90 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని దెబ్బతీస్తున్న కరోనా దేశవ్యాప్తంగా ఒకే రీతిలో విస్తరించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కేసులు నమోదవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఊసే లేదు. ఇది వరకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనే కొత్త కేసులూ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వలస కార్మికుల ప్రయాణాలు, లాక్‌డౌన్ నుంచి పలు సేవల మినహాయింపులతో కొన్ని కొత్త ప్రాంతాల్లోనూ స్వల్ప సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఇప్పటి […]

Update: 2020-05-14 05:52 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని దెబ్బతీస్తున్న కరోనా దేశవ్యాప్తంగా ఒకే రీతిలో విస్తరించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో భారీ మొత్తంలో కేసులు నమోదవుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ఊసే లేదు. ఇది వరకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లోనే కొత్త కేసులూ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వలస కార్మికుల ప్రయాణాలు, లాక్‌డౌన్ నుంచి పలు సేవల మినహాయింపులతో కొన్ని కొత్త ప్రాంతాల్లోనూ స్వల్ప సంఖ్యలో కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులను పరిశీలిస్తే.. అవి అత్యధికంగా కొన్ని రాష్ట్రాల నుంచే రిపోర్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. కేవలం 10 రాష్ట్రాల్లోనే దేశంలోని 90 శాతం కేసులుండటమే ఇందుకు నిదర్శనం. ఒక్క మహారాష్ట్రలోనే దేశంలోని మొత్తం కేసుల్లో సుమారు 33శాతం(దాదాపు 26వేల కేసులు) అంటే మూడింట ఒక వంతు కేసులున్నాయి. టాప్ ఫోర్ రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలలో 52వేలకుపైగా కేసులుండటం గమనార్హం. మహారాష్ట్ర(25,922), గుజరాత్(9,268), తమిళనాడు(9,227), ఢిల్లీ(7,998), రాజస్తాన్(4,222), మధ్యప్రదేశ్(4,173), ఉత్తరప్రదేశ్(3,778), పశ్చిమ బెంగాల్(2,290), ఆంధ్రప్రదేశ్(2,137), పంజాబ్‌(1,924)లలో మొత్తం సుమారుగా 71వేల కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 78వేలను దాటాయి. అంటే, దేశంలోని 90శాతం కేసులు కేవలం పై పది రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలుస్తున్నది.

కరోనా లేని రాష్ట్రాలు:

ఇప్పటికీ కరోనా చేరని రాష్ట్రాలున్నాయి. సిక్కిం, నాగాల్యాండ్ రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతం లక్షదీవుల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కాగా, కరోనా కేసులు వెలుగుచూసినా.. పూర్తిగా నయమైన రాష్ట్రాలూ ఉన్నాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా అడుగేసినా.. తిరిగి వెనక్కి తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక కేసు, మణిపూర్‌లో రెండు కేసులు, మిజోరంలో ఒక కేసు, గోవాలో ఏడు కేసులు, కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబర్ దీవుల్లో 33 కేసుల చొప్పున నమోదైనా.. నయమయ్యాయి. అంటే మొత్తంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కరోనా యాక్టివ్ కేసు కూడా లేదు. కాగా, అస్సాం(80), ఛత్తీస్‌గడ్(59), హిమాచల్ ప్రదేశ్(66), జార్ఖండ్(173), మేఘాలయ(13 కేసులున్నా.. 10మంది డిశ్చార్జ్ అయ్యారు), త్రిపుర(155), ఉత్తరాఖండ్(72)లలో 200లోపే కరోనా కేసులు నమోదయ్యాయి.

పెరిగిన వైనం ఇలా..

తొలి కేసులు కేరళలో నమోదైనా.. లాక్‌డౌన్ ముందు వరకు ఈ రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోనూ అధిక కేసులు వెలుగుచూశాయి. కాగా, విదేశీ పర్యాటకులు, దేశీయంగాను ప్రయాణాల వల్ల ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఢిల్లీలోని తబ్లిఘీ జమాత్ సదస్సు ఘటన తర్వాత ఇతర రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. ఈ సదస్సు తర్వాత.. ఢిల్లీ, తమిళనాడులో విపరీతంగా కేసులు వెలుగుచూశాయి. అనంతరం, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోనూ కేసులు పెరుగుతూ వచ్చాయి. గతనెల మూడో వారం నుంచి మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులు అధిక కేసులతో టాప్ రాష్ట్రాలుగా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలో చిక్కుకున్న యాత్రికులు తిరిగి రావడంతో పంజాబ్‌లో ఈ నెల మొదట్లో కేసులు ఎకాఎకిన పెరిగాయి. ఒడిశాలో వలస కార్మికుల కారణంగా కేసుల్లో పెరుగుదల కనిపించింది. కాగా, కేరళ విజయవంతంగా కేసులను కట్టడి చేస్తున్నది.

Tags:    

Similar News