ఆ ఓటమి తర్వాతే మా మైండ్‌సెట్ మారింది : రోహిత్ శర్మ

రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా బ్యాక్ టూ బ్యాక్ ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

Update: 2025-03-29 14:21 GMT
ఆ ఓటమి తర్వాతే మా మైండ్‌సెట్ మారింది : రోహిత్ శర్మ
  • whatsapp icon

దిశ, స్పోర్ట్స్ : రోహిత్ శర్మ నాయకత్వంలో టీమ్ ఇండియా బ్యాక్ టూ బ్యాక్ ఐసీసీ టోర్నీలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది టీ20 వరల్డ్ కప్, ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. ఈ రెండు టైటిల్స్‌ను అజేయంగా గెలవడం మరో విశేషం. గత మూడు ఐసీసీ టోర్నీల్లో 24 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడింది. ఐసీసీ టోర్నీల్లో టీమిండియా సంచలన ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ముంబై ఇండియన్స్ నిర్వహించిన ‘చర్చ విత్ రోహిత్ శర్మ’ కార్యక్రమంలో రోహిత్ మాట్లాడాడు.

2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌లో ఓటమి తర్వాత తమ మైండ్‌సెట్ మారిందని చెప్పాడు. ‘ఇదంతా ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 వరల్డ్ కప్‌లో మొదలైంది. అప్పుడు మేము ఫైనల్‌కు చేరుకోలేకపోయాం. సెమీస్‌లో ఓడాం. ఆ ఓటమి తర్వాత మా మైండ్‌సెట్ మారింది. ఆటగాళ్లకు మేము ఏం ఆశిస్తున్నామో స్పష్టతనిచ్చాం. ఎలా ఆడాలో చెప్పాం. స్వేచ్ఛగా, భయం లేకుండా ఆడాలని చెప్పాం. మా ప్లాన్స్‌ను అమలు చేసే క్రమంలో కొన్ని సిరీస్‌లను కోల్పోయాం. కానీ, మేము భయపడలేదు. మా ఆలోచనలకు కట్టుబడి ఉన్నాం.’ అని తెలిపాడు.

ఈ క్రమంలోనే జట్టును నిర్మించడం సవాల్‌తో కూడుకున్నదని చెప్పాడు. జట్టుకు ఏం అవసరమో, గత సిరీస్, టోర్నీల్లో ఏం కోల్పోయమో తెలుసుకోవడం మొదటి దశ అని, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిలకడగా కృషి చేశామని తెలిపాడు. ‘గత మూడు ఐసీసీ టోర్నీల్లో భారత్ సాధించినది చూస్తే అద్భుతమే అని చెప్పాలి. ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఓడాం. అది కూడా ఫైనల్. వన్డే వరల్డ్ కప్ కూడా గెలిచి ఉంటే ఎలా ఉండేదో ఓసారి ఊహించుకోండి. 24 మ్యాచ్‌ల్లో 23 గెలవడం కనీవిని ఎరగనిది. భారత్ ప్రయాణం బయటకు చూడటానికి ఆకట్టుకునేలా ఉంది. కానీ, మేము చాలా ఎత్తుపల్లాలను చూశాం. కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. అలాంటప్పుడు ఇలాంటి విజయాలు సాధించినప్పుడు సంబరాలు చేసుకునేందుకు మేము అర్హులమే.’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News