ఐపీఎల్‌కు పాకిస్తాన్ అడ్డం
దిశ, స్పోర్ట్స్: దాయాది దేశం పాకిస్తాన్‌కు రాజకీయ పరమైన గొడవలే కాకుండా క్రీడా పరమైన వైరం కూడా నడుస్తోంది. అయితే, ఈ క్రీడా వైరం కేవలం క్రికెట్‌కే పరిమితం కావడం గమనార్హం. కార్గిల్ యుద్ధం తర్వాత నుంచి పాకిస్తాన్‌తో వివాదం నడుస్తూనే ఉంది. పాకిస్తాన్‌తో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో పాక్ బోర్డు ఆర్థికంగా నష్టపోయింది. ఈ విషయంపై తమకు బీసీసీఐ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరినా ఫలితం దక్కలేదు. […]
దిశ, స్పోర్ట్స్: దాయాది దేశం పాకిస్తాన్‌కు రాజకీయ పరమైన గొడవలే కాకుండా క్రీడా పరమైన వైరం కూడా నడుస్తోంది. అయితే, ఈ క్రీడా వైరం కేవలం క్రికెట్‌కే పరిమితం కావడం గమనార్హం. కార్గిల్ యుద్ధం తర్వాత నుంచి పాకిస్తాన్‌తో వివాదం నడుస్తూనే ఉంది. పాకిస్తాన్‌తో భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడంతో పాక్ బోర్డు ఆర్థికంగా నష్టపోయింది. ఈ విషయంపై తమకు బీసీసీఐ నుంచి నష్టపరిహారం ఇప్పించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరినా ఫలితం దక్కలేదు. ఇక అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా బీసీసీఐని పీసీబీ ఇరుకున పెట్టాలని చూస్తోంది. తాజాగా, దాని కన్ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై పడింది. ఈ లీగ్‌ను ఎలాగైన అడ్డుకోవాలని యత్నిస్తోంది.
ఐపీఎల్ జరగనివ్వం
టీ-20 వరల్డ్ కప్ నిర్వహణపై క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేయడంతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. బీసీసీఐ కూడా సెప్టెంబర్ 26 నుంచి ఐపీఎల్ నిర్వహిస్తామని ప్రాథమికంగా నిర్ధారించింది. అయితే, అదే సమయంలో జరగాల్సిన ఆసియా కప్ టీ20 గురించి మాత్రం బీసీసీఐ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటికే ఏసీసీ ఈ విషయంపై సమావేశం జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా, ఐపీఎల్ తేదీలు ప్రకటించడంతో పీసీసీ మండిపడుతోంది. కరోనా కారణంగా ఆసియా కప్ వాయిదా పడితే మాకు అభ్యంతరం లేదు. కానీ, ఐపీఎల్ వంటి దేశవాళీ లీగ్ కోసం ఆసియా కప్‌ను ఫణంగా పెట్టబోమని అంటోంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను తప్పకుండా నిర్వహించి తీరుతామని పాక్ క్రికెట్ బోర్డు తేల్చి చెబుతోంది. ఆసియా కప్ నిర్వహణ తేదీలపై వెంటనే చర్చించాలని కోరుతూ ఏసీసీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేఖ రాసినట్లు సమాచారం. ‘ఒక దేశవాళీ లీగ్ కోసం ఆసియా కప్ ఎలా వాయిదా వేస్తాం. గత సమావేశంలోనే సభ్యదేశాలన్నీ ఆసియా కప్ నిర్వహణకు కట్టుబడి ఉన్నట్టు తెలిపాయి. ఇది పీసీబీకే కాకుండా సభ్య దేశాలకూ ఆర్థికంగా ఊతమిచ్చే టోర్నీ. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయం’ అని పీసీబీ అధికారి ఒకరు తెలిపారు.
ఆదాయం కోల్పోతామనే..
కరోనా నేపథ్యంలో పలు దేశాల క్రికెట్ బోర్డులు భారీగా ఆదాయాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా పాకిస్తాన్ బోర్డు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఆసియా కప్‌ను నిర్వహించడం ద్వారా సభ్య దేశాలకు బ్రాడ్‌కాస్ట్ హక్కులు, స్పాన్సర్ల ద్వారా లభించే ఆదాయాన్ని సమంగా పంచుతారు. అదే సమయంలో ఆతిథ్యమిచ్చే దేశంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అదనంగా టికెట్ ఆదాయం, హక్కుల ఆదాయంలో కాస్త ఎక్కువ మొత్తం లభిస్తుంది. ఆసియా కప్ ద్వారా ఖజానాకు కాస్తైనా నిధులు వచ్చి చేరతాయని పీసీబీ భావిస్తోంది. 2016 నుంచి 2023 వరకు ఆసియా కప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకుంది. ఇందుకు గానూ రూ.75 కోట్లను ఇస్తోంది. ఇప్పుడు ఆసియా కప్ రద్దయితే ఆ మేరకు స్టార్ స్పోర్ట్స్ కోత విధిస్తుంది.
దీంతో సభ్య దేశాలకూ ఆదాయం ఉండదు. ఇదే విషయాన్ని పాకిస్తాన్ ఇతర క్రికెట్ బోర్డులకు చెప్పి రెచ్చగొడుతోంది. బీసీసీఐకి అయితే ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం వస్తుంది. కానీ ఆసియా కప్ జరగకపోతే నష్టపోయేది మనమే కాబట్టి దీనిపై వెనక్కు తగ్గకూడదని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ అవసరమైతే ఆసియా కప్‌ను శ్రీలంకలో అయినా నిర్వహించుకోవడానికి ఓకే చెబుతోంది. అయితే, దీనిపై బీసీసీఐ ఇంకా స్పందించలేదు.