వాళ్లు మళ్లీ రోడ్డెక్కారు..

దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా పస్తులతో ఉండలేమని, సొంతూరుకు పోవడమే మేలని కార్మికులు నిశ్చయించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో, హైదరాబాద్ నగరంలోని టోలీచౌకిలో వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి సొంతూరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని, రైళ్లను ఏర్పాటు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేయడానికి వచ్చిన ఉత్తరాది రాష్ట్రాల […]

Update: 2020-05-03 10:13 GMT

దిశ, న్యూస్ బ్యూరో: వలస కార్మికులు మరోసారి రోడ్డెక్కారు. కడుపులో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెప్పినా పస్తులతో ఉండలేమని, సొంతూరుకు పోవడమే మేలని కార్మికులు నిశ్చయించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో, ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో, హైదరాబాద్ నగరంలోని టోలీచౌకిలో వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి సొంతూరు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని, రైళ్లను ఏర్పాటు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. రామగుండంలోని ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేయడానికి వచ్చిన ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు సైట్‌‌లోనే ధర్నా చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని తదితర ప్రాంతాలకు చెందిన కార్మికులు ఖమ్మం జిల్లాలోని అశ్వారావు పేట సమీపంలోని చెక్‌పోస్టు దగ్గర రోడ్డుమీద ధర్నా చేశారు. ఇక హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్, ఆసిఫ్ నగర్, హుమాయిన్ నగర్ ప్రాంతాల్లో ఉంటున్న సుమారు వెయ్యి మందికి పైగా వలస కార్మికులు టోలిచౌకి ప్రాంతంలో రోడ్డెక్కారు.

హామీ ఇచ్చారు..

ఎప్పటినుంచో సొంతూర్లకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వీరికి ఇంతకాలం అవకాశం లేకపోవడంతో బాధను కడుపులోనే దిగమింగుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సొంతూర్లకు వెళ్లడానికి వెసులుబాటు కల్పించి ‘శ్రామిక్ ఎక్స్‌ప్రెస్’ పేరుతో రైళ్లను ఏర్పాటు చేయడంతో వెంటనే వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అయితే అందుకు తగిన విధానం తెలియకపోవడంతో ఒక్కసారిగా వారంతా రోడ్డుమీదకు వచ్చి ప్రభుత్వానికి నిరసన రూపంలో తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ‘సామాజిక దూరం’ లాంటి నిబంధనలేవీ వారు పాటించలేదు. పోలీసులు రంగంలోకి దిగి వారి సమస్యలను తెలుసుకుని ఇక్కడే ఉండేలా సకల ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా కార్మికులు సద్దుమణిగారు. కానీ దాదాపు వంద మంది మాత్రం నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. కానీ, అక్కడ రైళ్లేవీ ఏర్పాటు చేయలేదని స్టేషన్ అధికారులు చెప్పడంతో మళ్ళీ టోలీచౌకి ప్రాంతానికే చేరుకున్నారు. వీరిలో ఎక్కువగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికులే ఉన్నారు. వలస కార్మికులను ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలియడంతో రోడ్డుమీదకు వచ్చారు.

ఓపెన్ కావడం లేదు..

కార్మికుల నుంచి వివరాలను సేకరించిన వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ‘ఈ-పాస్’ ఉన్నవారికే సొంత రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంటుందని, అలాంటి పాస్ తీసుకోడానికి కార్మికులు http://tsp.koopid.ai/epass అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేస్తే ‘ఈ- పాస్’ జారీ అవుతుందని, వెరిఫికేషన్ తర్వాత వారిని సొంత రాష్ర్టాలకు పంపించడం వీలవుతుందని తెలిపారు. కానీ, ప్రస్తుతం ఈ లింక్ ఓపెన్ కావడం లేదు. ఆదివారం ఒక్క రోజే 7 వేల మందికి ఈ-పాస్‌లు జారీ అయినట్టు, మరో పది వేల పాస్‌లు అప్రూవల్ కోసం వేచి ఉన్నట్టు సమాచారం. దీంతో కొత్త పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోడానికి సాంకేతిక సమస్యలు అడ్డొస్తున్నాయి. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమవుతోందని, సరిచేసే ప్రయత్నంలో తమ విభాగం పనిచేస్తోందని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారికి ఈ-పాస్‌లు తొందరలోనే జారీ అవుతాయని, సమస్యను అర్థం చేసుకొని సహకరించాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదివారం ట్విట్టర్‌ ద్వారా వివరించారు.

tags: Migrant labour, telangana, lockdown, e-pass, DGP, railway

Tags:    

Similar News