వైసీపీతో కలిసి నడుస్తాం.. పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ మరో పోరాటానికి సన్నద్ధమైంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతుగా విశాఖలో బహిరంగ సభ.. ఇటీవలే అమరావతిలో ఒక్కరోజు దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా డిజిటల్ క్యాంపైన్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ […]

Update: 2021-12-17 09:30 GMT

దిశ, ఏపీ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ మరో పోరాటానికి సన్నద్ధమైంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి మద్దతుగా విశాఖలో బహిరంగ సభ.. ఇటీవలే అమరావతిలో ఒక్కరోజు దీక్ష చేపట్టిన జనసేనాని పవన్ కల్యాణ్ తాజాగా డిజిటల్ క్యాంపైన్‌కు పిలుపునిచ్చారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే విషయాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్ళినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు.

వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు ఉండి కూడా ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం చేయకుండా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ధోరణిలో ఉందని పవన్ కల్యాణ్ ఓ వీడియోలో వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుున్న వైసీపీకి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పాలనే బాధ్యతను గుర్తు చేయాలన్న లక్ష్యంతో డిజిటల్ క్యాంపెయిన్ చేపడదామని పిలుపునిచ్చారు.

‘వైసీపీతోపాటు టీడీపీ ఎంపీలు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ గురించి మాట్లాడాలి… ప్లకార్డులు ప్రదర్శించాలి. ఈ బాధ్యతను వారికి తెలియచేసేలా మన రాష్ట్రానికి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులను ట్యాగ్ చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడంతోపాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విషయాన్ని పార్లమెంట్‌కు తెలియచేయమని గౌరవ ఎంపీలను సోషల్ మీడియా ద్వారా కోరదాం. ఈనెల 18 ఉదయం 10 గంటలకు మన రాష్ట్ర ఎంపీలకు ట్యాగ్ చేసే డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాం. మీ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడికి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యులకు ట్యాగ్ చేయండి . ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశ్యం ఎంతో మంది బలిదానాలు, త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకోవడం. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గళం విప్పకుండా కేంద్రానిదే బాధ్యత అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారికి బాధ్యత గుర్తు చేద్దాం.

‘ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ‘ అనే నినాదం ప్రతి ఆంధ్రుడినీ కదిలించింది. జై తెలంగాణ అనగానే తెలంగాణ మొత్తం ఎలా మారుమోగుతుందో అలాంటిదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదం కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల ఎంపీలు కలసి రావాల్సిన సమయం ఇది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఈ రోజు వరకు అలా ఏ రాజకీయ పార్టీ కలసి రాలేదు. రాజకీయ క్షేత్రంలో పార్టీల మధ్య విబేధాలు ఉన్నా ప్రతి పార్టీ అంతిమ లక్ష్యం ప్రజా సేవే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం’ అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

అఖిలపక్షం ఏర్పాటు చేయండి

పార్లమెంటు సమావేశాల్లో మన ఎంపీలకు వారి బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం జనసేనకు ఉంది అనిపించింది. వైసీపీ, టీడీపీ ఎంపీలకు జనసేన పార్టీ నుంచి ఇదే మా విన్నపం. మీరు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన బాధ్యతను స్వీకరించి వైసీపీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఇంతకు ముందు కూడా కోరాం. వారు స్పందించలేదు. వైసీపీ నాయకత్వానికి మా మరో విన్నపం. మీరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. మీతో కలసి నడవడానికి మేము సంసిద్ధతతో ఉన్నాం. అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. మన రాష్ట్ర సమస్యలు, కష్టాలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లకపోతే తప్పు చేసిన వాళ్లమవుతాం. జనసేన పక్షాన మా వంతు బాధ్యతగా మేము విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటీకరించవద్దు అనే నినాదాన్ని ఇస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తాం.

కార్మికులు, కార్మికుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. స్టీల్ ప్లాంట్ కోసం చేసిన త్యాగాలు, బలిదానాలు మేము మర్చిపోము. తెలంగాణ జిల్లాలకు చెందిన వారూ విశాఖ ఉక్కు సాధనకు ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదే బాధ్యతను గుర్తు చేస్తూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని కోరుతున్నాం. మీరు మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి. వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలకు మీ బాధ్యతను గుర్తు చేస్తున్నాం. వైసీపీ ఎంపీలు ముందుండి పార్లమెంటులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుకోవాలి. ఎన్నో త్యాగాలతో వచ్చిన పరిశ్రమ కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ వ్యవహారంలో పునరాలోచన చేయాలన్న విషయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.

ఆ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ.. డిజిటల్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మీ ఎంపీలకు మీ పోస్టులు ట్యాగ్ చేయండి. పార్లమెంటులో ప్లకార్డులు ప్రదర్శించమని వైసీపీ ఎంపీలకు తెలియచెప్పాలి. వారికి బాధ్యతను గుర్తు చేయాలి అని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

Tags:    

Similar News