ఒలింపిక్స్‌లో హాకీ పూర్వ వైభవం సాధించేనా..?
దిశ, స్పోర్ట్స్: ఒకప్పుడు హాకీలో ఇండియాను తలదన్నే జట్టే ఉండేది కాదు. అది ఏ మ్యాచ్ అయినా.. ఏ సిరీస్ అయినా ఇండియా ఆడుతుంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టేది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన ఏకైక జట్టు ఇండియా. ఏకంగా 8 స్వర్ణాలు సాధించిన ఇండియా 1932 నుంచి 1956 ఒలింపిక్స్ వరకు వరుసగా ఆరు స్వర్ణాలు గెలిచిన రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు. 1968, 1972లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న ఇండియా.. ఆ తర్వాత […]
దిశ, స్పోర్ట్స్: ఒకప్పుడు హాకీలో ఇండియాను తలదన్నే జట్టే ఉండేది కాదు. అది ఏ మ్యాచ్ అయినా.. ఏ సిరీస్ అయినా ఇండియా ఆడుతుంటే ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టేది. ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన ఏకైక జట్టు ఇండియా. ఏకంగా 8 స్వర్ణాలు సాధించిన ఇండియా 1932 నుంచి 1956 ఒలింపిక్స్ వరకు వరుసగా ఆరు స్వర్ణాలు గెలిచిన రికార్డు ఇంకా చెక్కు చెదరలేదు. 1968, 1972లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న ఇండియా.. ఆ తర్వాత జరిగిన ఒలింపిక్స్‌లో పతకం లేకుండానే వెనుదిరిగింది. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన టీమ్ ఇండియా ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు హాకీలో ఒక్క పతకం కూడా సాధించలేకపోయింది. ఒకప్పటి పూర్వ వైభవం కోసం ఎన్నో సార్లు ప్రయత్నించినా భారత జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా వంటి జట్లు ఇండియా బలహీన పడిన తర్వాత స్వర్ణ పతకాలు కొల్లగొట్టాయి. భారత్‌కు ఎప్పుడూ గట్టి పోటీ ఇచ్చే పాకిస్తాన్, మలేషియా దేశాలు ఈ సారి హాకీలో అర్హత సాధించలేక పోయాయి. కానీ గత కొన్ని నెలలుగా భారత హాకీ జట్టు ఫామ్ చూస్తే పతకం సాధిస్తుందనే నమ్మకం పెరుగుతున్నది.
బలమైన గ్రూప్‌లో..
భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో గ్రూప్ ఏలో చేర్చబడింది. ఈ గ్రూప్‌లో 2004లో స్వర్ణ పతకం సాధించిన ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్స్ అర్జెంటీనా. మూడు సార్లు రజత పతకాలు సాధించిన స్పెయిన్, 1976 ఒలింపిక్ విజేత న్యూజీలాండ్, ఆతిథ్య జపాన్, ఇండియా జట్లు ఉన్నాయి. మొత్తం 12 జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా.. వాటిని రెండు గ్రూప్స్‌గా విభజించారు. గ్రూప్ ఏలో భారత జట్టు ఉన్నది. ఈ గ్రూప్ లో ఉన్న జట్లన్నీ బలమైనవే. ముఖ్యంగా భారత జట్టుకు అర్జెంటీనా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. రెండు గ్రూప్స్ కలిపి 12 జట్లు ఉండగా.. వాటిలో నుంచి 8 జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉన్నది. భారత జట్టు గ్రూప్‌లో కనీసం 4వ స్థానంలో నిలిచినా క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే జపాన్, న్యూజీలాండ్ జట్లను భారత్ ఓడించే అవకాశం ఉన్నది. స్పెయిన్‌పై కూడా ఇటీవల కాలంలో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియాల నుంచే భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నది. గ్రూప్ దశలో 5 మ్యాచ్‌లకు గాను ఇండియా 4 మ్యాచ్‌లు గెలిస్తే క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు. హాకీ విశ్లేషకుల అంచనాల మేరకు భారత జట్టు సెమీఫైనల్ వరకు చేరుకోవడం ఖాయమని తెలుస్తున్నది.
మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో..
మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్సీలో భారత హాకీ జట్టు ఇటీవల కాలంలో మంచి విజయాలను సాధించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడించి తమ సత్తా చాటుతున్నది. గత 10 మ్యాచ్‌లలో భారత జట్టు 7 మ్యాచ్‌లలో గెలుపొందింది. కేవలం రెండు మ్యాచ్‌లలో ఓడిపోయి మరో మ్యాచ్ డ్రా చేసుకుందంటే టీమ్ ఇండియా ఎలాంటి ఫామ్‌లో ఉందో అర్దం చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ వంటి జట్లపై గెలిచి ఒలింపిక్స్‌లో తాము బలమైన పోటీదారులమని చాటి చెప్పింది. హాఫ్ బ్యాక్‌లో కెప్టెన్ మన్‌ప్రీత్‌తో పాటు డిఫెండర్స్ హర్మన్ ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ జట్టుకు వెన్నెముక లాంటి వారు. ఇక గోల్స్ చేయగల సత్తా ఉన్న షంషీర్ సింగ్, లలిత్ కుమార్, గుర్జంత్ సింగ్ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భారత జట్టును చూస్తే తప్పకుండా మెడల్ సాధిస్తుందనే నమ్మకం ఉన్నట్లు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై కూడా వ్యాఖ్యానించారు. గత కొన్ని నెలలుగా భారత జట్టు అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు ఫిట్‌నెస్ పైన కూడా దృష్టి పెట్టింది. ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న భారత జట్టు 41 ఏళ్ల హాకీ పతాక దాహాన్ని తీర్చే అవకాశం ఉన్నది.
హాకీ
భారత పురుషుల జట్టు : మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), పీఆర్ శ్రీజేశ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపీందర్ పాల్ సింగ్, పురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్, వివేక్ సాగర్ ప్రసాద్, నీలకంఠ శర్మ, సుమిత్, షంశీర్ సింగ్, దిల్ ప్రీత్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, మన్‌దీప్ సింగ్
మ్యాచ్‌లు..
జులై 24 – న్యూజీలాండ్ Vs ఇండియా
జులై 25 – ఆస్ట్రేలియా Vs ఇండియా
జులై 27 – స్పెయిన్ Vs ఇండియా
జులై 29 – అర్జెంటీనా Vs ఇండియా
జులై 30 – జపాన్ Vs ఇండియా