రేవంత్ భారీ వ్యూహం.. ఇక సర్కారుకు దినదిన గండమేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర సర్కారులపై సమరానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. రైతాంగ సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని సమిష్టి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా కొన్ని డిమాండ్లతో కూడిన ఛార్టర్‌ను రూపొందించారు. ఈ నెల 22న నగరంలోని […]

Update: 2021-09-19 06:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర సర్కారులపై సమరానికి సిద్ధమవుతున్నాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. రైతాంగ సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారీ స్థాయిలో నిరసనలు, ధర్నాలు చేపట్టాలని సమిష్టి నిర్ణయం జరిగింది. అందులో భాగంగా కొన్ని డిమాండ్లతో కూడిన ఛార్టర్‌ను రూపొందించారు.

ఈ నెల 22న నగరంలోని ఇందిరాపార్కు దగ్గర మహా ధర్నా నిర్వహించాలని, 27న రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్‌లో పాల్గొనాలని, 30వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించి వినతిపత్రాలు ఇవ్వాలని, అక్టోబరు 5వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సుమారు 400 కి.మీ. మేర పోడు భూముల సమస్య పరిష్కారానికి భారీ స్థాయి నిరసన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.

అన్ని విపక్ష పార్టీలు ప్రజల, రైతుల సమస్యలపై ఏకం కావడం విశేషం. మొత్తం 11 డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణకు ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. పోడు భూముల సమస్య దీర్ఘకాలంగా కొనసాగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి ముందుకు రాలేదని, కంటితుడుపు చర్యగా కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ఇది సాగతీత ధోరణే తప్ప చిత్తశుద్ధికి నిదర్శనం కాదని సమావేశం తీర్మానించింది. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసుకుని అన్ని విపక్ష పార్టీలను ఒక్క తాటిపైకి తేవాలనే నిర్ణయం జరిగిందని ఈ మీటింగులో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల సాగుభూములు వివాదాస్పందంగా మారాయని, రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను అద్భుతమని పేర్కొంటున్నా ఇప్పటికీ సుమారు పాతిక లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే ఉండిపోయిందని, దీనికి అతీగతీ లేకుండా పోయిందని, అధికారులు కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారని సమావేశం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సామాన్య, పేద రైతులు చాలా నష్టపోతున్నారని అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం చేయాలని నిర్ణయించింది. దాదాపు ఇరవై నియోజకవర్గాల్లో పోడు రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినా ఇప్పటికి మూడేళ్లు కావస్తున్నా ఫలితం లేకుండాపోయిందని వ్యాఖ్యానించింది.

నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా…

రైతుల, ఆదివాసీల పోడు భూముల సమస్యలతో పాటు సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై అఖిలపక్ష సమావేశం లోతుగా చర్చించి పదకొండు తీర్మానాలను ఆమోదించింది. పోరాటం చేస్తున్న ప్రజలపై ప్రభుత్వాలు నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాయని, దేశద్రోహం లాంటి కేసులను బనాయిస్తున్నాయని, సమ్మె హక్కును కూడా లేకుండా చేస్తున్నాయని ఈ సమావేశం చర్చించింది. పెట్రో ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల సంస్కరణలు.. ఇలా అనేక అంశాలపై ఈ సమావేశం చర్చించి ఈ క్రింది డిమాండ్లను రూపొందించింది.

ఉచిత సామూహిక వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
కొవిడ్ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి
ఆదాయపు పన్ను పరిధిలో లేని ప్రతీ కుటుంబానికి నెలకు రూ. 7,500 సాయం చేయాలి. తలా పది కిలోల బియ్యాన్ని ఇవ్వాలి
పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ డ్యూటీ, సర్ ఛార్జీలను ఎత్తివేయాలి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. ఉత్పత్తి వ్యయంల 50% మిగులు ఉండేలా మద్దతు ధరకు అమ్ముకునే హక్కు కావాలి.
ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ, మానిటైజేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. మూసివేసిన పరిశ్రమలను తిరిగి తెరిపించాలి.
కార్మిక కోడ్ చట్టాలను రద్దు చేయాలి. సమ్మె సక్కును, వేతనాల పెంపు డిమాండ్లను పునరుద్ధరించాలి.
గ్రామీణ ఉపాధి సామీ గ్యారంటీ పని దినాలను 200కు పెంచాలి. వేతనాన్ని రెట్టింపు చేయాలి. పట్టణాల్లోనూ అమలుచేయాలి.
ప్రజలపై నిఘా పెట్టే పెగాసస్ గూఢచర్య స్పై వేర్ వినియోగంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలి.
దేశద్రోహం, జాతీయ భద్రతా చట్టాలను ఉపసంహరించాలి. బీమా కొరేగావ్, సీఏఏ వ్యతిరేక నిరసనకారులు సహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
అటవీ హక్కుల చట్టం, పీసా చట్టాలను అమలుచేయాలి. పోడు భూములకు సాగు హక్కు పత్రాలను ఇవ్వాలి.

సర్కారుకు పోడు భూముల భయం

“పోడుభూముల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీలు ఇచ్చినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది. పోడు భూములపై ప్రతిపక్ష పార్టీలు పోరాటం అనగానే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. అందుకే పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం సబ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఇది కంటితుడుపు చర్య మాత్రమే. సమస్య పరిష్కారమయ్యేవరకు మా పోరాటం కొనసాగుతుంది”.
-తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ప్రభుత్వాల పనితీరుకు నిరసనగా…

“కేసీఆర్, మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై మా పోరాటం ఉంటుంది. మొత్తం 19 రాజకీయ పక్షాల తరఫున సమిష్టి నిర్ణయం జరిగింది. సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకున్న పోరాటాల ప్రణాళిక ప్రకారం ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై పోరాటం చేస్తాం. సీపీఐ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటారు”.
-చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి-

ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు ..

“కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 22న ఇందిరా పార్కు దగ్గర మహా ధర్నా చేస్తున్నాం. ఈ నెల 27న రైతుల సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్‌లో పాల్గొంటున్నాం. ఈ నెల 30న అన్ని జిల్లాల కలెక్టరేట్‌లను ముట్టడించి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. అక్టోబర్ 5న పోడు భూముల డిమాండ్‌తో రాస్తారోకో పోరాటం నిర్వహిస్తాం. అటవీ హక్కుల చట్టం, పోడు రైతుల సమస్యల పరిష్కారం ప్రధాన డిమాండ్‌‌గా ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు పోడు రాస్తారోకోను విజయవంతం చేస్తాం”.
– ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు

ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు చోద్యం చూస్తున్నాయని, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదని సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈ నిరసన రూపాల ద్వారా తెలియజేస్తామన్నారు. ఈ సమావేశంలో చెరుకు సుధాకర్ (ఇంటి పార్టీ), గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ), రాజేశ్ (సీపీఐ ఎంఎల్ లిబరేషన్), ప్రదీప్ (పీవైఎల్), రాము (పీడీఎస్‌యూ) తదితరులు కూడా పాల్గొన్నారు.

Tags:    

Similar News