మేడారం తర్వాత వచ్చే తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందినది. ఈ పెద్దగట్టు జాతరకు భక్తజనం పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దారులన్నీ పెద్దగట్టు వైపునకే మళ్లాయి. పుట్ట నుంచి చీమలు బారుదీరినట్టు భక్తకోటి జనమంతా దురాజ్‌పల్లి గుట్టకు బారులుదీరారు. చేతిలో కత్తులు, కటార్లు, గొర్రెపోతులతో ఓ […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: యాదవుల ఆరాధ్య దైవం.. తరతరాల ఆచారం.. మహిమాన్వితులకు ప్రతిరూపం.. గొల్లగట్టు(పెద్దగట్టు) జాతర. యాదవులు కుల దైవంగా ప్రసిద్ధి గాంచిన పెద్దగట్టు లింగమంతుల జాతర, ఇది మేడారం తర్వాత వచ్చే తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరగా పేరొందినది. ఈ పెద్దగట్టు జాతరకు భక్తజనం పోటెత్తుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి దారులన్నీ పెద్దగట్టు వైపునకే మళ్లాయి. పుట్ట నుంచి చీమలు బారుదీరినట్టు భక్తకోటి జనమంతా దురాజ్‌పల్లి గుట్టకు బారులుదీరారు. చేతిలో కత్తులు, కటార్లు, గొర్రెపోతులతో ఓ లింగ నామస్మరణతో అడుగులో అడుగులేస్తూ లయబద్ధంగా సాగుతుంటే.. ఆ దృశ్యాలు ఎంతో కనువిందు చేస్తున్నాయి. పున్నమి వెన్నెలలో యాదవుల విన్యాసాలు, గంపలు, నిండుకుండ బోనాలతో లింగమంతుల స్వామి చుట్టూ చేసే ప్రదక్షిణలు సరికొత్త భక్తి తన్మయత్వాన్ని కలిగిస్తోంది.
పెద్దగట్టు జాతరకు చేరుకోవడం ఇలా..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని దురాజ్‌పల్లి గుట్ట వద్ద లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఈ దురాజ్‌పల్లి గుట్ట హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు సొంత వాహనాల్లో వెళ్లాల్సి ఉంటుంది. సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రత్యేకంగా బస్సులను సైతం నడిపిస్తోంది. హైదరాబాద్, ఖమ్మం, జనగామ, వరంగల్, నల్లగొండ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా మొదటగా సూర్యాపేట ఆర్టీసి బస్టాండ్‌కు చేరుకుంటారు. కొన్ని బస్సులు నేరుగా దురాజ్‌పల్లి గుట్ట వరకు వెళ్తాయి. విజయవాడ, కోదాడ, మిర్యాలగూడ, హుజూర్‌నగర్ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆర్టీసీ బస్సు ఎక్కితే.. గుట్ట వద్దే దిగొచ్చు. అలా కాకుండా ప్రైవేటు వాహనాల్లో వచ్చేవారు.. నేరుగా జాతర వద్దకు చేరుకుంటారు. కానీ వాహనాలు గుట్టకు కిలోమీటరుకు పైగా దూరంలో ఆగి నడుచుకుంటూ గుట్టపైకి వెళ్లాలి.
జాతర నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలివే..
పెద్దగట్టు జాతర నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన వాహనాలను నార్కట్‌పల్లి వద్ద డైవర్ట్ చేశారు. నార్కట్‌పల్లి నుంచి వయా నల్లగొండ బైపాస్ రోడ్డు, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా మళ్లించారు. కోదాడలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి టచ్ అవుతారు. అక్కడి నుంచి విజయవాడకు చేరుకుంటారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారు సైతం కోదాడ వద్ద డైవర్ట్ అవ్వాల్సి ఉంటుంది. తిరిగి నార్కట్‌పల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ హైవే ఎక్కుతారు.