హైదరాబాద్‌లో 'ఆక్టోపస్' తనిఖీలు.. ఎందుకంటే?

ఢిల్లీ తరహా అల్లర్లు జరిగితే హైదరాబాద్ నగరం పరిస్థితేంటి? పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయా? శాంతిభద్రతలను అదుపులోకి తేవడం ఎలా? సున్నితమైన ప్రాంతాల్లో అల్లర్లకు ఉన్న అవకాశాలేంటి? ప్రజల్లో అవగాహన కల్పించాలని భావించిన నగర పోలీసు విభాగం రంగంలోకి దిగింది. ఇందుకోసం అత్యవసర సమయాల్లో రంగంలోకి దిగే ఆక్టోపస్ బలగాలు కూడా రోడ్డుమీదకు వచ్చాయి. పేరుకు ‘మాక్ డ్రిల్’ అయినా ప్రజల్లో అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. నగరంలోని ముసారంబాగ్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో […]

Update: 2020-02-28 02:03 GMT

ఢిల్లీ తరహా అల్లర్లు జరిగితే హైదరాబాద్ నగరం పరిస్థితేంటి? పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉన్నాయా? శాంతిభద్రతలను అదుపులోకి తేవడం ఎలా? సున్నితమైన ప్రాంతాల్లో అల్లర్లకు ఉన్న అవకాశాలేంటి? ప్రజల్లో అవగాహన కల్పించాలని భావించిన నగర పోలీసు విభాగం రంగంలోకి దిగింది. ఇందుకోసం అత్యవసర సమయాల్లో రంగంలోకి దిగే ఆక్టోపస్ బలగాలు కూడా రోడ్డుమీదకు వచ్చాయి. పేరుకు ‘మాక్ డ్రిల్’ అయినా ప్రజల్లో అవగాహన కల్పించి అప్రమత్తంగా ఉండాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. నగరంలోని ముసారంబాగ్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో సుమారు నలభై మంది ఆక్టోపస్ బలగాలు ఏకకాలంలో వాహనాలను తనిఖీ చేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకముందే తగినంత తీరులో సన్నద్ధంగా ఉండాలని ఈ ‘మాక్ డ్రిల్’కు శ్రీకారం చుట్టారు.

ఉదయం ఆఫీసుకు వెళ్ళే సమయాన్ని అనువుగా ఎంచుకున్న పోలీసు బలగాలు రద్దీగా ఉండే రోడ్లపై వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనాలను క్షుణ్ణంగా సోదాలు చేశారు. అందులో ప్రయాణించే వ్యక్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. విజయవాడకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్ని కూడా సోదా చేసి ప్రయాణీకులను ప్రశ్నించారు. ఇది ‘మాక్ డ్రిల్’ అయినప్పటికీ ప్రజలకు మాత్రం ఆ ఫీలింగ్ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నడూ రోడ్లమీదకు రాని ‘ఆక్టోపస్’ బలగాలు ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుండడంతో ఏదో జరుగుతోందనే అవగాహన ప్రజల్లో పెరిగింది.

పోలీసు వర్గాలను సంప్రదించిన తర్వాత ఇది ‘మాక్‌డ్రిల్’ మాత్రమే అనేది స్పష్టమైంది. ప్రజల్లో అవగాహన కల్పించి అప్రమత్తం చేయడంతోపాటు పోలీసు బలగాల సన్నద్ధతను తెలుసుకోడానికి కూడా ఇది ఉపయోగపడిందని, ఇకపైన ఇలాంటివి తరచూ నిర్వహించే ఆలోచన ఉందని ఒక పోలీసు అధికారి బదులిచ్చారు. ఇప్పటికే ‘కార్డన్ సెర్చ్’ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ఇప్పుడు ‘మాక్ డ్రిల్’ ద్వారా మరింతగా సన్నద్ధమవుతున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..