ఆ రైతుల ఆశలు త్వరలో నిజం కానున్నాయా..?

కొద్ది రోజులుగా కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇదే తరహాలో మరి కొద్ది రోజులు నీరు వచ్చి చేరితే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటాయి. వానాకాలం పంటలు సాగు చేసేందుకు రైతాంగం ఈ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కృష్ణానది […]

Update: 2020-07-24 20:51 GMT

కొద్ది రోజులుగా కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇదే తరహాలో మరి కొద్ది రోజులు నీరు వచ్చి చేరితే ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరుకుంటాయి. వానాకాలం పంటలు సాగు చేసేందుకు రైతాంగం ఈ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు.

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వారం రోజులుగా కృష్ణానది ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లా అంతటా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్న, మధ్య తరహా నీటి ప్రాజెక్టుల్లోకి సైతం వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు, మూసీ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తుండటంతో అధికారులు గేట్లు ఎత్తితే వానాకాలం పంటలు పుష్కలంగా సాగయ్యే అవకాశం ఉందని రైతులు ఆశలు పెట్టుకున్నారు.

సాగర్ లో 532 అడుగులకు చేరిన నీరు
శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగుల మట్టానికి పైగా నీరు వచ్చి చేరింది. నాగార్జునసాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 532 అడుగులకు చేరింది. సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 47,702 క్యూసెక్కులు కాగా, 1540 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 174.46 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

పులిచింతల ప్రాజెక్టులో 10.59 టీఎంసీలు
పులిచింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుతం అందులో 10.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులు కాగా.. ప్రస్తుతం 147.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు ఇన్ ప్లో 1474 క్యూసెక్కులు కాగా, 100 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఇలా…
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో అతిపెద్దది మూసీ ప్రాజెక్టు. దీని కింద సుమారు 30వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి తోడు సూర్యాపేట జిల్లా కేంద్రానికి తాగు నీరు అందించేందుకు ఈ ప్రాజెక్టే ఆధారం. మూసీ నది ఎగువ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తుండడం వల్ల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గేటు గతేడాది అక్టోబర్‌లో వరద నీటికి కొట్టుకుపోయింది. ఆ గేటు బిగింపు పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీని వల్ల ప్రాజెక్టులో ఎక్కువ మొత్తంలో నిల్వ చేయలేని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 645 అడుగుల(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 617.05అడుగులు(0.337టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 280 క్యూసెక్కులు కాగా, 10 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.

ఈ నీటిపైనే రైతుల ఆశలు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షం పడుతోంది. పది రోజుల క్రితం వరుణుడు కాస్త కంగారు పెట్టినా.. ప్రస్తుతం వానలు కురుస్తున్నాయి. దీంతో తటాపటాయిస్తూ ఈ ఏడాది సాగును మొదలుపెట్టిన రైతాంగానికి ప్రస్తుతం కురుస్తున్న వానలు కాస్త ఉపశమనాన్ని ఇస్తున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు, సూక్ష్మ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల్లోకి సైతం నీరు చేరుతుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సాగర్ ఆయకట్టు రైతులు ప్రాజెక్టు నీటి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News